1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

6, నవంబర్ 2009, శుక్రవారం

కర్మ,వికర్మ,అకర్మ

భగవద్గీతలో కర్మ,అకర్మ,వికర్మ ల గురించి పేర్కొనబడినది. అవేమిటో ఒకసారి చూద్దాం.

కర్మ: కర్మ అనగా సాధారణముగా పని అని అర్థము.ఈ పని ఏవిధముగా ఉండవలనంటే లోకమునకు విరుద్ధముగా ఉండకుండా అనగా లోకహానికి కారణము కాకుండా ఉండాలి. మనము కర్మలను మనఃపూర్వకముగా చేయాలి.కాని వాటి ఫలితముపై ఆసక్తి చూపరాదని భగవద్గీతలో భగవంతుడు అంటాడు. కర్మ కోసమే కర్మ,ప్రేమ కోసమే ప్రేమ ఉండాలి.
వికర్మ: అనగా చేయకూడని కర్మ(పని). అనగా లోకహితము కాని పనులు.

అకర్మ: అకర్మ అనగా పనిచేయకుండా ఉండడము అనేది సామాన్య అర్థము. కాని అసలు అర్థము అది కాదు. అకర్మ అనగా కర్మ చేస్తున్నా మన మనసు ప్రశాంతముగా ఉండాలి. భగవద్గీతలో భగవానుడు దీనినే అత్యంత స్పష్టముగా చెప్పాడు. "ఎవరైతే అత్యంత కర్మ(పని) స్థితిలో ఉన్నా అతని మనసు అత్యంత ప్రశాంతముగా ఉంటుందో(అకర్మను చూస్తాడో), అలాగే అత్యంత ప్రశాంత స్థితిలో కూడా(అకర్మలో కూడా) తీవ్రమైన కర్మను చూస్తుంటాడో అతనే నిజముగా కర్మను తెలిసినవాడు.అతనే కర్మ యోగి."

దీనినే కొద్దిగా వివరముగా చూద్దాం.మీరు పూర్తిగా ట్రాఫిక్‌జాము లో ఇరుక్కుపోయారనుకోండి. చుట్టుప్రక్కల నుండి అందరూ హారన్‌లు మ్రోగిస్తున్నారు. ఎవరో గలాట పడుతున్నారు. అంతా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మీ మనసు యొక్క ప్రశాంతతకు ఏ విధమైన భంగము కలగకుండా ఉండాలి.అంటే ఎవరూలేని ఏకాంత గుహలో మీ మనసు ఎలా నిశ్చల స్థితిలో ఉంటుందో అలా ఉండాలి.అనగా శరీరం అత్యంత కార్యనిర్వహణలో ఉన్నా మనసు అత్యంత ప్రశాంతముగా ఉండాలి.అదీ నిజమైన కర్మయోగి స్థితి.

అలాకాక ఏకాంతగుహలో ఉన్నా మనసు ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుంటూంటే అది నిజమైన కర్మ అనిపించుకోదు.
ఇక అకర్మ లో కర్మను చూడడము అంటే చుట్టూ జరుగుతున్న పనులను లేక జగద్‌వ్యాపారమును ఎటువంటి మనశ్చాంచల్యము లేకుండా ఒక సాక్షిగా చూడడము.

ఎవరైనా చెస్(చదరంగము) ఆడుతుంటే వారికి కూడా రాని మంచి ఎత్తులు ఊరకే చూసే మనకు వస్తుంటాయి. అలాగే మన ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయనే భావం మనలో కనుక ఉంటే మనం సాక్షిగా ఆ పని ఇంకా బాగా చేయగలము.
మీరు ఒకటి గమనించే ఉంటారు.పంకా(fan) అత్యంత వేగముగా తిరిగేటప్పుడు అసలు అది తిరగనట్టే నిశ్చలస్థితిలో ఉన్నట్టు కనపడుతుంది.ఇక్కడ తీవ్రకార్యపరత్వములో ఉన్నప్పటికీ ప్రశాంతముగా ఉన్నట్టే అనిపిస్తుంది.
దీనినే ఇంకా వివరముగా చూడాలంటే "కర్మయోగ రహస్యము" చూడండి.

ఉదాహరణలు:

మనము తిరుపతి నుండి రాత్రి బయలుదేరి ప్రొద్దున్నే హైదరాబాదుకు చేరుతాము. మనము బస్సు కానీ రైలుకానీ ఎక్కినా మనము నిద్రపోతాము. ప్రొద్దున్నే చేరుతాము. అక్కడ మనం చేసిన పని ఏమీ లేదు. ఆ వాహనమే మనలను తీసుకు వచ్చింది. కాని మనమే వచ్చామంటాము. ఇది అకర్మలో కర్మను చూడడం.
పిల్లవాడు బాగా అలసిపోయి ఏమీ తినకుండా రాత్రి పడుకున్నాడనుకొందాం. అమ్మ వాడిని లేపి అన్నం తినిపిస్తుంది. వాడు నిద్రలోనే తింటాడు. వాడికేమీ గుర్తుండదు. ప్రొద్దునలేచి రాత్రి నేను ఏమీ తినలేదు అంటాడు. దీనిని కర్మలో అకర్మను చూడడము అంటారు.

వీటిని కేవలం ఉదాహరణలుగా మాత్రమే తీసుకోండి.

అలాగే మన మనసు సదా భగవంతుని పాదచరణాలపైనే ఉంటూ మన శరీరం మాత్రం దాని పని అది చేస్తూ ఉండాలి. మన ఇంద్రియాలు వాటి పనులు అవి చేస్తున్నాయని,నేను ఏమీచేయడం లేదనే భావంలో మనం నెలకొని ఉండాలి.

కామెంట్‌లు లేవు: