1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, నవంబర్ 2009, సోమవారం

సున్నితత్వాల సద్వినియోగం




న్నితత్వం (sensitivity) అనే మాటకి ఎవరి నిర్వచనం వారికుందనుకుంటా. ఉదాహరణకి - తాము చాలా సున్నితమనీ, తమ స్త్రీత్వాన్ని నిర్వచించేది అదేననీ దాదాపుగా స్త్రీలంతా అనుకుంటారు. సున్నితత్వ పరిధుల్ని దాటకుండా ప్రవర్తించడానికి వారు యథాశక్తి ప్రయత్నిస్తారు. తమ సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తమ పట్ల వ్యవహరించడమే కొందఱాడవాళ్ళు కొందఱు మగవాళ్లని ద్వేషించడానిక్కూడా కారణం కావచ్చు. మఱికొందఱి దృష్టిలో ఆడవాళ్ళ కంటే చిన్నపిల్లలు ఎక్కువ సున్నితం. వీళ్ళిద్దఱి కన్నా ముసలివాళ్ళెక్కువ సున్నితమని ఇంకొందఱి అభిప్రాయం. ఇలాంటివి విన్నప్పుడు వారివారి వాస్తవ భౌతికస్థితులకి ఊహాజనితమైన మానసిక సున్నితత్వాన్ని కూడా జతచేఱుస్తున్నారేమో ననిపిస్తుంది. కారణం - ఎదిగిన మగవాళ్ళకి ఈ సున్నితత్వాల సాంప్రదాయిక జాబితాలో ఎందుకో స్థానం లేదు. కానీ నేను చూసినంతవఱకు వాళ్ళలో కూడా చాలామంది సున్నితమైనవారే, మానసికంగా !

మఱి సున్నితత్వాన్ని ఎలా కొలవాలి ? అసలు సున్నితత్వమంటే మనం అనుకుంటున్నదేనా ? ముట్టుకుంటే కందిపోవడం, కాస్తపాటి శ్రమకే అలిసిపోవడం, శారీరిక అవసరాలకి ఆగలేకపోవడం, ఎవరితోనూ పోరాడలేకపోవడం - ఇవా సున్నితత్వమంటే ? లేక, ఏ కొత్త పరిస్థితికీ తట్టుకోలేకపోవడం, ప్రతిదానికీ బాధపడ్డం, భయపడ్డం, అన్నిటికీ ముందు భోరున ఏడ్చేసేయడం, మనుషుల మీద అతిగా ఆదరాభిమానాల్ని ప్రదర్శించి దరిమిలా దెబ్బదినడం - ఇవా సున్నితత్వమంటే ?

నా పరిశీలనలో సున్నితత్వమంటే ఇవేవీ కావు.

సున్నితత్వం అనేది పుట్టుకతో వచ్చేది కాదు. దానికి ఆడతనంతో గానీ, మగతనంతో గానీ, శారీరిక శక్తితో గానీ దాని లేమితో గానీ సంబంధం లేదు. అది కాలక్రమేణా అసంకల్పితంగా అభ్యసిస్తూ పోగా అలవడేది. అది పరిజ్ఞాన స్థాయి (Awareness level) కి సంబంధించినది. మనకి ఏ విషయం మీదనైతే పరిజ్ఞానం హెచ్చుగా ఉంటుందో ఆ విషయంలో మన మనస్సుకి సున్నితంగా స్పందించే తత్వం కూడా హెచ్చుగా ఉంటుంది. మనకి ఏ విషయాల లోతు ఎంతగా అర్థమవుతుందో ఆ విషయాల్లో మనం అంతగా సున్నితమైపోతాం. ఇందుకు విపర్యాసంగా - మనం నిర్లక్ష్యం చేసేవీ, త్రోసిపుచ్చేవీ, మొఱటుగా ప్రవర్తించేవీ అయిన విషయాలు సాధారణంగా మనకి చాలినంత పరిజ్ఞానం లేనివై ఉంటాయి. మన మనస్సు ఏ విషయాలకైతే తెఱుపుడు పడకుండా మూతవేసుకుందో ఆ విషయాల్లో మనం వివేకహీనంగా, క్రూరంగా ప్రవర్తిస్తాం.

ఒకరకంగా - సున్నితత్వమంటే సమాచార స్థాయిని దాటిపోయి హృదయకోశపు భావోద్వేగాల స్థాయి (Emotional level) కి చేఱుకున్న జ్ఞానం అని చెప్పుకోవచ్చు. అందుచేత సున్నితత్వం ఒక సంస్కారం. సంస్కారం అంటే అసంకల్పిత, అంతర్గత జ్ఞానమే. ఒక ఉదాహరణతో దీన్ని తెలుసుకోవచ్చు. ఒక కొత్త పట్టణంలో నివసించడం మొదలుపెట్టినప్పుడు మొదట్లో మన దృష్టి వీథుల మీదా, మలుపుల మీదా, కొండగుర్తుల మీదా ఉంటుంది. కానీ అలవాటయ్యాక మనం ఏదో ఆలోచిస్తూండగానే, లేదా పక్కన కూర్చున్న మిత్రుడితో కబుర్లు చెబుతుండగానే ఇంటికి చేఱుకుంటాం. పరధ్యానంలో ఉన్న వ్యక్తిని ఇక్కడ ఇంటికి చేఱవేసినదెవరు ? దారి సరిచూసిందెవరు ? మనమా ? మిత్రుడా ? వాహనమా ? ఎవరూ కాదు, ఒకనాటి స్పృహలోని జ్ఞానమే (conscious knowledge) ఈనాటి స్పృహలేని జ్ఞానమైంది. దాన్నే ’సంస్కారం’ అన్నారు పెద్దలు.

మనలో సర్వతోముఖ సున్నితత్వం లేనప్పుడు, మన సున్నితత్వం కొన్ని విషయాలకి మాత్రమే పరిమితమైనప్పుడు, ఆ పరిమిత సున్నితత్వపు స్థాయి నుంచి ఎదగడానికి ఇష్టపడనప్పుడు మనం అనేక తప్పులకి ఒడిగడతాం. మన గుఱించి మన అభిప్రాయం ఎంత మహోన్నతమైనప్పటికీ వాస్తవంలో అత్యంత సామాన్యులుగా మిగిలిపోతాం. ఈ విషయాన్ని మనం గ్రహించాక తప్పులు చేసేవారి సున్నితత్వం యొక్క బాహ్యదారిద్ర్యం పట్ల అసహ్యమూ, కోపమూ కాకుండా వాటి స్థానంలో జాలి ప్రవేశిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో కఠినాత్ములంటూ ఎవరూ లేరని మనకి స్పష్టమవుతుంది. వందమందిని చంపేసిన నేరస్థుడి సున్నితత్వ సామర్థ్యం (sensitivity potential) మన సున్నితత్వపు సామర్థ్యానికి ఎంతమాత్రమూ తీసిపోదు. వాస్తవానికి అతను ఉరికంబం ఎక్కినప్పుడు ఒక సున్నిత హృదయుడుగానే చనిపోతాడు. "మఱి అంతర్గతంగా అంత సున్నితత్వ సామర్థ్యం గలవాడు ఎందుకంత క్షమించరాని తప్పులు చేశాడు ? ఎవరి ఆర్తనాదాలూ అతని మనస్సుని ఎందుకు కదిలించలేకపోయాయి ?" అనడిగితే, మనమంతా ఏ పాక్షిక సున్నితత్వ దారిద్ర్యంతో బాధపడుతున్నామో అతనూ అదే సమస్యతో బాధపడుతున్నాడు. మనదీ సంపూర్ణ సున్నితత్వం కాదు. అతనిదీ సంపూర్ణ సున్నితత్వం కాదు. కానీ అతని కార్యకలాపాల రంగమూ (line of activity), మన కార్యకలాపాల రంగమూ ఒకటి కాకపోవడం ఒకటే, అతను చెఱసాలలోను, మనం బయటా కనిపించడానిక్కారణం. ఇతరేతర సున్నితత్వాల్ని కనుగొనడానికి అవకాశమిచ్చే సంఘటనలు అతని జీవితంలో ఎప్పుడూ జఱగలేదు. అది అతని తప్పు కాదు. అతన్ని మనం ద్వేషించడమూ, శిక్షించాలని కోరడమూ జీవసహజమైన భయంతోనే తప్ప మనం అతనికంటే ఒక వాసి ఎక్కువ సున్నిత హృదయులం కావడం వల్ల మాత్రం కాదు.

తేనెపట్టుకు ఉన్న అఱల్లాగా మనస్సుకు సున్నితత్వపు అఱలున్నాయి. మనం కొన్ని అఱల్ని తెఱిచి పెడుతున్నాం. మఱికొన్ని అఱల్ని మూసిపెడుతున్నాం. అదీ, శాశ్వతంగా ! బయట సున్నితత్వపు గాలులు వీచినప్పుడల్లా అవి అఱల్లోకి ప్రవేశించకుండా ఉద్దేశపూర్వకంగా మూసేస్తున్నాం కొన్నిసార్లు ! సమగ్రమూ, సర్వతోముఖమూ కాకపోవడం చేత మన సున్నితత్వం చాలాసార్లు దుర్వినియోగం కూడా అవుతున్నది. మన సున్నితత్వం మన పిల్లల కష్టాన్ని మాత్రమే చూడగలిగితే, అదే సమయంలో అది వారి ఉపాధ్యాయుల కష్టాన్ని విస్మరిస్తోంది. అంటే ఉపాధ్యాయులకి సంబంధించిన సున్నితత్వపు అఱలు మూసివేయబడుతున్నాయి. అలా మన సున్నితత్వాలు మన హృదయాల్ని, ఆత్మల్ని బాగుచెయ్యడం మానేసి వాటిని కళంకితం కావిస్తున్నాయి. గుండెకవాటాల్లో ఏ ఒక్కటి మూసుకుపోయినా ఆ వ్యక్తిని ఆరోగ్యవంతుడనలేం. అటువంటప్పుడు ఇన్ని అఱల్ని మూసేసుకున్న మనం ఆరోగ్యవంతులమేనా ? అన్ని కవాటాలూ మూసుకుపోయినప్పుడు ఒకే ఒక్క కవాటం పనిచేస్తున్నప్పటికీ అది దానికి భారంగానే ఉంటుంది. అన్ని సున్నితత్వాల్నీ మూసేసుకుని కేవలం ఒకటో రెండో సున్నితత్వాల్ని మాత్రమే కలిగి ఉంటే ఇవి మిహతావాటికి ప్రతిగా విధుల్ని నిర్వర్తించజాలవు. ఇవి వాటికి ప్రత్యామ్నాయం కావు. వాటి లోటుని ఇవి భర్తీ చెయ్యజాలవు

కామెంట్‌లు లేవు: