ఇప్పుడు పరిస్థితంతా పూర్తివిరుద్ధంగా మారిపోయినట్లు కనిపిస్తున్నది. దేశంలో ఎల్లెడలా సంకుచితత్వం బాహాటంగా సిగ్గూ, లజ్జా విడిచి, గుడ్డలు విప్పుకొని, బిగ్గఱగా నోరుపెట్టుకుని, అఱుస్తూ విజృంభిస్తున్నది. వాఙ్మర్యాదలతో సహా ప్రతి విషయంలోను మనం నియంత్రణ కోల్పోయినట్లు తోస్తున్నది. ఉదాహరణకి ఇతర రాష్ట్రాలవారి మీద శివసైనికుల దౌర్జన్యం. అలాగే మన రాష్ట్రంలో "అదుర్స్" సినిమా మీద తె.రా.స.వారి దాడులూను. దాడికారుల రాజకీయ అభిప్రాయాల కంటే భిన్నమైన సొంత రాజకీయ, సాంస్కృతిక అభిప్రాయాల్ని దాడుల బాధితులు కలిగి ఉండడమే ఈ రెండు రాష్ట్రాల్లోను వారు చేసిన మహాపాపం. అయితే మహారాష్ట్ర పరిస్థితికీ, మన పరిస్థితికీ మధ్య ఒక ప్రాథమిక వ్యత్యాసం ఉన్నది. అక్కడ జఱుగుతున్నవి మరాఠీ అభిమానులు నాన్-మరాఠీల మీద చేస్తున్న దాడులు కాగా మన దగ్గఱ జఱుగుతున్నవి మాత్రం వట్టి నరమాంస భక్షక దాడులు (cannibalistic attacks). ఎందుకంటే ఇవి ఒక ప్రాంతీయులు స్వయంగా తమ సొంత భాషా-మత-జాతి-సంస్కృతి-సంప్రదాయాలకే చెందిన ఇతరప్రాంతాల జనం మీద ఊహాజనిత శత్రుత్వంతో జఱుపుతున్నవి. ఇవి చాలా దారుణమైనవి. ఎందుకంటే వీటికి దీటైన పూర్ణోపమలు ప్రపంచచరిత్రలో ఇతరత్ర దుర్లభం.
హఠాత్తుగా మనలో కిరాతకత్వమూ, బర్బరత్వమూ ఎందుకిలా జడలు విఱబోసుకుని వికటాట్టహాసం చేయసాగాయి ? ముద్రణలో కనిపించే, చెవులకి వినిపించే ప్రతి సంకుచిత వైఖరికీ, ద్వేషప్రచారాలకీ మనమెందుకిలా అసంకల్పితంగా లొంగిపోతున్నాం ? సొంతంగా ఆలోచించుకోనివ్వకుండా మనల్ని ఇలా మారుస్తున్నదెవఱు ? స్వాతంత్ర్యోద్యమకాలంలో, అంతటి అణచివేత మధ్యా, అన్ని కఱువుల నడుమ మన పూర్వీకులలో స్వభావసిద్ధంగా వెల్లివిఱిసిన మానవత్వానికీ, ఈనాడు ముప్పూటలా మెక్కుతూ మనం ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి చేసుకుంటున్న పశుత్వానికీ పోలికేది ?
వెనక్కి తిరిగి చూసుకుంటే, స్వాతంత్ర్యోద్యమకాలపు నాయకులు ఈ కాలపు నాయకులవంటివారు కారు. వారు ఉద్యమనాయకులే తప్ప మనకి తెలిసిన అర్థంలో కాకలు దీఱిన వ్యూహకర్తలు గానీ, కరుడుగట్టిన రాజకీయనాయకులు గానీ కానేకారు. వారు పెద్దపెద్ద ఉమ్మడి కుటుంబాలలో పెఱిగిన వట్ఠి పాతకాలపు బోళా మనుషులు. గ్రామీణ భారతదేశపు శ్రమైకజీవన సౌందర్యాన్ని ఎఱిగినవారు. నగరాల నయగారాలకి మూర్ఛపోయినవారు కారు. జీవితంలో కష్టం, సుఖం తెలిసినవారు. దైవభక్తులు. గురుభక్తులు. పాపభీతులు. వారు పండితులూ, ఆలోచనాపరులూను. తరువాతి కాలంలో వారంతా దేశానికి రాష్ట్రపతులూ, ప్రధానమంత్రులూ, ముఖ్యమంత్రులూ, గవర్నరులూ కావడం యాదృచ్ఛికంగా, అనుకోకుండా జఱిగింది. కానీ ఆ పదవుల గుఱించి వారెన్నడూ కలలుగని ఉండలేదు. అసలు తమ ఆయుష్కాలంలో దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని అనుకోలేదు. తమ జీవితాలు చెఱసాల గోడల మధ్యే ముగిసిపోతాయనుకుని అందుకోసం మానసికంగా సిద్ధపడి ఉండేవారు. నాకనిపిస్తుంది - వారే గనక మళ్ళీ బతికొస్తే మన ప్రవర్తన, వాలకమూ చూసి చాలా విస్తుపోతారని ! వారు తమ కాలంలో స్వాతంత్ర్యోద్యమం కోసం ఏ సంకుచితాలనైతే వద్దనుకున్నారో సరిగ్గా వాటినే మనం ఆధికారికంగా, చట్టపూర్వకంగా, మీదుమిక్కిలి బహిరంగంగా ప్రజావేదికల మీదా, విశ్వవిద్యాలయాల్లో సైతం గుర్తించి, గౌరవించి ప్రోత్సహించడం - ఇదంతా వారికి వాంతి రప్పించవచ్చు.. ఈనాటి రాజకీయపక్షాలూ, వాటి మేనిఫెస్టోలూ, కులపరమైన/ మతపరమైన దూషణలతో నిండిపోయిన వెబ్‌సైట్లూ, పత్రికలూ, ప్రాంతీయోద్యమాలూ, ద్వేషాలూ, హింస గట్రా చూస్తే స్వాతంత్ర్యోద్యమం ద్వారా వారు మనకి నేర్పిపోయిన విలువలకి సుదూరంగా మనం చాలా క్రోసులు ఇవతలికి వచ్చేశాం.
బహుశా మనం మన యొక్క దయనీయమైన అవగాహనాలేమితో వారి చిరజీవితకాలపు శ్రమనంతా బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నాం. ఈ దేశాన్ని నిర్మించిన తొలితొలితరాల నాయకులు ఒక ఉత్తేజపూరితమైన భావిదర్శనం (future vision) తో పనిచేశారు. వారు చెఱసాలల్లో కూర్చుని తమ వర్ణరంజితమైన తీపికలల్లో భావి సుందర ఆదర్శదేశాన్ని స్వప్నించారు. సామ్రాజ్యవాదుల కంటే భిన్నంగా పరిపాలించే అంకిత దేశభక్తుల ధర్మబద్ధ సారథ్యాన్ని వారు ఊహించుకున్నారు. అందఱి భాషాసంస్కృతులకీ తుల్యగౌరవ పురస్కారాలు లభించే సువిశాల భూఖండాన్ని, భారతజాతి మఱియు అందులోని ఉపజాతులూ అన్నీ కలిసికట్టుగా మనగలిగే సమైక్య భారతదేశాన్ని వారు దర్శించారు. ఆయా జాతులకీ, వాటి సంస్కృతులకీ బ్రిటీష్ పాలన ద్వారా జఱిగిన పరాభవాల్నీ, ఉపేక్షనీ, అన్యాయాల్నీ చక్కదిద్దే సదుద్దేశంతోనే వారు వివిధరాష్ట్రాల్ని ఏర్పఱచాలని నిర్ణయించుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఆ దర్శనాన్ని కాస్తకాస్తగా కార్యరూపంలో పెట్టారు. ఆ నాయకులకు ఈ కాలపు నాయకుల మాదిరి వ్యక్తిగత ప్రయోజనాల్ని, ప్రాంతీయ స్వార్థాల్ని, వర్గస్పృహల్ని ఆపాదించడం మిక్కిలి అసమంజసం. తమ తదనంతరం చోటు చేసుకున్న అనూహ్యాలకి వారిని బోనెక్కించాలని చూడ్డం అన్యాయం. అది వారు పడ్డ కఠోర శ్రమనీ, వారి నిరుపమాన త్యాగాల్నీ అవమానించడమే అవుతుంది. ఈ ఆరోపణలే నిజమైతే ఆ నాయకులు ఏమీ సంపాదించుకోకుండా ఎందుకు అకించనులుగా గతించారనే ప్రశ్నకి సమాధానం కావాలి. సంపాదనలనేవి వారంతా పోయాకనే ఎందుకు మొదలయ్యాయనేది కూడా అవగతం కావాల్సి ఉంది. వారు తమ కాలంలో బ్రిటీషు పాలనని అభివర్ణించడానికి వాడిన పదజాలాన్ని – దోపిడిదార్లు గట్రా - ఈనాడు మనం కాపీకొట్టి స్వదేశ పాలకుల మీదా, స్వదేశ వ్యాపారుల మీదా ప్రయోగించడం, స్వదేశ పౌరుల మీద ప్రయోగించడం, సాక్షాత్తు స్వరాష్ట్ర పౌరుల మీద కూడా ప్రయోగించడం ఎంతవఱకు సమీచీనం ? ఖచ్చితంగా స్వాతంత్ర్యోద్యమవీరులు ఈ పరిస్థితిని ఊహించి ఉండరు. పెళ్ళి చేసి అక్షింతలు వేసి ఆశీర్వదించే పెద్దలు, ఆ వధూవరులు కలకాలం కళకళలాడుతూ కాపరం చెయ్యాలనే ఆశిస్తారు. ఆ తర్వాత ఆ వధూవరులకి అలా బతకడం చేతకాకపోతే పెళ్ళిపెద్దల్ని దూషించడం, వారికి లేనిపోని స్వార్థ దురుద్దేశాల్ని అంటగట్టడం సమంజసం కాదు.
మనలోని ఈ అంతర్గత కుమ్ములాటల వెనక అసలు కారణం - మనందఱికీ కలిపి ఒక ఉమ్మడి శత్రువు లేకపోవడమేమోనని నాకు అనిపిస్తున్నది. అటువంటి శత్రువు ఉంటేనే మనం ఏకమవుతాం. లేకపోతే మనవాళ్ళని మనమే నఱుక్కుని చంపుకుంటాం. ఇదే నిజమైతే మన జాతీయవాదమంతా ఒక కపటనాటకం. ప్రజల్ని ఏదో ఒక ప్రాతిపదికన, ఏదో ఒక వాదంతో విడగొట్టే నాయకుల్ని బహిరంగంగా అసహ్యించుకునే స్థాయికి ఇంకా మనవాళ్ళు ఎదగలేదు. అందువల్ల మన నాయకులక్కూడా ఎదగాల్సిన అవసరం లేకుండా పోతోంది. మేధావులు ఏ సంస్కరణ కావాలని డిమాండు చెయ్యరో దాన్ని అందించాల్సిన అవసరం నాయకులకి లేదు. పైపెచ్చు అలా విడగొట్టేవాళ్ళే అసలుసిసలైన నాయకులుగాను, అందఱమూ కలిసుండాలని చెప్పేవాళ్ళు బఫూన్‌లుగాను చూడబడే పరిస్థితి వచ్చింది.
అందుచేత ఈనాటి మన అత్యవసర చారిత్రిక ఆవశ్యకత - స్వాతంత్ర్యోద్యమ కాలంలో మాదిరి జనాన్ని కలిపే నాయకులు. జనానికి "ఇది మంచి, ఇది చెడు" అని చెప్పే ధైర్యమున్న నాయకులు. జనాన్ని చూసి పిఱికిగొడ్లలా గడగడ వణక్కుండా లక్షలాదిమంది ముందు నిబ్బరంగా నిలబడి "అయ్యలారా ! నేను మీతో విభేదిస్తున్నాను. నా సొంత అభిప్రాయం ఇలా ఉంది." అని ఎలుగెత్తగల నాయకులు
6:00 AM వీరిచే పోస్ట్ చెయ్యబడింది తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి