కేరింతలాడుతూ పరుగులెడుతూ దోబూచులాడుతున్న
అమాయకత్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
గారాల పాపాయిని అంది.
పుస్తకాలతో కుస్తీలు పడుతూ హడావుడిపడుతున్న
రిబ్బను జడల చలాకీతనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
పోటీప్రపంచెంలోని విద్యార్ధిని అంది.
కళ్ళనిండా కాటుకతో
కలతన్నదెరుగని ఊహాసుందరిని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
విరబుసిన మందారాన్ని...కన్నెపిల్లని అంది.
చెలిమితో చెట్టాపట్టాలేసుకుని తిరగాడే
ఆర్తితో నిండిన నమ్మకాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
సృష్టిలో తీయనైన స్నేహహస్తాన్ని అంది.
అధికారంతో ఆ చేతులకు
రాఖీలు కడుతున్న ఆప్యాయతనడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
అన్నదమ్ముల క్షేమాన్ని కాంక్షించే సహోదరిని అంది.
సన్నజాజుల పరిమళాలను ఆస్వాదిస్తూ
వెన్నెల్లో విహరిస్తున్న అందాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
నా రాజుకై ఎదురుచూస్తున్న విరహిణిని అంది.
పెళ్ళిచూపుల్లో తలవంచుకుని బిడియపడుతున్న
సిగ్గులమొగ్గను అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
అమ్మానాన్నల ముద్దుల కూతురుని అంది.
మెడలో మెరిసే మాంగల్యంతో
తనలో తానే మురిసిపోతున్న గర్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
దరికి చేరిన నావను..నా రాజుకిక రాణిని అంది.
వాడిన మోముతో, చెరగని చిరునవ్వుతో
తకధిమిలాడుతున్న సహనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
బరువు బాధ్యతలు సమంగా మోసే ఓ ఇంటి కోడలిని అంది.
విభిన్న భావాలను సమతుల్యపరుస్తూ
కలహాలను దాటుకుని
పయనిస్తున్న అనురాగాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా..
కలకాలం అతని వెంట
జంటగా నిలిచే భార్యను అంది.
నెలలు నిండుతున్న భారంతో
చంకలో మరో పాపతో సతమతమౌతున్న
సంఘర్షణ నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
ముద్దు మురిపాలు పంచి ఇచ్చే తల్లిని అంది.
అర్ధంకాని పాఠాలను అర్ధం చేసుకుంటూ
పిల్లలకు పాఠాలు నేర్పుతున్న ఓర్పు నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
నా చిన్నారులకు మొదటి గురువుని అంది.
ఇక్కడిదాకా రాసి ఆగిన
కలాన్ని అడిగాను ఆగిపోయావేమని...
ఇంకా అనుభవానికి రాని భావాలను
వ్యక్తపరిచేదెలా..అని ప్రశ్నించింది..!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి