సంగీతార్థసారం
లలితకళలు మానసోల్లాసానికి స్వాగతద్వారాలు తెరిచి మనల్ని మంత్రనగరిలో విహరింపజేస్తాయి. అవి- తరతరాలుగా మనిషికి వారసత్వంగా సంక్రమించిన అపురూప సంపద. అక్షర విలాసంలో అనంత సాహిత్యం; కరచరణాల కదలికల్లో అపూర్వ నృత్యం; కంటి విన్యాసాల్లో నవరసాల సమ్మిళతమైన అభినయం; నాడులతీగలపై కదలాడే నాదం, గానం; గాలితరంగాల మీదుగా పల్లవించే గీతం, సంగీతం- మనిషి సృజించిన మణిదీప్తులు. 'మాది' అని మానవలోకం సగర్వంగా చాటుకోవాల్సిన సిరులవి. ముఖ్యంగా మనిషికి అన్నిటినీ మించి ఒనగూడిన కలిమి- చదువులతల్లి సరస్వతమ్మ స్తన్య ప్రసాదమైన సంగీత సాహిత్యాలు. 'ఎవరికైనా ఆస్తిఏముంటుంది?/ సంగీతంలో సప్తస్వరాలు/ సాహిత్యంలో యాభైరెండుఅక్షరాలు' అంటూ ఆరుద్ర స్వరాక్షరాలకు పట్టాభిషేకం చేశాడు ఓకవితలో. భువన సమ్మోహనకరమైన రాగాలెన్నింటికో వూపిరులూదిందీ, హృదయాల్ని రసప్లావితం చేసే గీతాలెన్నింటికో రెక్కలు తొడిగిందీ ఏడంటే ఏడు స్వరాలే! వాయిద్యాలపై నాట్యమాడే చేతివేళ్లు, తీగలను మీటే వేలికొసలు- రసజగత్తును సంగీతార్ణవంలో ఓలలాడించేదీ సప్తస్వరాల తరంగాలపైనే!పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలున్నా అది- మోవికి తాకితే గేయాలైరవళిస్తుందన్నాడు వేటూరి. ఖాళీ వెదురుగొట్టాన్ని సైతం పాటల మంత్రదండంగా మార్చేది- పవన వీచికల పలకరింతల్లోని నిశ్శబ్ద సంగీతమే. స్పందించే హృదయం, అనుభూతించే మనస్సు, ఆస్వాదించే చెవులు ఉంటే- మౌనరాగాల్లోనూ మధురగానాలు వినవచ్చు. నిశ్చల సమాధిలో, కవితామతల్లిని స్మరించే వేళ- 'శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు... ఒకలక్ష నక్షత్రాల మాటలు, ఒక కోటి జలపాతాల పాటలు' విన్న మహాకవిమన శ్రీశ్రీ. 'తెలిపూల తేనె వాకలువారగా చేసి/ తెనుగువాగై సాగెనే-నెత్తావి తెనుగు పాటలు పాడెనే'- అంటూ కిన్నెరసాని నడకల సోయగాన్ని సంగీతమయం చేశారు కవిసమ్రాట్ విశ్వనాథ.
అలసిన హృదయానికి సాంత్వన, చెదిరిన మనసుకు శాంతి లభించేదిసంగీత రసాస్వాదనలోనే. గానం- తీయని కలలా పలకరిస్తుంది. కమ్మనికథలా అలరిస్తుంది. కలతల్ని మాపుతుంది. చింత తీరుస్తుంది.మంత్రలోకపు మణిమంటపాల్లో విహరింపజేస్తుంది. మనిషి మనసున మల్లెల మాలలూగించడానికే కదా ఆమనిలో కోయిల తన గొంతు సవరించుకునేది! 'మావిగున్న కొమ్మను మధుమాసవేళ/ పల్లవముమెక్కి కోయిల పాడుటేల? పరుల తనియించుటకొ?/ తన బాగుకొరకొ?/ గానమొనరింపక బ్రతుకు గడవబోకొ?' అన్నాడు కృష్ణశాస్త్రి.త్యాగయ్య కృతి, అన్నమయ్య సంకీర్తన, క్షేత్రయ్య పదం, మీరా భజన్- ఇలా మానవరూపంలో కదిలివచ్చినట్లనిపించే ఎందరో గానగంధర్వులు సంగీత సరస్వతిని స్వరార్చనతో కొలుస్తున్నదీ సకల జగదానందం కోసమే. స్వరలయాది రాగములను తెలియువారెందరో మహానుభావులు అన్న నాదబ్రహ్మవాక్కును సార్థకం చేసిన, చేస్తున్న నాదయోగులు, గానరుషులు పుట్టిననేల ఇది. సంగీతం- అవధులెరుగనిది. ఎల్లలు ఒల్లనిది. భాషాభేదాలు లేనిది. ప్రాంతీయతలు తెలియనిది. కొడవటిగంటి మాటల్లో చెప్పాలంటే- 'ఈప్రపంచంలో దివ్యత్వంతో కూడినది ఒకటే ఉంది, సంగీతం! కల్లబొల్లిన్యాయాలకూ, ధర్మాలకూ, నీతులకూ, బోధలకూ అతీతమైన'దది. అంతటి మహత్వశక్తి కనుకనే- ఆ రసఝరిలో మునకలేస్తున్నంతసేపూ మనుషులంతా ఒక్కటే. మనసులన్నిటా బ్రహ్మానందానుభూతులే! కనీసం ఆ కొద్దిసేపైనా- దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. జాతి పేరుతోనో, మతం మిషతోనో మనుషులు తమ మధ్య ఏర్పరచుకున్న సంకుచిత పరిధులు తుడిచిపెట్టుకుపోతాయి.
ప్రాక్, పశ్చిమం; కర్ణాటక, హిందుస్థానీ; జనపదం, జాజ్-ప్రాంతమేదైతేనేం, పేరేదైతేనేం... సంగీతం సంగీతమే. అది అమృతతుల్యం. ప్రణవనాదం నుంచి పల్లెపదం వరకు ప్రతిదీ మనసును వర్ణరంజితం చేస్తుంది.పవళింపుసేవ వేళ- 'ఉయ్యాలలూగవయ్యా, సయ్యాట పాటలనుసత్సార్వభౌమా' అని భగవంతుడికి విన్నవించుకుంటూ సంప్రదాయఒరవడిలో భక్తుడు ఆలపించే జోలపాటా కర్ణపేయమే. పరమాత్ముడికి ప్రతిరూపమైన పసిపాపడికి జోకొడుతూ 'నాగస్వరమూదితే నాగులకునిద్ర/ జోలల్లు పాడితే బాలలకు నిద్ర' అంటూ అమ్మ జానపద బాణీలోపాడే లాలిపాటా వీనులవిందే. లోకబాంధవుణ్ని నిద్రలెమ్మని వేడుకుంటూ'శ్రీ సూర్యనారాయణా, మేలుకో' అని పెద్ద ముత్తయిదువులు ఆలపించేగానమూ మధురమే. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడని ప్రతీతి.వెలుగుల్ని ప్రసరించి, వేడిమిని పంచి, యావత్ జగతిని తేజోమయం చేసేసూర్యుడు- సంగీత స్రష్ట అనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సౌరమండలం నుంచి సంగీతం వెలువడుతోందని, సూర్యుడి వెలుపలి వాతావరణం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం వేదికగా విభిన్న స్వరాలు సంచరిస్తున్నాయని- బ్రిటన్లోనిషెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు. 'భానుడిబాహ్య వాతావరణంనుంచి దూరంగా జరుగుతున్న పెద్దపెద్ద అయస్కాంతవలయాలు- సంగీత వాయిద్యాలపైని తంత్రుల మాదిరిగా కంపిస్తున్నాయి.గాలి ఆధారంగా పనిచేసే వాయిద్యాల్లోని శబ్దతరంగాల్లా ఉన్నాయవి' అని వారు వివరిస్తున్నారు. ఉపగ్రహాల ద్వారా ఆ అయస్కాంత వలయాలను దృశ్యరూపంలో చిత్రించి, ప్రకంపనలను శబ్దాలుగా మార్చిన శాస్త్రజ్ఞులు, అవి శ్రవణానందకరంగా ఉన్నాయని తన్మయులవుతున్నారు. సౌరమండలంలోనేకాదు, నాలుగు వేదాలూ సంగీతాకృతిలోనే ఉన్న మనదేశంలో ప్రకృతీసంగీతశోభితమే. ఇక్కడి జలపాతాల గలగలల్లో, గువ్వల కువకువల్లో,చినుకుల చిటికెల్లో సైతం రాగతాళాలు, శ్రుతిలయలు వినిపిస్తాయి.
(ఈనాడు, సంపాదకీయం, ౨౭:౦౬:౨౦౧౦)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి