ఆదర్శదాంపత్యం ఎలా ఉండాలి? (అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర)
ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలి? అనే విషయాన్ని ఓ రెండు పక్షుల మాటల్లో మనుచరిత్రలో పెద్దన ఎంతో అందంగా, సందేశాత్మకంగా వివరించి చెప్పాడు. మార్కండేయ పురాణం ఆధారంగా రూపొందిన మనుచరిత్ర ఆరో ఆశ్వాసంలో హంసి చక్రవాక సంవాదం అనే ఓ కథ ఉంది. ఇందులో చక్రవాక పక్షి హంసి (ఆడహంస)కి భార్యాభర్తల బంధం విలువను ఇలా తెలియజెప్పింది.
పూర్వం స్వరోచి అనే రాజు ఉండేవాడు. ఆయన విద్యావంతుడు, బుద్ధిమంతుడై ఉండి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తుండేవాడు. అలాంటి స్వరోచి ఓ సంఘటనలో ఒకేసారి ముగ్గురిని పెళ్ళాడాల్సి వచ్చింది. తొలిగా మనోరమను, ఆ తర్వాత ఆమె స్నేహితురాళ్ళయిన విభావసి, కళావతి అనే మరో ఇద్దరు కన్యలనూ వివాహమాడాడు. మనోరమను వివాహమాడినందుకు ఆమె తండ్రి నుంచి ఆయుర్వేద విద్యను, విభావసి వల్ల మృగ, పక్షి జాతుల సంభాషణలను తెలుసుకొనే విద్యలను, కళావతి వల్ల సర్వ అభీష్టాలు తీర్చే పద్మినీ అనే విద్యను పొందాడు స్వరోచి. పద్మినీ విద్య ప్రభావంతో సంమృద్ధిగా అన్నపానీయాలు, వస్త్రాభరణాలు తరగని సర్వసంపదలను సొంతం చేసుకున్నాడు. నిరంతర సుఖ జీవనం ఆయనకు ప్రాప్తించింది.
నిత్యం తన భార్యలను తీసుకొని గంగానది ఒడ్డున ఉన్న అందమైన ఇసుక తిన్నెల మీద పూలతోటల్లో సరోవర తీరాలలోనూ హాయిగా విహరిస్తుండేవాడు. ఇలా విహరిస్తున్న రోజుల్లో ఓ రోజున స్వరోచి అందమైన చందన వృక్షాల సమీపంలో ఉన్న ఒక సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ సరస్సులో ఆనందంగా విహరిస్తున్న ఓ ఆడహంస అక్కడికి సమీపంలో విహరిస్తున్న ఆడ చక్రవాక పక్షిని తన వద్దకు రమ్మని రహస్యంగా పిలిచింది. స్వరోచిని.. అతడి భార్యలను చూపించింది. ఇలా ఏ భేదమూ లేకుండా ముగ్గురు స్త్రీలు ఒక పురుషుడితో జత కూడి వినోదించటమంటే ఎంత అదృష్టమోగదా, వారు పూర్వ జన్మలలో ఎంత గొప్ప తపస్సు చేశారో కదా అని అంది.
అలాగే భార్యకు భర్తపైన, భర్తకు భార్యపైన వలపు కలగటం లోకసామాన్యమైన విషయమే కానీ భార్యాభర్తలిద్దరికీ ఒకరిమీద మరొకరికి కొద్దిగా కూడా తేడా లేకుండా వలపు సమానంగా ఉండటం మాత్రం పూర్వజన్మ పుణ్యఫలమనే నా భావన. ఈ ముగ్గురు స్త్రీల మీద రాజుకు ప్రేమ ఉన్నట్లే ఆ రాజుపై కూడా స్త్రీలకు సమాన ప్రేమ ఉంది. పువ్వు, పరిమళం పరస్పరం కలిసి ఉన్నట్టే వీరి ప్రేమానురాగాలు నాకు కనిపిస్తున్నాయి అని అంది ఆడహంస.
అప్పుడు చక్రవాకం హంసికి వాస్తవం ఏంటో నిర్మొహమాటంగా తెలియజెప్పాలనుకొని ఇలా అంది. 'చూడు హంసి.. పైపైకి కన్పిస్తున్న ఈ భోగాల మెరుగులు చూసి ఇవన్నీ గత జన్మపుణ్య ఫలాలని అనుకోవటం నాకు వింతగా అనిపిస్తుంది. ఈ రాజు ఒక స్త్రీతో మిగిలిన ఇద్దరిముందూ రమిస్తున్నా ఆ ఇద్దరూ వారిని ఏవగించటం, కోపగించటం ఏమీ చేయటం లేదు. ఆత్మ గౌరవాన్ని వదిలి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ప్రేమను నీవు కూడా సమర్థిస్తూ స్తుతించటం ఏమీ బాగాలేదు. ఇలాంటిది కపట ప్రేమ తప్ప మరేమీ కాదు.
ఒక పురుషుడికి అనేక స్త్రీల మీద, అనేక స్త్రీలకు ఒక పురుషుడి మీద అనురాగం కలగటంలో ఎప్పుడూ పారదర్శకత ఉండదు. స్వరోచికి అతడి భార్య మీదకానీ, భార్యలకు స్వరోచిపై కానీ నిజమైన ప్రేమ కొంచెం కూడా లేదన్నది నా భావన. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను విను. రాజు తనను సేవించే పరివారం అందరితో అనుకూలంగానే మాట్లాడినా అందరి మీదా అతడికి స్వచ్ఛమైన అనురాగం ఉండదు. అలాగే ఎంతమంది భార్యలున్నా మగవాడికి ఆ అందరి మీద గాఢానురాగం ఉండదు.
తన భర్త మరొక స్త్రీని తన ఎదుటే కలిస్తే ఏ స్త్రీ కూడా ఆ భర్తపై మమకారంతో మెలగదు. ఇది అక్షర సత్యం. కనుక ఈ స్త్రీలకు ఈ రాజుమీద అభిమానం, మమకారం అనేవి ఉండనే ఉండవు. మరి ఎందుకిలా కలిసి ఉన్నారంటావా? అదంతా ధనాన్ని ఆశించి మాత్రమే. దాసదాసీ జనం ధనవంతుడిని చేరినట్లే వీరూ అలా చేరారు. అందుకనే వీరి దాంపత్యాన్ని నేను గొప్ప దాంపత్యం అని అనడం లేదు. ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద, ఒక స్త్రీకి ఒక పురుషుడి మీద మాత్రమే కలిగిన అనురాగం శ్రేష్టమైంది. స్త్రీలలో నేను, పురుషుల్లో నా భర్త ఈ వాస్తవాన్ని గ్రహించి అలా మెలుగుతున్నాం కనుకనే మాది ఆదర్శ దాంపత్యం అయింది. ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఉంటేనే అన్ని విధాలా శ్రేయోదాయకం' అని ఆడ చక్రవాక పక్షి హంసితో చెప్పింది.
ఏనాడో పెద్దన చేతుల్లో రూపొందిన మనుచరిత్రలో ఈనాటి వారిక్కూడా ఆచరణ యోగ్యమైన నైతిక విలువలతో కూడిన ఒక జీవన సూత్రం ఇలా ఇక్కడ కనిపిస్తోంది. స్త్రీ లౌల్యాన్ని నిరసిస్తూ రెండు పక్షుల మాటల్లో అల్లసాని పెద్దన ఇంత చక్కటి సందేశాన్ని మానవాళికి అందించాడు.
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి