నుదుటి రాతను బట్టి జాతక చక్రం ఉంటుందంటారు.
అదెంత వాస్తవమో తెలియదు గానీ...
అక్షరాలను చక్రాలపై మోసుకొస్తున్న లూర్థురెడ్డి బాలల్ని చదువుబాట పట్టిస్తున్నారు.
మురికివాడల జీవిత చక్రం మారుస్తున్నారు.
''బిడ్డా టైమై పోతాంది. తొందరగా తానం జెయ్. బడి వచ్చేస్తుండాది. మళ్లా మీ ఇస్కూలు సారు గుస్సయితరు'' అంటూ పిల్లాడిని నీళ్ల గుండిగలోముంచి తేల్చి హైరానా పడుతున్న ఆ తల్లిని చూస్తూ... ''బడి రావడం కాదమ్మా. బడి దగ్గరికే మీ అబ్బాయి వెళ్లాలి'' అంటూ ఓ పెద్దాయన సరిదిద్దబోయాడు. ''కాదులే సారూ... ఈ బడికి మేం పోనక్కర్లే. మా దగ్గరకే అదొస్తది'' అని చెప్పింది ఆ తల్లి. కాసేపటికి... ''అమ్మోయ్... స్కూలొచ్చీసిందే... నే పోతున్నా'' అంటూ జారిపోతున్న నిక్కర్ని పైకి లాక్కుని పుస్తకాల సంచిని చంకనేసుకుని అమ్మ చేతుల్లో నుంచి తుర్రుమన్నాడు పిల్లాడు. వాడు గుడిసె గుమ్మం దాటేలోపే... ముంగిటకు బడి వచ్చేసింది!
''ఏరా... చంటీ... నిన్నటి హోమ్వర్క్ చేశావా లేదా?'' అని ఆ పిల్లాడిని సున్నితంగా ప్రశ్నిస్తూ... చేయి అందించి బడి బండిలోకి ఎక్కించారు లూర్ధు రెడ్డి. హైదరాబాద్లోని కూకట్పల్లి పరిసరప్రాంతాల మురికివాడల ప్రజలకు ఈ తరహా సన్నివేశాలు చిరపరిచితం.
రేపటిపౌరుల జీవితంలో అక్షరజ్యోతులను వెలిగిస్తున్న ఆ చదువుల బండి నిర్వాహకులే హైదరాబాద్, సనత్నగర్ నివాసి టి.ఎల్.రెడ్డి (లూర్ధురెడ్డి). ఈ మాజీ ఉపాధ్యాయుడు చేపట్టిన సేవాకార్యక్రమాలలో ఒకటి.. ఆంధ్రప్రదేశ్లో ప్రప్రధమంగా ఏర్పాటైన. స్కూల్ ఆన్ వీల్స్. సంచార పాఠశాల!
చదువంతా... తలా ఇంత...
వరంగల్ జిల్లాకు చెందిన టి.ఎల్.లూర్ధురెడ్డి కుటుంబం 1980 ప్రాంతంలో హైదరాబాద్కు వలస వచ్చింది. ఐస్ఫ్యాక్టరీలో పని చేస్తున్న తండ్రి స్థోమత పిల్లల్ని చదివించేందుకు సరిపోకపోవడంతో లూర్ధురెడ్డి చదువంతా దయార్ధ్ర హృదయులు అందించిన చేయూతతోనే సాగింది. బి.ఎడ్ పూర్తి చేశాక ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆయన తొలి ఉద్యోగం. తర్వాత రెడ్ క్రాస్లో సభ్యత్వం, సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థుల కోసం నడుపుతున్న పాఠశాలకు మారడం ఆయనను సేవాపథంతో మరింత మమైకం చేసింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదులుకుని 'క్లాప్' పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. క్లాప్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ శిక్షణ సెంటర్లు, స్నేహ్కుంజ్ పేరిట అనాథ పిల్లలకు ఆశ్రయం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు వంటి సేవలు మొదలయ్యాయి. ''రెక్కాడితే గాని డొక్కాడని పేదలు ఉండే మురికివాడల్లో పిల్లలను చదువు వైపు నడిపించడం అనేది కొంత కష్టమైనా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జరిగి తీరాలి. అందుకే ఈ విషయంలో నేనేమైనా చేయగలనా... అనుకున్నప్పుడు తట్టిన ఆలోచనే ఈ సంచార పాఠశాల'' అని వివరించారు లూర్ధురెడ్డి.
బడినడకలు మొదలైందిలా...
ఆలోచన వచ్చిన వెంటనే దాతలకు ఈ విషయం గురించి చెప్పి... వారి సహకారంతో లక్షల రూపాయలు వెచ్చించి స్వరాజ్మజ్దా వాహనాన్ని కొనుగోలు చేశారు. దీనిని పాఠశాల తరగతి గది తరహాలో చక్కగా తీర్చిదిద్దారు. ఇద్దరు టీచర్లతో పాటు సిడి, డివిడిల ద్వారా కూడా విద్యాబోధనకు అవసరమైనవన్నీ సమకూర్చారు. ప్రభుత్వాధికారుల సహాయసహకారాలు కూడా అందడంతో బడి బస్సు సిద్ధమైంది. అయితే విద్యార్థులు రావాలిగా... ''పిల్లల్ని పంపమంటే అనుమానంగా చూసినవారూ ఉన్నారు. వారిలో మా స్కూలు మీద పూర్తి నమ్మకం తీసుకురావడానికి దాదాపు మూడు నెలలు పట్టింది'' అన్నారాయన. పుస్తకాలు, పెన్నులు, గుడ్లు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్ వంటి పోషకాహారాన్ని పిల్లలకు ఉచితంగా అందించడం వంటివి కూడా బడిబస్సు సేవల్ని ఆకర్షణీయంగా మార్చాయి. పిల్లల్ని బ(ం)డిబాట పట్టించాయి.
''పూర్తి స్థాయి స్కూలు అందించే ప్రయోజనాలు ఇది ఇవ్వలేదని నాకు తెలుసు. నిరుపేద బస్తీల్లోని పిల్లల దృష్టిని చదువు మీద పడేలా చేయడం దీని ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశ్యం. నా నడిచే బడి... నిజానికి పిల్లల్ని బడి వైపు నడిపించే బడి'' అంటూ వివరించారు ఆయన. ''పదిహేను మంది పిల్లల దాకా ఇప్పుడు మా బస్సు దిగి ప్రభుత్వ పాఠశాల మెట్లు ఎక్కారు'' అంటూ గర్వంగా చెప్పారు లూర్ధురెడ్డి. భవిష్యత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టడం, సంచార లైబ్రరీ ఏర్పాటు చేయడం వంటి ఆశయాలెన్నో ఉన్నాయన్నారాయన.
కుటుంబం వ్యక్తికి జీవం పోస్తే... సమాజం వ్యక్తి జీవితాన్ని నిర్మిస్తుంది. సమాజాన్నే కుటుంబంగా భావించిన ప్రతి వ్యక్తి ... ఏదో ఒకరకంగా ఆ ఋణం తీర్చుకోవాలని తపిస్తాడు. అలాంటి తపన ఉన్న లూర్ధురెడ్డి లాంటి వారు మరింత మందికి స్ఫూర్తి కావాలి. అప్పుడే సమాజం సమున్నతమవుతుంది. అభివృద్ధి సర్వాంతర్యామి అవుతుంది.
ప్రభుత్వ పథకాల మీదే ఆధారపడితే ఈ బస్తీల్లో పిల్లల్ని పూర్తిగా స్కూల్స్కు అలవాటు చేయలేం. దాదాపు రెండేళ్ల నుంచి నడుస్తున్న ఈ పాఠశాలకు ఇప్పుడు వంద మందికి పైగా విద్యార్థులున్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న మురికివాడలకు చెందిన పిల్లలను ఎక్కించుకుంటుంది. క్లాసులు పూర్తయ్యాక ఇళ్ల వద్ద దించేస్తుంది. చదువు పట్ల బాగా ఆసక్తి చూపుతున్న వారిని గమనించి సమీపంలోని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నాం.
- టి.లూర్ధురెడ్డి, సంచార పాఠశాల నిర్వాహకుడు
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
22, జనవరి 2011, శనివారం
అక్షరాలకు చక్రాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి