1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, ఫిబ్రవరి 2010, గురువారం

సుమతీ శతకములు

1.శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ!

తాత్పర్యము:
ఓ బుద్ధిమంతుడా! శ్రీరాముని అనుగ్రహముచేత జనులంతా నిక్కముగా అచ్చెరువొందేటట్లుగా, నోరు వూరగా జనించిన రసముల వలే శ్రేష్ఠమైన నీతులను నా నోటినుండి చెప్పెదను.


2.అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీనీ వేల్పు,మోహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ

తాత్పర్యము:
అవసరానికి పనికి రాని బంధువు,పూజించినా కరుణించని దైవము,యుద్ధములో కదలని గుర్రము, వెంటనే విడిచిపెట్టాలి.
ఇక్కడ ఎవ్వరినీ అందులోను మనకు విఙ్ఙానాన్ని సాహితీ సంపదగా అందజేసిన పూర్వికులను తప్పు పట్టడం నా అభిమతం అస్సలు కానే కాదు.కాని నా మదిలోని భావనను,నాకు కలిగిన ఆలోచనలను పంచుకోవటం అనే వుద్దేశం తప్ప మరింకేమి లేదు.మన తల్లి తండ్రులు మనకేమి కావలో మన అవసరాలకు తగ్గట్లుగు అని అమరుస్తారు.మనకి ఎంత ఇష్టమైనవైనా మన ఆరొగ్యానినికి హాని కలిగిచే తిండి పదార్ధాలు ఇవ్వరు అలాగే మన భవిష్యత్తు దెబ్బ తీసేటటువంటి వాటీని ప్రోత్సహించరు.మనకి ఎప్పుడు ఏవి కావలో తెలుసుకుని అవి అమరుస్తూ వుంటారు.భగవంతునికి-మనకు మధ్య అనుబంధం తల్లితండ్రులు-పిల్లల అనుబంధం వంటిదని మన సాంప్రదాయం చెపుతోంది.ఆ విధంగానే పార్వతీ పరమేశ్వరులును మన తల్లి తండ్రులుగా కొలుచుకుంటున్నము.మన తల్లితండ్రులు మనలను విధంగా ముద్దుగా చూసుకున్నారో మనము మన పిల్లలను అలాగే చూసుకుంటాము.మనుషులము మనమే మన పిల్లలను ఇంత గారబంగా చూసుకుంటున్నాము మరి మనకంటే ఎన్నో రెట్లు అధికుడు,ఈ సృష్తికే మూలపురుషుడు అయిన పరమాత్మ,మన పట్ల ఇంకెంత ప్రేమను కలిగి వుంటాడో మనం గ్రహించాలి కదా.మన కోరికలను తీర్చలేదని భగవంతుణ్ణి కొలవకపోవడం ఎంత వరకు సబబు?మనం కోరే కోరికలకు మనం అర్హులం కామేమొ లెకపొతే అవి మనకు మంచివి కావేమో అందుకే అన్నీ తెలిసిన పరమాత్ముడు మనకి ఇవ్వలేదెమో?మనం మన తల్లి తండ్రులపై అలిగినా,మన కోరికలు తీర్చలేదని కోప్పడినా,సరిగా చూడకపోయినా మనలను ప్రేమిస్తూనే వుంటారు.అలాగే మనము మన పిల్లలను అలానే ప్రేమిస్తాము..ఆ విధంగానే మనం పూజించినా పూజించపొయినా,అలిగినా మన మంచినే దృష్టిలో పెట్టుకుని దానికనుగుణంగానే మనకి కావలసినది ఇస్తూ వుంటాడా జగన్నాధుడు అని నా అభిప్రాయం.

3.అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడి గల యెద్దుల గత్తుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!

తాత్పర్యము:

అహంతో మిడిసిపడుతూ అడిగినా జీతమునివ్వని వాని దగ్గర పని చేస్తూ బ్రతకటం కన్నా పుడమి తల్లిని,మంచి వయస్సులోనున్న యెద్దులను నమ్ముకుని పొలము దున్నుకొనుచూ స్వతంత్రముగా జీవించుట మేలు.

4.అడియాస కొలువు గొలవకు
గుడి మణియము సేయబోకు,కుజనులతోడన్
విడువక కూరిమీ సేయకు
మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతీ!

తాత్పర్యము:

వృధా ప్రయాస అగు సేవను చేయకుము.గుడి ధర్మకర్తృత్వమును చేయకుము.చెడ్డవారితో స్నేహం చేయకుము.అలాగే అడవిలోకి వంటరిగా పోకుము.

5.అధరము గదలియు గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగ పూరిత
బధిరాంధక శవము జూడ పాపము సుమతీ!

తాత్పర్యము

పెదవులను కదిలి కదిలించక సుమధురమైన మాటలడక మౌనవ్రతుడై ఆపై అధికార రోగము పూరితుడై చెవిటిది గుడ్డిదైన శవమును జూచుట పాపము.ఇక్కడ ప్రజల ఇక్కట్లను పట్టించుకొనని అధికారిని శవముతో పోల్చటం జరిగినది.

6.అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు,మూర్ఖుని తపము
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై గీడు దెచ్చుర సుమతీ!

తాత్పర్యము:

రుణము తెచ్చుకుని అనుభవించు సౌఖ్యము,వృధ్ధాప్యమున పడుచు భార్య,తప్పులను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానివి.హాని కలిగించేవి!

7.అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నేడతెగక పాఱు నేఱును ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చోప్పడకున్నట్టి యూరు జోరకుము సుమతీ!

తాత్పర్యము:

అప్పిచ్చు వాడు,వైద్యుడు,ఎప్పుడూ ఆగకుండా ప్రవహించే నది,బ్రాహ్మణుడు వుండే వూరిలో వుండుము.
వారు లేనట్టి ఊరులో నివసింపకుము.

8.అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్య విద్య,కోమలి నిజము
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేరు తెలియర సుమతీ!

తాత్పర్యము:

అల్లుని మంచితనము,గొల్లవాని పాండిత్య ఙ్ఙానం,స్త్రీలలో నిజం,పొల్లు ధాన్యములో బియ్యము తెల్లని కాకులు వుండవు.

9.ఆకొన్న కూడె యమృతము
తా కొందక ఇచ్చువాడే దాత ధరిత్రిన్
సో కూర్చువాడే మనుజుడు
తేకువ కలవాడే వంశ తిలకుడు సుమతీ!

తాత్పర్యము:

ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము.బాధ పడకుండా ఇచ్చేవాడే దాత.ఆవేశాన్ని ఓర్చుకున్నవాడే మనుజుడూ.ధైర్యము కలవాడే వంశ శ్రేష్ఠుడు.

10.అకలి యడుగని కుడుపును
వెకటియగు లంజ పడుపు విడువని బ్రతుకు
బ్రాకొన్న నూతి యుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతీ!

తాత్పర్యము:

ఆకలి తీర్చని ఆహరము,గర్భం వచ్చినా వ్యభిచారమును మానని వేశ్య బ్రతుకు,పాచి పట్టిన బావి నీళ్ళు,మేక పాడియు రోత పుట్టించును.

11.ఇచ్చునదే విద్య రణమున
జొచ్చునదే మగతనంబు,సుకవీస్స్వరులన్
మెచ్చునదే నేర్పు,వాదుకు
వచునదే కీడు సుమ్ము వసుధను సుమతీ!

తాత్పర్యము:

వసుధలో (ఈ ప్రపంచంలో)ఇచ్చునదే విద్య.యుద్ధ రంగమున జొచ్చుకొని ప్రతాపమును చూపించుటే మగతనము.మంచి కవి శ్రేష్ఠులు మెచ్చుకొనునదే నేర్పరితనము.తగువుకు వచ్చునదే హాని.కవి వుద్దేశం ప్రకారం విద్య ఎమి ఇవ్వలి?ధనమా?వినయమా?మంచి వ్యక్తిత్వమా?లేకపోతే అన్నీనా?

12.ఇమ్ముగా పఠింపని నోరును,
“నమ్మా” యని పిలిచి అన్నమడగని నోరును,
దమ్ముల యని బిలవని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

తాత్పర్యము:

ఇంపుగా పఠింపని నోరును,అమ్మా అని పిలిచి అన్నం అడుగని నోరును, కుమ్మరి వాడు మన్నుకై త్రవ్విన గుంట వంటిది .

13.ఉడుముండదే నూఱేండ్లును
బడియుండదే పేర్మి బాము పది నూఱేండ్లును
మడుపున గొక్కెర యుండదే
కడు నిల బురుషార్ధపరుడు గావలే నేర్పరి సుమతీ!

తాత్పర్యము:
ఉడుములు నూరేండ్లు,పాము పది వందల యేళ్ళు,చెరువులో కొంగ చిరకాలము వున్నా అవి నిరుపయోగములు.నిరుపయోగంగా చిరకాలము వుండటం కన్న పదిమందికి ఉపయోగపడే విధంగా కొద్ది కాలం వున్నా చాలు.

14.ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱుగున గలుగ నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరిగి పోసిన
నిత్తడి బంగారమగునే ఇలలో సుమతీ!

తాత్పర్యము:

బంగారమునకు సమానమైన ఎత్తును ఇత్తడి తీసుకుని ఎన్నిసార్లు కరిగించి పోసినా అది బంగారము కానేరదు.అట్లే నీచునకు ఏ విధంగాను మంచి గుణములు కలుగవు.

15.ఉదకమును ద్రావేడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదపు కడ నున్న వృషభముc
జదువని యా నీచు జేర జనకురా సుమతీ!

తాత్పర్యము:

నీరు త్రాగెడు గుర్రము దగ్గరకు,మదముతో విజృంభించుచున్న ఏనుగు దగ్గరకు,గోవు కడ నున్న ఆబోతు దగ్గరకు,విద్య నేర్వని నీచుని దగ్గరకు వెళ్ళకుము.

16.ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

తాత్పర్యము:

మేలు చేసినవాడికి మేలు చేయడం గొప్ప కాదు.హాని చేసినవాడి దోషములెన్నక అతనికి ఉపకారము చేయువాడే నేర్పు గలవాడు..

17.ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను బెఱకు కైవడి నేపో
నెపములు వెదుకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!

తాత్పర్యము:

చెఱుకు గడ మొత్త మొదట తియ్యగా వుండి చివరకు పోయిన కొలది మధ్య మధ్య చప్ప చప్పగా నేవిధముగా నుండునో అటులనే మోసగాడైన దుర్మార్గునితో స్నేహము మొదట ఇంపుగా వున్ననూ చివరకు తప్పులను ఎత్తిచూపించుటలోనే కాలము గడుపును

18.ఎప్పటి కయ్యేది ప్రస్తుత
మప్పటి కా మాటాలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరిగువాడు ధన్యుడు సుమతీ!

తాత్పర్యము:

ఈ సమయములో ఏది అవసరమో తెలుసుకుని అప్పటికా మాటలు మాట్లాది ఇతరుల మనస్సులను నొప్పించక తాను బాధను పడక తప్పించుకు తిరుగు వాడే ధన్యుడు సుమతీ!

19.ఎప్పుడు దప్పులు వెదికెడు
నప్పురుషుని గొల్వగూడ దది ఎట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించు విధంబు గదరా సుమతీ!

తాత్పర్యము:

ఎల్లప్పుడూ తప్పులు వెదకెడు యాజమానిని సేవించు వాని జీవనము నల్ల త్రాచు పడగ నీడ నివసించు కప్ప బ్రతుకు వంటిది.

20.ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురు ఎట్లన్నన్
దెప్పలుగా జెరువు నిండిన
గప్పలు పదివేలు జేరు గదరా సుమతీ!

తాత్పర్యము:

నిండుగా సుభిక్షముగానున్న చెరువులోనికి పది వేల కప్పలు ఎలా జెరునో మనకు సంపదలు కలిగినప్పుడు బంధువులు అటులనే జేరును.

21.ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషములు సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాఙ్ఙ మేదిని సుమతీ!

తాత్పర్యము:

ఈ భూమిపై నందున్న పచ్చి కాయలను తినకుము.చుట్టాలను దూషింపకుము.యుద్ధ భూమి నుండి వెనుదిరిగి పారిపోకుము.గురువుల ఆఙ్ఙను జవదాటకుము.

22.ఒక యూరికి ఒక కరణము
నొక తీర్పరైన గాక నొగిc దఱచైనన్
గకవికలు గాక యుండునే
సకలంబును గొట్టు పడక సహజము సుమతీ!

తాత్పర్యము:

ఒక ఊరికి కరణము,న్యాయాధికారి ఒక్కరే ఉండవలెను.అట్లుగాక ఎక్కువమంది వున్నచో గందరగోళములు పుట్టి సమస్తము చెడిపోవుట సహజము.

23.ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాది నొల్లని వాడే
గొల్లండు కాక ధరలో
గొల్లండును గొల్లడౌనే గుణమున సుమతీ!

తాత్పర్యము:

తనను ప్రేమించని భార్యను,స్నేహితుని విడిచిపెట్టుటకు అంగీకరించని వాడే నిజమైన గొల్లవాడు.జాతి చేత గొల్లవాడైనంత మాత్రాన గుణముల యందు వెర్రి గొల్లవాడు కాడు.

24.ఓడల బండ్లను వచ్చును
ఓడలు నా బండ్ల మీద నొప్పుగ వచ్చు
ఓడలు బండ్లను వలనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ!

తాత్పర్యము:

నావల మీద బండ్లు,బండ్ల మీద నావలు ఎట్లా వచ్చునో,ధనవంతులకు దరిద్రముదరిద్రులకు భాగ్యము పర్యాయముగా కలుగుచుండును.

25.కడు బలవంతుడైనను
బుడిమినిc బ్రాయంపుటాలిc బుట్టినయింటన్
దడ వుండ నిచ్చెనేనియుc
బడపుగ నంగడికిc దానె పంపుట సుమతీ!

తాత్పర్యము:

ఎంత బలవంతుడైనను,వయస్సులోనున్న భార్యను ఎక్కువ కాలము పుట్టింటనే వుండనిచ్చినచో తానే స్వయముగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.

26.కనకపు సింహాసనమున
శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

తాత్పర్యము:

కుక్కను తెచ్చి ఒక శుభ ముహూర్తమున బంగారు సింహాసనమున కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజమును ఎలా మానలేదో,ఆ విధంగానే అల్పునికి గౌరవ మర్యాదలు చేసి పదవి ఇచ్చినా కూడ తన నీచ గుణమును విడువలేడు.

27.కప్పకు నొరగాలై నను
సర్పమునకు రోగమైన సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
తప్పదు మఱి దుఃఖమగుట తధ్యము సుమతీ!

తాత్పర్యము:

కప్పకు కాలు విరిగినను,పామునకు రోగము కల్గినను,భర్య దుష్టురాలైననను,వృద్ధాప్యములో దారిద్ర్యము సంభవించినను ఎక్కువ దుఃఖ ప్రదములగును.

మొదట ఈ పద్యము చదివి తాత్పర్యము తెలుసుకొన్నప్పుడు కవి గారి మీద భలే కోపం వచ్చింది!ఎందుకూ అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలోను స్త్రీ జాతి మీద వున్న కోపాన్నిఈ విధంగా వెల్లడి చేసుకున్నారు అని? ఇదే అభిప్రాయము చాలా రోజుల వరకు వుంది!దీనిపై నా వాఖ్యానం మొదలుపెట్టేవరకు.
ఏందుకు ఈయన ఇలా చెప్పరు దీని వెనుక వున్న అంతరార్ధం ఏమిటబ్బా అని ఆలోచించడం మొదలు పెట్టక దీని వెనుకున్న అంతరార్ధం కొంత బోధ పడిందని నేను అనుకుంటున్నాను [:)] ? ఈ కొత్త ఆలోచనకి బీజం యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన మనోవైఙ్ఙానిక పుస్తకం “విజయంలో భాగస్వామ్యం” ఈ పుస్తకం ఆలుమగల మధ్య సంబంధాన్ని పటిష్టం చేసుకునే నేపధ్యంలో స్త్రీ పురుషుల మనస్తత్వాన్ని వివరించటం జరిగింది.అ పుస్తకం రచయిత ఇలా చెప్పారు స్త్రీ పురుషులు మనస్తత్వాలు కుటుంబం విషయంలో ఉత్తర దక్షిణ ధ్రువాల్లా వుంటాయని.పురుషునికి తన ఇల్లు,ఇల్లాలు,కుటుంబం జీవితంలో ఓ భాగమైతే,స్త్రీకి తన భర్త,తన పిల్లలు,తన సంసారం,తన కుటుంబము ఇవే తన లోకంగా బ్రతుకుతుందని.ఈ విషయాన్నే బద్దెన్న గారు పై పద్యంలో చెప్పిన విషయానికి అన్వయించుంకుంటే కొంత సూక్ష్మం అర్ధమయింది.భర్త దుష్టుడైతే భార్య మీద పడే ప్రభావం కన్న భార్య దుష్టురాలైతే భర్త మీద పడే ప్రభావం ఎక్కువనుకుంటా!ఆ ప్రభావాన్ని తట్టుకోలేక పురుషుడు బయట పడుతున్నడు,మగువమో ఓర్చుకుని గుట్టుగా వుంటోంది! కనుకనే గయ్యాళీ భార్య అన్న పదం వాడుకలోకి వచ్చింది గాని గయ్యాళి భర్త అని రాలేదు..ఏది ఏమైన భార్య భర్తల్లో ఎవరు దుష్టులైనా కాకపోయిన,గయ్యాళులు అయినా కాకపొయినా ఆ ప్రభావం కుటుంబంలో మిగితా సభ్యులు మీద ముఖ్యంగా పిల్లల మీద ఎంతో ప్రభావం చూపుతుంది..చెడు ప్రభావం మన మీద మన కుటుంబం మీద మన సమాజం మీద లేకుండా చూసుకోవడం మన కనీస ధర్మం.

ఇక్కడ స్త్రీలపై చిన్నచూపు వున్న పద్యాల్లో కొంత positiveness ని చూసేందుకు చేసినదే ఈ ప్రయత్నం అంతే కాని ఎవ్వరినీ ఎవ్వరితో పోల్చటం లేదు ,చిన్న చూపుగా చూడటం చెయ్యటం లేదు.నా ఈ ప్రయతం ఎవ్వరికైన ఇబ్బంది పెట్టి వుంటే మన్నించగలరు.

28.కమలములు నీట బాసిన
గమలాప్తుని రశ్మి సోcకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు తప్పినc
దమ మిత్రులు శత్రులవుట తధ్యము సుమతీ!

తాత్పర్యము:

కమలములు తమ నివాసమైన నీటిని విడిచినచో తమ మిత్రుడైన సూర్యుని కిరణములు సోకి ఎటుల కమిలిపోవునొ,హద్దులు దాటితే మిత్రులే శత్రులగుట తధ్యము.

29.కరణము గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేcడు సుమి
కరణము దన సఱి కరణము
మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

తాత్పర్యము:

ఒక కరణము తోటి కరణమును నమ్మినచో మరణముతో సమానమైన అపాదలు వచ్చి మనలేడు.కావున శాటి కరణమును నమ్మక గుట్టుగా నుండవలెను.

30.కరణముల ననుసరింపక
విరసంబున దిన్న తిండి వికటించు జుమీ
యిరుసున గందెనc బెట్టక
పరమేశ్వరు బండైయిన బాఱదు సుమతీ!

తాత్పర్యము:

బండి ఇరుసును కందెన పెట్టకున్నచో భగవంతుని బండి అయినను వేగవంతముగా కదలలేదు.అటులనే కరణమును అనుసరించక విరోధముతో మెలగిన వారు సుఖముగా నుండలేరు.

31.కరణము సాధై యున్నను
గరి మదముడిగినను బాము గరవకయున్నను
ధర దేలు మీటకున్నన్
గర మరదుగా లెక్క గొనరు గదరా సుమతీ!

తాత్పర్యము:

ఈ భూమి యందు కరణము నెమ్మదస్తుడైనను,ఏనుగు మదము లేనిదైనను,పాము కరవక యుండినను,తేలు కుట్టకున్నచో మిక్కిలి తెలికగా చూతురు.

32.కసుగాయ గఱచి చూచిన
మసల దసయొగరు మధురంబగునా
పసగలుగు యువతులుండగ
బసిబాలల బొందువాడు పసరము సుమతీ!

తాత్పర్యము:

పక్వమునకు వచ్చిన పండ్లను వదిలి పచ్చి కాయలను కొరికినచో తియ్యదనము లేక ఒగరుగా తోచును.చాతుర్యము గల యువతులుండగా పసిపాపల పొందు కోరు వానికి సుఖము శున్యము.అట్టివాడు నిజముగా పశువు.
నిజము చెప్పాలంటే ఇలాంటి వాళ్ళ కన్న పశువులే నయము.వీరిని ఈ పదముతో పిలిచినా ఆ పదమునకు మాలిన్యము అంటి వున్న విలువ కోల్పోతుంది..అందుకే ఇటువంటి వారిని సంభోదించడం లేదు.

33.కవిగాని వాని వ్రాతయు
నవరసభావములు లేని నాతుల వలంపున్
దవిలి చను పందినేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ!

తాత్పర్యము:

కవిగాని వాని రచనలు,నవరసాల భావములు లేని స్త్రీల ప్రేమ,ముందు పోయేడు పందిని కొట్టలేని వాని ఆయుధ విద్యలోని నేర్పరితనము వ్యర్ధము.

నిజమే!నవరసాల భావనలు తెలియని స్త్రీ ప్రేమ వ్యర్ధమే.ఇదే సూత్రము పురుషులకూ వర్తిస్తుంది.కాని genralise చేసి మాట్లడకుండా ఒక్క స్త్రీ జాతినే ఇట్లా అనడం ఎంత వరకు సమంజసము?

34.కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందినపిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతుల వలపు లేశము సుమతీ!

తాత్పర్యము:

చెడ్డవారితో స్నేహము మంచిది కాదు.ఒక్కసారి కీర్తి వచ్చిన తరువాత పోదు.అప్పులు ఇచ్చుట తగువులకు మూలము.స్త్రీల కడ ప్రేమ శూన్యము.

ఓ పెద్ద మగవారే గొప్ప ప్రేమ మూర్తులైనట్టు.అందుకు ఎన్నో తార్కాణాలు వున్నయి కదూ!ఛా!

ఆడువారిని ఎంత తేలిక భావముతో చిన్నచూపు చూస్తున్నరో చూసేవారో ఈ పద్యాలే వుదాహరణ.

కామెంట్‌లు లేవు: