1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

1, సెప్టెంబర్ 2010, బుధవారం

సంధ్యావందనం

ఉదయం, మధ్యాహ్నం మరియూ సాయంకాలం సూర్యుడిని ఉపాసించాలి అనేది నియమం. దీన్నే సంధ్యావందనం అని అంటారు. ఉపకారం పొందుతున్నప్పుడు కృతజ్ఞత చెప్పడం కనీస ధర్మం. మనకు కనిపించేటంతలో సూర్యుడి యందు ఉపకార స్మృతి కల్గి ఉండాలి అని పొద్దున లేవగానే హే సూర్య భగవన్! నన్ను మేల్కొలిపావు, కాంతినిచ్చావు అని కృతజ్ఞత చూపాలి. ఇది మన ఆలోచనని కార్య రూపంగా మార్చి చూపడమే. మధ్యాహ్నం వరకు శక్తి పెరుగుతుంది, ఆపై శక్తి తగ్గుతుంది. కాల మార్పిడికి మరో సారి నమస్కారం చేయాలి. ఇట్లే వెలుతురు ఉంటే అలసిపోతాం కనుక తను తగ్గి చీకటిని ఇస్తాడు, అందుకు మరొక్కసారి నమస్కారం. దీన్నే సంధ్యావందనం అని అంటారు. మూడింటికి మూడు పేర్లు ప్రాత సంధ్యావందనం, మధ్యాహ్న సంధ్యావందనం మరియూ సాయం సంధ్యావందనం అని ఆయా కాల మార్పుని బట్టి.

లోకంలో కొన్ని ప్రకటన కానంత మాత్రాన చైతన్యం ఉండదు అని చెప్పలేం. సూర్యుడు బయటికి ఒక అగ్ని గోళంలా కనిపించినా, లోన చైతన్యం మూర్తీభవించి ఉంటుంది. వెనకాతల కేంద్రీ భూతమైన శక్తి విశేషం ఉంటుంది.  భూమి విషయంలో కూడా అంతే, ఆ శక్తి విశేషాన్నే భూమాతా అని అంటారు.
య ఆదిత్య గతం తేజః జగత్ బాసయతేఖిలం |
య చంద్ర మసియజాగ్నోవ్ తత్ తేజో విద్ది మామకం ||
 
ఈ జగత్తును ప్రకాశింపజేసే సూర్యుడు, ఆ గోళంలోంచి వచ్చే తేజస్సు వల్ల అన్ని ప్రకాశిస్తున్నాయి అంటే కారణం పరమాత్మ.
 
సంధ్యావందనంలో నమస్కారం చేయడం అంటే సూర్యుడిలోన నడిపే వాడికి అని అర్థం. అందుకే
"ధ్యేయః సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణః సరసిజాసనః సన్నివిష్టః
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ ధారీ హిరణ్మయవపుః భృత శంఖ చక్రః"
సూర్యగోళపు మధ్యన ఉండే, విశాలమైన నేత్రాలు కల్గిన, చేతనాచేతనముల లోన, బయట ఉండి నడిపే ధివ్యమంగళ విగ్రహానికి నమస్కరిస్తున్నా అని అర్థం.

ఇంత శ్లోకం చదవలేక పోతే కనీసం భావాన్ని వ్యక్తం చేయాలి. శ్రద్దను మనం అందించగలగాలి. 'శ్రద్దావై అపః' శ్రద్దను నీటితో సూచిస్తారు. మన శరీరం కదలగల్గుతుంది అంటే అందులో ఉండే నీరు కారణం. భగవంతుడు ఈ సృష్టి కోసం ముందు జలాన్ని తయారు చేసాడు అని వేదం తెలుపుతోంది. అందుకు మనకు ప్రాణమైన నీటిని మూడు సార్లు అర్పిస్తే చాలు.

మూడు సార్లే ఎందుకు ?
అంటే మనం లోకంలో మూడురకాల క్లేషాలను పోందుతున్నాం. వాటి వల్ల ఉద్రేకం మనలో కల్గుతుంది. వాటినే తాపములు అని కూడా అంటారు.
ఏమిటాతాపాలు ?

మన వాతావరణం వల్ల కొన్ని క్లేషాలు. ఒకసారి చలి ఎక్కువ, ఒకసారి వేడి ఎక్కువ, వీటుని తట్టుకోవాల్సిందే. ఇవన్నీ దైవిక శక్తుల వల్ల ఏర్పడేవి. అందుకే వీటికి ఆది దైవిక తాపం అని అంటారు.
మన చుట్టూ ఉండే వారి వల్ల కొన్ని క్లేషాలు. సత్తా కల్గి ఉన్న ప్రతి వస్తువును భూతం అని అంటారు. అందుకే దీనికి ఆది భౌతిక తాపం అని పేరు.

కొన్ని క్లేషాలు మనం తెచ్చిపెట్టుకుంటాం. కొన్నింటిని ఇష్టం అని, కొన్ని తగవు అని అనుకుంటాం. తగనివి వస్తే క్లేషం, ఇష్టపడేవి రాకుంటే క్లేషం. ఇవి మన లోన మనస్సు వల్ల ఏర్పడేవి. దీనికి ఆది ఆత్మిక తాపం అని పేరు.

ఈ మూడు తొలగాలి అని మనం మూడు సార్లు నీటిని అర్పిస్తాం. ఆలయంలో మనం తీర్థం మూడు సార్లు తీసుకుంటాం కారణం ఈ తాపాలు తొలగడానికి.

అట్లా అన్ని కాలాల్లో మనకి సరిగ్గా శక్తినిస్తూ అనుగ్రహించూ అని చెప్పడానికి మూడు సార్లు సంధ్యావందనం చేస్తాం. శ్రమ అవసరం లేదు, శ్రద్ద అవసరం.

కామెంట్‌లు లేవు: