చేజారిన ప్రేమ!
నువ్వు ఎప్పుడో శిథిలమైన గతానికి ప్రతీకవని నేననుకున్నాను.ఏదీ ధైర్యంగా నాలోకి ఓ మాటు తొంగి చూసి చెప్పమని నా మనసు నిలదీసింది.నాలో నువ్వు లేవని దాన్ని నమ్మించడానికి విఫలయత్నం చేశాను.మనసు పోరుకి ఎదురు నిలవలేక ఏవో నిశివీధుల్లో తప్పించుకు తిరిగాను.నేను నిమిత్త మాత్రురాలిని అన్నట్టు కాలం తన రంగులు మారుస్తూ కరిగిపోతూనే ఉంది.
గుండెలో ఏ మూలనో రహస్యంగా దాగిన మధుర జ్ఞాపకాలు ఉన్నట్టుండి నిద్ర లేచాయి.ఇన్నాళ్ళూ మా జాడ మరచినట్టు భ్రమపడుతున్నావు కదూ అని నన్ను ప్రశ్నిస్తున్నాయి.కరిగిపోయింది కేవలం కలేనని చెప్పి మనసుని మాయ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను.కల కాదు నే కోల్పోయింది మరెన్నటికీ తిరిగిరాని అమూల్యమైన ప్రేమనీ అది వాదిస్తోంది.వేదనతో ఘనీభవించిన నా మనసుని వెచ్చటి కన్నీళ్ళలో కరిగించెయ్యాలని ఉంది.
నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయిన నా అమాయకత్వానికి నవ్వొస్తోంది.నిన్ను చేజార్చుకున్న నా పిచ్చితనానికి జాలేస్తోంది.నిన్నందుకోలేకపోయిన నా దురదృష్టానికి కోపమొస్తోంది.నిన్ను చేరుకోలేని నా అశక్తతకి ఏడుపొస్తోంది.
నిరంతరం వెంటాడుతున్న నీ తలపుల నుంచి దూరంగా పారిపోడానికి ప్రయత్నిస్తూ అలసిపోతున్నాను.నా మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న నీ స్మృతుల్ని తుడిచెయ్యలేక ఓడిపోయి సోలిపోతున్నాను.ఇప్పుడు కూడా నువ్వు పంచిన అప్పటి జ్ఞాపకాలే నా తోడుగా నిలబడి నా మనసుకి ఊపిరి పోస్తున్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి