1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, డిసెంబర్ 2010, శనివారం

ప్రణాళిక-క్రమశిక్షణ-శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ప్రణాళిక-క్రమశిక్షణ



మనం నిర్దేశించుకున్న పనిని వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టడం సరైన పద్ధతే... కానీ, దానివల్ల విజయవంతంగా పనిని పూర్తిచేయలేకపోవచ్చు. కాస్త ఆలస్యమైనా చక్కటి ప్రణాళిక వేసుకుని , క్రమశిక్షణతో చేసినప్ప్పుడు పని ఎంత క్లిష్టమైనా సునాయాసంగా పూర్తవుతుందనేది వాస్తవం.

 


ప్రముఖుడి జీవితంలోని కొన్నిఘట్టాలను పరిశీలిద్దాం. ఆయన ఒకసారి తన స్వగ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్ధులకు మిఠాయిలు కొనిపెట్టమని

 

ఉపాధ్యాయునికి డబ్బునిచ్చాడు. కానీ ఉపాధ్యాయుడు, " విద్యార్ధులకు మీ విలువైన సందేశమివ్వండి." అని విజ్ఞప్తి చేశాడు. అప్పటికి ఏవో నాలుగు మాటలు చెప్పినా ప్రముఖుడికి సంతృప్తి కలుగలేదు. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రసంగించాల్సి వచ్చినందుకు బాధపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత మళ్ళీ అదే పాఠశాలకు వచ్చి ఎంతో ఉత్సాహంగా ప్రసంగించి వెళ్ళాడు. అప్పుడు ఆయన చక్కటి ప్రణాళికతో ప్రసంగానికి సిద్ధమై వచ్చాడు మరి!

 


1947
లో ఈయన అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షుడిగా కార్యక్రమంలో ప్రసంగించాల్సి వచ్చింది. విడిదిగృహంలో తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి స్నానం ఆచరించి, చక్కటి వస్త్రధారణతో రోజు చెప్పబోయే ప్రసంగాన్ని చదువుకోసాగాడు. అదే విడిదిలో ఉన్న ఇతర ప్రముఖులు ఆయన క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన ఆచరణను గమనించి ఎంతో ఆశ్చర్యపోయారు.

 


చక్కటి ప్రణాళిక వేసి క్రమశిక్షణతో పూర్తిచేయడం కేవలం ప్రసంగాలకే పరిమితం కాదు. అసాధ్యం అనుకున్న ఎన్నో నిర్మాణాలను అవలీలగా పూర్తి చేయించిన ఘనుడాయన. కృష్ణరాజసాగర్ ఆనకట్ట, గంధపుతైలం-గంధపుసబ్బు పరిశ్రమలు, భద్రావతి ఇనుము-ఉక్కు పరిశ్రమ, మైసూర్ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్,... లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు ఆద్యుడాయనే! కర్ణాటక రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకు వెళ్ళడానికి కారణం ప్రముఖుడి ప్రణాళికాబద్దమైన కృషే. తన 102 సంవత్సరాల వయస్సులో ఏనాడుకూడా క్రమశిక్షణ తప్పని ఉత్తమవ్యక్తి, మహామనిషి. ఆయనెవరో కాదు... అందరూ గౌరవంగా 'సర్ ఎం.వి.' అని పిలుచుకునే ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

 


ఇంతకీ ప్రణాళిక లేకుండా పనీ చేయలేమా? చేయొచ్చు... కానీ, అది మార్గం తెలియని ప్రయాణం లాంటిది. గమ్యానికి ఎంతో ఆలస్యంగా చేరుతాము. ఒక సాధారణ ఇంజినీర్ 60 సంవత్సరాలలో చేయించగలిగిన పనిని 'సర్ ఎం.వి.' 6 సంవత్సరాలలోనే సాధించాడు. దీనికి కారణం చక్కటి ప్రణాళికను అనుసరించడమే! ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు పరిచేందుకు అవసరమైన అంశం... క్రమశిక్షణతో పనిని నిర్వర్తించడం. క్రమశిక్షణ మనలోని శక్తిసామర్ధ్యాలను వెలికి తీస్తుంది. ఎప్పటికప్పుడు పనులను పూర్తిచేయించి మానసికఒత్తిడి లేకుండా చేస్తుంది. ఫలితంగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు చక్కటి శారీరక ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటారు. 'సర్. ఎం.వి.' రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉండేవారు.

 


మరి మీలో ఎంత క్రమశిక్షణ ఉంది? ఒక్క అంశానికైనా ప్రణాళికను తయారు చేసుకుంటున్నారా? పాఠశాలలో బోధింపబడ్డ అంశాలు ఏరోజుకారోజు చదవడం ఉత్తమమైన ప్రణాళిక. మరి మీరు దాన్ని ఆచరిస్తున్నారా? పరీక్షల ముందు మాత్రమే చదివితే ఒత్తిడి తప్ప ఫలితముండదు. ప్రణాళిక ప్రకారం చదివేవ్యక్తులు పాఠ్యాంశాలను అవలీలగా పూర్తిచేయడమేగాక, ఆసక్తి ఉన్న ఇతర అంశాలలో కూడా ప్రావీణ్యం సంపాదిస్తారు. ఎలాంటి ప్రణాళిక లేని వ్యక్తి క్రికెట్ మ్యాచ్ లను వీక్షించడానికి, స్నేహితులతో వ్యర్ధప్రసంగాలకు,.. సమయాన్ని వృధా చేసుకుని పరీక్షలొచ్చాక చింతిస్తాడు.
కేవలం పాఠ్యాంశాలకే కాదు, దైనందిన కార్యక్రమాలను కూడా ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తూ క్రమశిక్షణను అందిపుచ్చుకోండి. అది మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో మార్పు తెచ్చి మిమ్ములను గొప్పవారిని చేస్తుంది

కామెంట్‌లు లేవు: