మేఘన - ఆ ఒక్క క్షణం….
తలుచుకుంటే.. గుండె బరువెక్కిపోతుంది.
ఎందుకో… రాత్రి నుంచి అదే ఘటన పదే పదే గుర్తొస్తుంది.
ఎంత పాత క్షణమైనా... ఇప్పుడే తగిలిన దెబ్బలా మండుతుంది.. కారుతున్న రక్తం తగులుతున్నప్పుడు కలిగే వెచ్చటి స్పర్శ తాలూకు feeling.
అప్పుడు ఎలా face చెసానో! ఎలా నెట్టుకొచ్చానో ఆ క్షణాన్ని...
సప్త సముద్రాలు దాటొచ్చినా... అది మాత్రం నన్ను వెంటాడే గతం లా వేధిస్తూనే ఉంది.. ఇప్పటికీ..
తప్పొప్పులు... నేనెందుకలా తనెందుకలా అనే సంజాయిషీలు ఆలోచించి బేరీజు చెసుకునే ఓపిక లేదు. ఉపయోగం కూడా లేదు.
ఆ conditions అన్నిటికీ అతీతంగా… just!
ఆ ఒక్క క్షణం….....
బిగుసుకున్న నా వేళ్ళ మధ్య మధన పడుతున్న తన వేళ్ళు... బయటకి వెళ్ళే మార్గాన్ని వెతుక్కుంటుంటే..
చిరునవ్వు పెదాల మీంచి రాలిపోయింది ఆ క్షణం.
ఆర్ధ్రం గా చూసే కళ్ళు చెమ్మగిల్లి మసకబారిపోయాయి.
వీటి మధ్య ఆ నిమిషం లో నా వేళ్ళను వదులు చెయ్యాలన్న ఆలోచన తట్టనే లేదు నాకు!
ఒక రాయిలా అక్కడే అలానే నిలబడ్డాను.
పూర్తిగా రాయైనా బాగుండేది. స్పర్శ తెలిసేది కాదు...!
కానీ మనిషిని కదా.. వదిలించుకుంటున్న స్పర్శ నాకు తెలుస్తోంది. తనకి తెలుస్తోందా నేను మనిషినని?
నా స్తబ్ధత తనకి అర్ధం కాలేదేమో.
స్థంభించిపోయిన నా పట్టు ను... మంకు పట్టు అనుకుని ఉండచ్చు కూడా.
పట్టు సడలింది. చేయి జారింది. ఎదో చెప్పి వెళ్ళిపొతున్న తనని.. ఆ ద్రుశ్యాన్ని అలానే చూస్తున్నాను...
చూస్తున్నానా?? నిజం గా???
ఏమో... గుర్తు లేదు.
తరువాత ఏం చేసానో ఎప్పటికి తేరుకున్నానో నేను..
ఎలా వెళ్ళానో.. సమయానికి ఇంటీకైతే చేరుకున్నాను.
తరువాత ఏం జరిగిందో ఆ రోజు నాకు జ్ఞాపకం లేదు.
నడి రోడ్డు లో చెక్కిళ్ళ పై జారిన వెచ్చటి స్పర్శ తప్ప.. ఆ క్షణం తప్ప… ఇంకేం గుర్తు లేదు.
ఇన్నాళ్ళకు తిరిగొచ్చింది ఆ జ్ఞాపకం, ఆ క్షణం. పేలవం గా ఎండిన కళ్ళలో కనిపిస్తూ గుండెను చీల్చటానికి కాబోలు.
కాదనను.. అనలేను.. ఎంతైనా అది నా జ్ఞాపకం.
సత్తువున్నంత కాలం ఇలా వచ్చి పోతూ ఉంటుంది.. పోనీలే.. తనకి మాత్రం ఎవరున్నారని…
నాకా… మహా ఐతే మనసు కాస్త నొచ్చుకుంటుంది. అంతే కదా…
చూద్దాం ఎన్నాళ్ళు ఇలా చుట్టమై నన్ను పలకరిస్తుందో….
ఆ ఒక్క క్షణం!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి