1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

1, సెప్టెంబర్ 2010, బుధవారం

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

 
"గీతాచార్యుడు" మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణపరమాత్ముడు జన్మించిన శుభదినాన్నే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. జన్మాష్టమి నాడు ఉపవాసం ఉండి కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, మీగడ, వెన్నలను సమర్పించుకుంటే సర్వాభీష్టాలు చేకూరుతాయి.

శ్రీకృష్ణ పరమాత్మ తన చిన్ననాటి నుంచే ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, అజ్ఞానము అనే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి.

ఇంకా చిన్నతనము నుంచే అనేకమంది రాక్షసులకు సంహరిస్తూ దుష్ఠశిష్ఠరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రధసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞాననాంధకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు.

అట్టి మహిమాన్వితమైన కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని చల్లని నీటితో 'తులసీదళము'లను ఉంచి స్నానమాచరించినట్లైతే, సమస్త పుణ్య తీర్థముల్లో స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా శుచిగా స్నానమాచరించి పసుపు బట్టలు ధరించి తులసీకోటను రంగవల్లికలు, పుష్పాలు, పసుపు కుంకుమలతో అలంకరించుకుని, నేతితో దీపమెలిగించాలి. అనంతరం తులసీ కోటను 9 సార్లు ప్రదక్షణ చేసినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.

అలాగే లీలావినోదాలచే బాల్యము నుండే, భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చిన శ్రీకృష్ణుడి జన్మదినాన అందరూ గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణపాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ, ఊయలలో చిన్ని కృష్ణుని ప్రతిమను ఉంచి, రకరకాల పూవులతో పూజించి, ధూపదీప నైవేద్యములతో స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థ ప్రసాదములు దక్షిణ తాంబూలములు సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇట్టి పరమ పుణ్యదినమున శ్రీకృష్ణునికి విశేషార్చనలు జరిపించుకుని కృష్ణభగవానుని ఆశీస్సులను పొందుదుముగాక.!


  • శ్రీకృష్ణుని జన్మదినాన్ని విధంగా జరుపుకుంటారు--శ్రీకృష్ణజన్మాష్టమి.
  • శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకుంటారు--శ్రావణ శుద్ధ అష్టమినాడు.
  • శ్రీకృష్ణుడు జన్మించిన పట్టణం--మధుర.
  • శ్రీకృష్ణుని తల్లిదండ్రులు--దేవకీవసుదేవులు.
  • శ్రీకృష్ణుని మేనమామ--కంసుడు.
  • శ్రీకృష్ణుని బాల్యం ఎక్కడ గడిచింది--రేపల్లెలో.
  • శ్రీకృష్ణుడు దేవకీవసుదేవులకు ఎన్నవ సంతానం--8.
  • శ్రీకృష్ణుడు గీతోపదేశం ఎవరికి చేశాడు--అర్జునుడికి.
  • శ్రీకృష్ణుడు వస్త్రాపహరణం నుంచి ఎవరిని రక్షించాడు--ద్రౌపతిని.
  • సత్రాజిత్తు శ్రీకృష్ణుడిపై వేసిన అపవాదు--శమంతకమణిని కాజేశాడని.

Thanks & Regards
S.Sreenivasa Prasad Rao
CIQ GO GREEN TEAM
<Protect Trees—Protect yourself>

కామెంట్‌లు లేవు: