కడుపులో పెట్టుకున్న అమ్మను ఒడిలో ఎత్తుకున్న శ్రవణుడు ఇతడు...నవమాసాలూ మోసినందుకు తొమ్మిది నిమిషాలు కూడా ఇవ్వలేని నేటి కొడుకులకు పాఠం ఇతడు...పేగు తెగిన వెంటనే పారిపోయే పిల్లలకు కృతజ్ఞతే పేగుబంధమని నేర్పిన నాయన ఇతడు... రొమ్ముపాలు పట్టిన తల్లికి ఉగ్గుపాలు పడుతున్న బిడ్డ ఇతడు...ముద్ద పెట్టిన వేళ్లనే కొరికే పిల్లలకు బుద్ధి చెప్పే చేతలు ఇతడు..నడక నేర్పిన తల్లిని ఎత్తుకుని తిరిగే శ్రవణుడు ఇతడు...మాట నేర్పిన తల్లి గుండె ఘోష అర్థం చేసుకునే భాష ఇతడు...ప్రాణమిచ్చిన తల్లికి ఊపిరిపోసే ఆయుష్షు ఇతడు...తల్లిని కన్న బ్రహ్మచారి ఇతడు... - రామ్, ఎడిటర్, ఫ్యామిలీ ఈ కొడుకు ఆ తల్లికి చేస్తున్న సేవను చూస్తూంటే అమ్మ ఎంత గొప్పదో అర్థం అవుతుంది. కొడుకు ఒడిలోని ఆ తల్లిని చూస్తూంటే అనుబంధం ఎంత అనిర్వచనీయమైనదో తెలుస్తుంది. ఆ తల్లీబిడ్డల్ని కలవాలంటే విజయవాడ వెళ్లాలి. గాంధీనగర్లోని ఒక పాత ఇరుకు ఇంటి తలుపులు తట్టాలి. ఎప్పుడూ అమ్మ వెంటే... ''ఒరే శివా...అలా బిసెంటురోడ్డు దాకా వెళ్లి వద్దాం వస్తావుట్రా... కొద్దిగా పని ఉంది'' అంటూ అమ్మ ఇంకా పిలుస్తున్నట్టే అనిపిస్తుందట శివకు. ఇల్లు దాటి బయటకు ఎక్కడకు వెళ్లాలన్నా శివను వెంట తీసుకెళ్లేవారు వరలక్ష్మి. ఇద్దరు మగపిల్లలు, ఒక కూతురు ఉన్నా, చిన్నకొడుకునే తనకు తోడుగా ఆమె ఎందుకు ఎంచుకున్నారో గాని... మాటా పలుకూ లేకుండా పడివున్న ఏడుపదుల వయసులో ఇప్పటికీ శివ ఒక్కడే తల్లికి తోడుగా ఉంటున్నాడు. ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్కు యజమాని అయిన గాదె శివ కుమార్ దాని వెనుకే ఉన్న మరో చిన్న గదిలో తల్లితో కలిసి ఉంటున్నాడు. అర్చకుడిగా, ప్రింటింగ్ ప్రెస్ యజమానిగా అప్పులు మాత్రమే మిగిల్చిన తండ్రి ఏడేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటికి తల్లితండ్రులు శివ దగ్గరే ఉంటున్నారు. ''అమ్మకు పన్నెండేళ్ల క్రితం తలకు దెబ్బ తగిలింది. అప్పుడే మెదడులో నరాలు దెబ్బతిన్నాయని, ఆరు నెలలకు మించి బతకదని డాక్టర్లు చెప్పేశారు. కాని పన్నెండేళ్లుగా నేను బతికించుకుంటూనే వస్తున్నాను'' అని శివ గుర్తు చేసుకున్నాడు. కొడుకు తనకు చేస్తున్న సేవలు చూడడం, అపుడపుడు నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయతతో ఆ అమ్మ మంచం మీది బొమ్మయింది. పొత్తిళ్లలో పసిపాపలా.. కాళ్లూ చేతులు కదపలేని తల్లికి స్నానం చేయించడంతో ప్రారంభమవుతుంది శివ దినచర్య. చీర చుట్టడం, పొద్దున్నే ఇడ్లీ, పెరుగు మెత్తగా ముద్ద చేసి పెట్టడం, మధ్యాహ్నం కచ్చితమైన సమయానికి ఆమెకు అన్నంతో పాటు కూరలు కూడా మెత్తగా కలిపి తినిపించడం, మరీ చీకటి పడకముందే పెరుగన్నం కలిపి పెట్టడం, పళ్లరసాలు, మందులు... ఇవ్వడం రోజంతా తన పనితో పాటు ఇవీ తప్పనివే శివకి. లేవలేని తల్లి మంచం మీదే దేహ ధర్మాలను కానిస్తుంటే... ఆ పక్క మీది దుప్పట్లనీ, దిండ్లనీ తీసి రెండో రోజు కోసం శుభ్రంగా ఉతికి ఉంచడం గత పదేళ్లుగా క్రమం తప్పలేదు. ''అమ్మకి అలవాటని ఇప్పటికీ ప్రతి పండక్కి పండగ వస్తే ఆమెకు తప్పకుండా ఒక్క చీరైనా కొంటాను'' అంటున్న ఆ కొడుకును చూస్తూంటే ఎంత పుణ్యం చేసుకుంటున్నాడో అనిపించకమానదు. మరోవైపు తండ్రి చనిపోయే నాటికి ఆర్థికసమస్యల్లో ఇరుక్కుని ఉన్న శివ... యజమానిగానూ వర్కర్గానూ తనే పనిచేస్తూ పొదుపుగా బండి లాక్కొస్తున్నాడు. ''నీ పనులు పాడవుతాయి ఆమెను ఏ వృద్ధాశ్రమంలోనో చేర్చు '' అని చెప్పిన వాళ్లు లేకపోలేదు. '' ఇంట్లో ఎన్ని కష్టాలున్నా మాకు మాత్రం ఏ లోటు రానిచ్చేది కాదు అమ్మ. ఆమె కోసం ఈ మాత్రం చేయలేనా'' అనేదే వారికి శివ సమాధానం. పిల్లని ఇచ్చేవారేరీ... ''అన్నయ్యకు పెళ్లి అయిపోగానే నీ పెళ్లి చేసేయాలిరా... అని అమ్మ ఎప్పుడూ అనేది'' అని తల్లిని పొదివి పట్టుకుంటూ చెప్పాడు శివ. తల్లిని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్న శివకు తల్లిపై మమకారాన్ని బంధుమిత్రులు పొగుడుతున్నారు. కాని... 'తల్లిని తన కన్నా బాగా చూసుకుంటేనే' అన్న షరతుకు, వరలక్ష్మికి చేయాల్సిన సేవలకు భయపడి ఒక్కరు కూడా తమ కూతుర్ని ఇవ్వడానికి సిద్ధపడడం లేదట. ''ఈ రోజల్లో మంచానపడిన అత్తకు సేవలు చేయాలని ముందే చెపితే నన్ను చేసుకోడానికి ఎవరొస్తారండీ. అందుకే పెళ్లి ఊసెత్తడం మానేశాను''అని ప్రస్తుతం 36 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్న శివ నవ్వుతూ అనేస్తాడు. ''ఎప్పుడూ లేనిది ఈసారి దసరా నవరాత్రుల్లో కొండపైకి దర్శనానికి కూడా వెళ్లలేకపోయానండీ. తీరిక దొరకలేదు'' అని విచారంగా చెప్పాడు శివ. దర్శనానికి వెళ్లకపోతేనేం... ఇంట్లో తల్లికి ఇంత తిండి పెట్టకుండా గుడికి వచ్చే కొడుకుల కన్నా కన్నతల్లిని కంటిపాపలా కాచుకుంటున్న ఈ అభినవ శ్రవణకుమారుడు... తప్పకుండా కనక దుర్గమ్మ కృపకు పాత్రుడౌతాడు. బయటకు వెళ్లాలన్నా బాధే... నా చిన్నప్పుడు ప్రైవేట్ సిటీబస్సు టిక్కెట్ల ప్రింటింగ్ వర్క్ మేమే చేసేవాళ్లం. ఓ వైపు వంట, మమ్మల్ని తయారు చేసి స్కూలుకు పంపడం వంటి పనులన్నీ చేస్తూనే అమ్మ ప్రింటింగ్ మిషన్ ట్రైడల్ వర్క్ కూడా చాలా స్పీడుగా చేసేది. అన్ని పనులు అమ్మ ఎలా చేయగలుగుతోందా అని నాకు ఆశ్చర్యం వేసేది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుంటే ఇప్పటికీ మా ఇంటి గురించి తను చేయగలిగినంతా చేసేది. నేను లేనప్పుడు ప్రెస్కు నిప్పంటుకుంది. నా గురించి వచ్చిన వారు చూసి నీళ్లు పోసి ఆర్పకపోయుంటే అమ్మ ఏమైపోయేదో... అప్పటి నుంచి నాకు ఎప్పుడు బయటకు వెళ్లినా ప్రాణాలన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఎంతమందికి అప్పగింతలు చెప్పినా ఏదో భయం తప్పదు. - శివకుమార్ - ఎస్.సత్యబాబు, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి |
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=4680&Categoryid=11&subcatid=20
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి