1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

23, ఆగస్టు 2010, సోమవారం

సత్తా చాటిన తెలుగు తేజం



పెదాలమీద చిరునవ్వు చెక్కుచెదరనివ్వని తెలుగు యువ సంచలనం అద్భుత స్వరప్రజ్ఞకు యావద్దేశం మంత్రముగ్ధమైన తరుణమిది. సుప్రసిద్ధ బ్రిటిష్‌ రియాలిటీ షోకి దేశీయ అనుసరణ 'ఇండియన్‌ ఐడల్‌' అయిదో అంకం పోటీల ఆసాంతం అగ్రగామిగా కొనసాగి, అంతిమ విజేతగా ఆవిర్భవించిన శ్రీరామచంద్ర స్వరసమ్మోహకశక్తి- ఆసేతుశీతనగాన్ని ఏకరీతిగా సంభ్రమాశ్చర్యపరచింది. స్వాతంత్య్ర దినోత్సవంనాటి పోటీల తుదిఘట్టంలో నెగ్గితే, జీవితాంతం ఆగస్ట్‌ 15న విజయోత్సవం చేసుకుంటానన్న తెలుగుతేజానిదే భారతీయ సుస్వరమని సినీ దిగ్గజం అమితాబ్‌ సమక్షంలో ఫలితం వెలువడ్డ మరుక్షణం- భాగ్యనగరంలో సంబరాలు మిన్నంటాయి. ఈ అపురూప కిరీటం కోసం దేశం నలుమూలలనుంచీ ఎకాయెకి లక్షా ఎనభైవేలమంది అభ్యర్థులు పోటీపడ్డారు. అంచెలవారీ వడపోతలో కడకు మిగిలిన రాకేశ్‌ మైనీ, భూమీ త్రివేదీలను అధిగమించడంలో శ్రీరామ్‌ చూపిన ప్రతిభ న్యాయమూర్తుల్నీ, వీక్షకుల్నీ తన్మయత్వంతో కట్టిపడేసింది. ఇప్పటిదాకా అభిజీత్‌ సావంత్‌, సందీప్‌ ఆచార్య, ప్రశాంత్‌ తమాంగ్‌, సౌరభీ దేబ్‌బర్మలకే పరిమితమైన ఇండియన్‌ ఐడల్‌ జాబితాలోమొట్టమొదటిసారి దక్షాణాదినుంచి ఒక తెలుగుబిడ్డ పేరు చేరడం- మనందరికీ గర్వకారణం. నాలుగేళ్లక్రితం 'ఇండియన్‌ ఐడల్‌ 2' పోటీల ఆఖరి ఘట్టందాకా నెగ్గే వూపు కనబరచిన కారుణ్య, సంక్షిప్త సందేశాల ప్రాతిపదికన బలాన్ని కూడగట్టడంలో వెనకబడిపోవడం తెలిసిందే. విశేష ప్రతిభ కలిగీ వట్టిచేతులతో ఇంటిముఖం పట్టే దుర్గతి మరో తెలుగువాడికి దాపురించరాదంటూ ప్రసారమాధ్యమాలు సాగించిన విస్తృత ప్రచారం- ఈసారి శ్రీరామచంద్రకు తులాభారంలో తులసిదళమైంది.

అసంఖ్యాక ప్రేక్షకుల ఆదరణ ప్రసాదించి, భావిజీవితాన్ని అమాంతం మార్చివేయగల ఇంతటి అసామాన్య విజయం ఆషామాషీగా ఒనగూడేది కాదు.
లక్షలూ కోట్లమందిలో ప్రత్యేక గుర్తింపు సాధ్యపడాలంటే కఠోరశ్రమ తప్పనిసరి. అదే, న్యాయవాది ఇంట కన్నుతెరిచి సహజసిద్ధ ప్రతిభకు పదును పెట్టుకుంటూ ఎదిగిన శ్రీరామ్‌ ఆయువుపట్టు. మేనమామతో సంగీత కచేరీలు చేసిన అనుభవం, ఏళ్ల తరబడి తెల్లవారుజామున ఆపకుండా సాగించిన కఠోర సాధన- శ్రుతిశుద్ధ మెలకువలతో అతడి గళాన్ని మార్దవం చేశాయి. ఎంత క్లిష్టమైన బాణీనైనా అలవోకగా పలికేలా రాటు తేల్చాయి. ఇండియన్‌ ఐడల్‌ పోటీల పొడుగునా అమీర్‌ఖాన్‌, సంజయ్‌దత్‌, లతా మంగేష్కర్‌, హేమమాలిని ప్రభృత ఉద్దండుల్ని విస్మయపరచిన శ్రీరామ్‌ స్వరధుని- ఎక్కడా శ్రుతి తప్పకుండా అలరించడానికి గట్టి పునాది అదే. ఈ తరహా పోటీల్లో గెలుపోటముల మధ్య తేడా ఉల్లిపొరంత పలచన. విజయాన్నీ పరాజయాన్నీ ఒకేలా ధైర్యంగా స్వీకరించగల మానసిక స్త్థెర్యం అత్యావశ్యకమనీ గెలుపొందిన క్షణాన తెలియజెప్పింది- అతడి ప్రథమ స్పందన. ఏకకాలంలో రెండు ఆస్కార్‌ పురస్కారాల్ని ఒడిసి పట్టినప్పుడు స్వరమాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌ వినమ్రతను మళ్ళీ తలపుల్లో నిలిపిన అరుదైన సందర్భమది! ఈటీవీ నిర్వహించిన 'సై' కార్యక్రమం తుది సమరందాకా మెరిసి, 'ఒక్కరే' పోటీల్లో అద్వితీయుడనిపించుకున్న శ్రీరామచంద్రకు- తెలుగు సినిమాల్లో పాటల అవకాశాలు ఇప్పటికే తలుపు తడుతున్నాయి. సాధించినదాంతో తృప్తిచెందితే అంతటితో ఎదుగుదల ఆగిపోయినట్లే. జాతీయస్థాయిలో తానేమిటో నిరూపించుకోవాలన్న పంతం, తెలుగువాడి సత్తా చాటాలన్న అభిలాష- తనను ముందుకు ఉరికించాయంటున్న ప్రతిభావంతుడి ఈ ప్రస్థానం మరెందరిలోనో స్ఫూర్తి రగిలించక మానదు. దేశం గర్వించే గాయకుడిగా ఎదగడమే ఏకైక లక్ష్యమంటున్న మైనంపాటి వంశాంకురానికి ఇక ఆకాశమే హద్దు!
కలలు అందరూ కంటారు. వాటిని సాకారం చేసుకోవడానికి అహరహం శ్రమించేవాళ్లే విజయులవుతారు. జాతీయస్థాయికోసం తపిస్తున్న శ్రీరామ్‌ స్వరయాత్రలో ఇప్పటికిది మొదటి అడుగు. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం హిందీ చిత్రాలకు పాటలు పాడి సంగీతానికి ఎల్లలు లేవని సాధికారికంగా చాటిచెప్పారు. అనంతరకాలంలో దక్షిణాదికి ఉత్తరాది గాయకులు విరివిగా వలస రావడమే తప్ప, ఇటునుంచి అటు గట్టిపోటీ ఇవ్వగల గళం కరవై ఇన్నాళ్లూ చిన్నబోయిన తెలుగుజాతికి దొరికిన పాటల తేనెల వూట శ్రీరామచంద్ర!విలక్షణ గాయకుడిగా రాణించాలన్న తహతహ ముంబయివైపు పరుగులెత్తిస్తోందంటున్న అతడి భుజస్కంధాలపై- తెలుగువారు మరెవరికీ తీసిపోరని అడుగడుగునా నిరూపించాల్సిన బృహత్తర బాధ్యత ఉంది. పాప్‌ సంగీత చక్రవర్తి మైకేల్‌ జాక్సన్‌ 'థ్రిల్లర్‌' సంపుటిలో ఒకపాట- 'అతడి నమ్మకాన్నీ అనంతమైన ఆనందాన్నీ తుంచివేయాలని ఎవరెన్ని విధాల ప్రయత్నించినా... అదృశ్య కవచమేదో రక్షిస్తోంది' అంటూ సాగుతుంది.ఎంత గట్టిపోటీ ఎదురైనా ఇరవై నాలుగేళ్ల శ్రీరామ్‌ను ధీమాగా, స్థిరంగా పురోగమింపజేస్తున్న ఆ అదృశ్య కవచం పేరు... నిరంతర సాధన, అంతకుమించిన పట్టుదల! మరుగునపడి ఉండిపోరాదన్న ఏకైక దీక్షతో ఎంచుకున్న రంగాన చిచ్చరపిడుగులై చెలరేగిన గోపీచంద్‌, లక్ష్మణ్‌,హరికృష్ణ, హంపి, మల్లేశ్వరి, సానియా, సైనాలాంటి తెలుగుతేజాల సరసన సరికొత్త వెలుగుదివ్వె శ్రీరామచంద్ర. సప్త స్వరాన్వితమైన సంగీత సాగరాన్ని మధించి గానామృతాన్ని సాధించే సుదీర్ఘ ప్రయాణానికి ఇది ఆది కావాలి. కన్నవారికి, సొంతరాష్ట్రానికి పేరుతెచ్చి- రసజగత్తును సంగీతార్ణవంలో ఓలలాడించే తెలుగు జాతిరత్నమై మనవాడు వెలుగులీనాలి!


____________________________________
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, న్యూస్‌టుడే: : బాలీవుడ్‌ గాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవడమే ఇపుడు నా ముందున్న పెద్ద కల అని అంటున్నాడు...ఇండియన్‌ ఐడల్‌-5 మ్యూజిక్‌ రియాలిటీ షో విజేత శ్రీరామచంద్ర. బాలీవుడ్‌ గాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవడం కంటే ముందు... స్వరమాంత్రికుడు ఎఆర్‌ రెహమాన్‌తో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ''ఫైనల్స్‌లో విజయం సాధించే లక్ష్యంతో ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేచాను. ఇవ్వాళ (సోమవారం) కూడా లేచాను. ఇపుడు నేను మామూలు శ్రీరామ్‌ని కాదు. ఈ షో నాకు కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది'' అంటూ శ్రీరామ్‌ తన మనసులో మాటలను పంచుకున్నాడు. ''యాశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ కోసం పాట పాడటం గొప్ప అదృష్టం. ఇండియన్‌ ఐడల్‌ షో వల్లనే ఇది సాధ్యమవుతోంది'' అని అంటాడు శ్రీరామ్‌. తనకు అన్ని రకాల పాటల్నీ పాడాలని ఉందని, సొంతంగా ఒక ఆల్బం కూడా చేసే కోరిక ఉందని తెలిపాడు. ప్రస్తుతం పార్టీ మూడ్‌లో ఉన్న శ్రీరామ్‌ హైదరాబాద్‌ చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇండియన్‌ ఐడల్‌-5 విజేత శ్రీరామచంద్ర తండ్రి సంగీత ప్రియుడే.. 1975-78 ప్రాంతంలో ఆయన పాటలు పాడేవారు.. ఓ సినిమాలోనైనా పాడే అవకాశం వస్తే బాగుండును అని ఎన్ని కలలు కన్నారో..! అవి కలలుగానే మిగిలిపోయాయి. న్యాయవాద వృత్తిలోనే స్థిరపడిపోయారు. అయితే... తండ్రి కోరికను శ్రీరామచంద్ర నిజం చేశాడు. తను కూడా తండ్రిలాగానే గాయకుడు కావాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకోవడమే కాకుండా తన గానంతో తెలుగోడి సత్తాని ప్రపంచానికి చాటిచెప్పాడు.

తాను కన్న కలల్ని కొడుకు నిజం చేసినందుకు
 శ్రీరామచంద్ర తండ్రి ఎస్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పొంగిపోతున్నారు. ఆయన ఆనందానికి అవధుల్లేవు. ఫైనల్‌ కార్యక్రమంతో నిద్ర కరువై హోటల్‌ గదికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీరామచంద్ర తండ్రి... ప్రసాద్‌ను 'న్యూస్‌టుడే' ఫోన్‌లో పలకరించింది. ఆయన ఏమన్నదీ... ఆయన మాటల్లోనే... ''సాధారణంగా టీవీ షోల్లో విజేతను మైక్‌ ద్వారా ప్రకటిస్తుంటారు. ఇందులో అమితాబ్‌ రిమోట్‌ బటన్‌ నొక్కగానే కొద్దిసేపటికి విజేతగా శ్రీరామ్‌ ఫొటో కనిపించింది. ఆక్షణం.. కలా.. నిజమా అని అనిపించింది. మా ఆవిడ జయలక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడలేకపోయింది. జీవితంలో మరవలేని క్షణాలవి..! మాకు ఎనలేని పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాడు. అంత పెద్ద నటుడు అమితాబ్‌ను కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆలింగనం చేసుకుని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నాకు ఎప్పుడు వాయిస్‌ ఇస్తున్నావని శ్రీరామచంద్రతో ఆయన అన్నాడంటే అంతకంటే గొప్ప ప్రశంస మావాడికి ఇంకేం ఉంటుంది? ఇది తెలుగు ప్రజల విజయం''.

కామెంట్‌లు లేవు: