1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

8, జనవరి 2010, శుక్రవారం

పాఠాలు నేర్పే గురువులను చులకనగా చూసేవారికి ఈ సంఘటన ఒక కనువిప్పు


పాఠాలు నేర్పే గురువులను చులకనగా చూసేవారికి ఈ సంఘటన ఒక కనువిప్పు కావాలి.

ఈ సంఘటన నిజంగా జరిగిన సంఘటన.
కంచి కామకోటి పీఠంలో జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతులవారు పీఠాధిపతిగా ఉన్న రోజులవి.
ఒక రోజు ఆయన గదిలో ఉండగా ప్రొద్దునపూట అక్కడి వేదపాఠశాలలో చదివే పిల్లలు అరుస్తూ ఆడుకొంటున్న శబ్దం వినిపించింది. ఈ సమయంలో తరగతిలో చదువుకొనకుండా బయట ఎందుకు ఆడుకొంటున్నారని పరమాచార్యులవారు బయటికి వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు తరగతికి వెళ్ళలేదు? అని అడిగారు. గురువు గారు రాలేదని ఆ పిల్లవాడు చెప్పాడు. పక్కన ఆడుకొంటున్న ఇంకో పిల్లవాడు జోక్యం చేసుకొని "గురువు గారు పాఠం చెప్తున్నారు. మేమే బయటకు వచ్చి ఆడుకొంటున్నాము" అన్నాడు. ఇద్దరిలో ఎవరిది నిజమో కనుగొనడానికి పరమాచార్యులవారు ఇద్దరినీ వెంటబెట్టుకొని తరగతి గది వద్దకు వెళ్ళి చూస్తే గురువుగారు లేరు.

అప్పుడు పరమాచార్యుల వారు రెండవ పిల్లవాడితో అబద్దం ఎందుకు చెప్పావంటూ ప్రశ్నించారు. ఆ పిల్లవాడు ఏ మాత్రం భయపడకుండా " రోజూ వచ్చే మా గురువు గారు ఈ రోజు ఏదో అత్యవసర పని మీద రాలేకపోయుంటారు. వారు రాకపోయినా తరగతిలో కూర్చొని చదువుకోవలసిన బాధ్యత మాది. కాని మేము అలా చేయలేదు. అంటే తప్పు మాది. గురువుగారు రాలేదని మీరుఆయనను కోప్పడతారు. మీ కోపాన్నుండి ఆయననను తప్పించడానికి చిన్న అబద్దం చెప్పడం నేను ధర్మమే అనుకొంటున్నాను. ఈ సమయంలో చదువుకోక ఆడుకోవడం మా తప్పే." అన్నాడు.

అంతటి నడిచే దేవుడిగా పేరొందిన పరమాచార్యులవారు కూడా ఆ పిల్లవాడి గురుభక్తిని చూసి ఆశ్చర్యం పొందారు.
నీవురా నిజమైన శిష్యుడివి "అంటూ ఆ పిల్లవాడి భుజం తట్టారు పరమాచార్యులవారు.

నేడు కళాశాల విద్యార్థులైనంత మాత్రాన కొమ్ములు వచ్చేసినట్లు ప్రవర్తిస్తూ గురువులను అవమానిస్తున్న వారిని, అలా చేయడానికి ప్రోత్సాహం ఇస్తున్న సినిమాలు,TVలు, పత్రికలు పైన పేర్కొనబడ్డ అబ్బాయి కాలి గోటికి సరిపోతారేమో ఆలోచించండి

కామెంట్‌లు లేవు: