1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

27, జనవరి 2011, గురువారం

నెలవంక నడవలేడు...నడిపిస్తున్నాడు


డాన్ బాస్కో రిహాబిలిటేషన్ సెంటర్, రామంతాపూర్, హైదరాబాద్ వికలాంగుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.
ఒక వికలాంగుడు కన్నీరు పెడుతూ పాట పాడుతున్నాడు...
వింటున్న వారిలోంచి ఒకాయన లేచి.. "ఆపండి... ఏడిపించే ఇలాంటి పాటలొద్దు. చిన్నప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి ఉన్నాం. ఇక చాలు. వికలాంగుల్లో ధైర్యం పెంచే పాటలు పాడండి. ఆశ నింపే మాటలు చె ప్పండి. జై వికలాంగ్'' అని కష్టంగా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. ఆయన పేరు శ్రీనివాస్.
వికలాంగులకు నాయకుడు.

నెల రోజుల తర్వాత.. ఎన్పిడిఓ కార్యాలయం, మలక్పేట...
ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్ని కలిసేందుకు వచ్చారు. తాము తీయబోతున్న డాక్యుమెంటరీ కోసం ఒక వికలాంగ బాలుడు కావాలని అడిగారు. కథేంటని అడిగారు శ్రీనివాస్. వచ్చిన వారు క్లుప్తంగా చెప్పారు. "బావుంది. నథింగ్ ఎబౌట్ అజ్ వితౌట్ అజ్.. మేం లేనిదే మా గురించి వద్దు.. మమ్మల్ని పనికిరాని వాళ్లుగా కాదు.. మేమూ సాధించగలమని చూపించండి'' అన్నారు శ్రీనివాస్. రెండు సంఘటనలు చాలు ఆయనేంటో చెప్పడానికి. ఏనుగమ్మ ఏనుగు అని భుజాల మీద ఆడించిన తండ్రి తన కొడుకు నడవలేడని తెలిసి రోజు బాధపడి ఉంటాడు. కానీ ఈరోజు 'నా కొడుకు వికలాంగుడు అయితేనేం...' అని గర్వంగా చెబుతున్నాడు.

ఇంటిల్లిపాదీ బాధితులే

విషం తాగి శివుడు గరళకంఠుడు మాత్రమే అయ్యాడు. కాని విషంలాంటి ఫ్లోరైడ్ నీళ్లకు నల్గొండలో చాలామంది వికలాంగులయ్యారు. అలాంటి వారిలో శ్రీనివాస్ ఒకడు. ఆయన తల్లి చక్రమ్మ కూడా ఫ్లోరోసిస్ బాధితురాలే. ముగ్గురు తమ్ముళ్లలో ఇద్దరు, ఇద్దరు చెల్లెళ్లలో ఒకరు కూడా అలాంటివారే. అందరిలో పెద్దవాడు శ్రీనివాస్. వైకల్యంలో కూడా. నాన్న పెంటోజిరావు స్వాతంత్య్ర సమరయోధుడు. కాని ఆర్థిక స్వాతంత్య్రం మాత్రం సాధించలేకపోయాడు. పేదరికంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో భార్యాపిల్లల వైకల్యం చూసి కృంగిపోయాడు. చదివిస్తేనన్నా వారి 'కాళ్ల' మీద వారే నిలబడతారనుకున్నాడు.

పిల్లలందర్నీ సర్కారు బళ్లో వేశాడు. అసలు నడవలేని శ్రీనివాస్ని మాత్రం దగ్గరలోని చిన్న ప్రైవేటు బళ్లో చేర్పించాడు. రోజూ భుజానెత్తుకుని బళ్లో వదిలి, సాయంత్రం తీసుకొచ్చేవాడు. తను ఆలస్యంగా వెళ్లిన రోజు ఒంటరిగా కూర్చుని ఏడ్చే శ్రీనివాస్ని చూసి తల్లడిల్లిపోయేవాడు. అతనికి నడక నేర్పాలని నడుం కట్టాడు. వానకు రాళ్లు తేలిన మట్టిగోడ మీద రోజూ నడిపించేవాడు. రకరకాల వ్యాయామాలు చేయించేవాడు. శ్రీనివాస్లో చలనం మొదలైంది. హైస్కూల్ చదువుకోసం శ్రీనివాస్ని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో నేర్పించారు తల్లిదండ్రులు. అది ఇంటికి చాలాదూరం. తోడు ఉంటేనేగానీ అంత దూరం నడవలేని శ్రీనివాస్ తమ్ముళ్లు, స్నేహితుల సహాయంతో పదో తరగతి వరకు చదివాడు.

ఇల్ల్లొదిలి హాస్టల్కు..

తుఫాను వచ్చేముందు వాతావరణం ఒక్క క్షణం ప్రశాంతంగా మారిపోతుంది. జీవితం గొప్ప మలుపు తిరిగే ముందు కూడా కాలం ఒక్కనిమిషం అలా ఆగిపోతుందేమో. శ్రీనివాస్ అలాంటి పరిస్థితుల్లో పడ్డాడు. పదో తరగతి అయిపోయాక ఇంటర్ చదవాలనుకున్నాడు. కానీ పేదరికం గుర్తొచ్చి ఆగిపోయాడు. హైదరాబాద్ వెళ్లి హాస్టల్లో చేరతానన్నాడు. 'తోడులేనిదే కదల్లేని శ్రీనివాస్ హైదరాబాద్లో ఎలా ఉంటాడు? పంపాలా.. వద్దా?' ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. 'ఇంకెన్నాళ్లు మా చేయి పట్టుకుని తిరుగుతాడు. వాడి కాళ్ల మీద వాడ్ని నడవనీ..'- వాళ్లో నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాస్ మలక్పేటలోని వికలాంగుల హాస్టల్లో చేరాడు. రోజు అతనికి తెలియదు హాస్టల్ తన జీవితాన్ని మార్చబోతోందని. తాను అనుభవించిన పేదరికంకన్నా దరిద్రంగా కనిపించింది హాస్టల్. అక్కడ సరైన వసతులు ఉండేవి కావు. మంచి ఆహారం పెట్టేవాళ్లు కాదు. సబ్బులు, సరుకులు సరిగ్గా ఇచ్చేవారు కాదు. పుస్తకాలు సగం చదువులయ్యాక వచ్చేవి. ఇవన్నీ చూశాక శ్రీనివాస్లో ఆలోచన మొదలైంది. మేమంటే ఎందుకింత నిర్లక్ష్యం అందరికీ అని.

ఎత్తుపల్లాలు...

శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి బాగా కలుపుగోలు మనిషి. చలాకీగా ఉండేవాడు. సీనియర్లను, జూనియర్లను పోగేసి వార్డెన్తో గొడవకు దిగేవాడు. ఇతర హాస్టళ్లకు వెళ్లి కాలేజి విద్యార్థులను కూడగట్టేవాడు. అందరూ కలిసి కళాశాల విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ కావాలని ధర్నాలు చేశారు. ఇంటర్ రెండో సంవత్సరంలో వారి కోరిక నెరవేరింది. సలీమ్నగర్లో వారికోసం ప్రత్యేక హాస్టల్ ప్రారంభమైంది. శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ, టైప్ నేర్చుకుంటూ , వికలాంగుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ బిజీ అయిపోయాడు. అతనికి ఎల్ఎల్బి చదవాలని ఉంది. కానీ పరిస్థితులు అతన్ని జర్నలిజం వైపు నడిపించాయి.

'ఉదయం' పత్రికలో కంట్రిబ్యూటర్గా చేరాడు. 1992లో ఉదయం పత్రిక మూత పడింది. తోటి విలేకరులంతా ఇతర పత్రికల్లో చేరిపోయారు. శ్రీనివాస్కు మాత్రం ఇంకో పత్రికలో చేరాలని లేదు. వికలాంగుల కోసం పనిచేయాలనుకున్నాడు. స్థానిక ఎమ్మెల్యే సహాయంతో యూత్ కాంగ్రెస్లో వికలాంగుల కాంగ్రెస్ సమాఖ్య పేరుతో ఒక విభాగాన్ని, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వికలాంగుల ఫోరమ్ని స్థాపించాడు. వికలాంగుల ఇళ్ల పట్టాల కోసం పోరాడాడు. 1994లో సెక్రటేరియట్ ముందు నిరాహాదీక్ష కూడా చేశాడు. పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది కానీ అసలైన లబ్దిదారులకు అందకుండా స్వార్థపరుల చేతులకు చిక్కాయి పట్టాలు. రాజకీయాలు అతనికి నచ్చలేదు.

పత్రిక నడిపాడు

అతని జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. 1995లో వికలాంగుల చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దాని గురించి గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నాడు. చిన్నప్పట్నించి పరిచయం ఉన్న స్నేహితులందరినీ కలిశాడు. డబ్బు పోగేశాడు. 96లో 'వికలాంగుల వార్తా తేజ' పేరుతో మాస పత్రికని ప్రారంభించాడు. కష్టంగా రెండేళ్లు నడిపించాడు. డబ్బంతా ఖర్చయిపోయింది. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు. అదీ నడవలేదు. యాక్షన్ ఎయిడ్తో కలిసి కొంత కాలం పనిచేశాడు.

వారి నుంచి ఒక పనిని ప్రొఫెషనల్గా ఎలాచేయాలో నేర్చుకున్నాడు. వికలాంగుల కోసం తాను నడుపుతున్న పత్రికకు సహకరించాలని యాక్షన్ ఎయిడ్ని కోరాడు. అతని ఆలోచనలు నచ్చి 1999లో లక్షా 36 వేల రూపాయలిచ్చింది సంస్థ. సొమ్ముతో వికలాంగుల చట్టాలు, హక్కు లు, ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి పథకాలు, న్యాయసలహాలు తదితర అంశాలను పొందుపరుస్తూ ఒక మ్యాగజైన్ని రూపొందించి లక్ష మందికి పంచిపెట్టాడు. అతని కల నెరవేరింది. గ్రామీ స్థాయిలో వికలాంగులకు కూడా పత్రిక చేరింది. సంవత్సరం శ్రీనివాస్కు వికలాంగుల స్వయం ఉపాధిలో బెస్ట్ ఎంప్లాయీగా జాతీయ అవార్డు లభించింది.

జాతీయ సంస్థలతో కలిసి...

యాక్షన్ ఎయిడ్లో ఉండగానే శ్రీనివాస్ జాతీయ వికలాంగుల సంస్థలతో కూడా కలిసి పనిచేశాడు. తమ జాతీయ నాయకుడు జావేద్ లాంటి వారి సహకారంతో తాను రూపొందించిన పత్రికను అన్ని భాషల్లోనూ ముద్రించాడు. అది 2001 జనాభా లెక్కల్లో వికలాంగుల సక్రమ గుర్తింపుకు ఉపయోగపడింది. ఆరు జిల్లాల్లో వికలాంగుల స్వాధికార ప్రాజెక్టును రూపొందించి 2002లో ప్రభుత్వం నుంచి 110 కోట్ల రూపాయల సహాయాన్ని పొందాడు. ప్రాజెక్టు చేస్తున్నప్పుడు పరిచయమైన భాగ్యశ్రీ(వికలాంగురాలు)ని 2003లో ఆసియా సోషల్ ఫోరమ్ వేదికపై పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఒక అబ్బాయి. అతను కూడా వికలాంగుడే.

నెట్వర్క్

పత్రిక నడిపిస్తూనే 2003లో వికలాంగుల కోసం ఒక నెట్వర్క్ని ప్రారంభించాడు శ్రీనివాస్. అన్ని జిల్లాలు తిరుగుతూ వికలాంగుల సం ఘాలను ఏకం చేస్తూ ఎన్పిడిఓ(నెట్వర్క్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ ఆర్గనైజేషన్)ని ఏర్పాటుచేశాడు. ఒక రూపాయి సభ్యత్వంతో 75 వేల మందిని సభ్యులుగా చేర్చాడు. 3 వేల మందికి శిక్షణ ఇచ్చి గ్రామ స్థాయిలో వికలాంగులకు స్వయం ఉపాధి, పెన్షన్లు, హక్కులు, చట్టాల గురించి అవగాహన కలిగిస్తున్నాడు. వికలాంగులకు రాజకీయ గుర్తింపు రావాలని 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిపై ఒక అంధుణ్ణి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఒక వికలాంగురాలిని పోటీ చేయించాడు. ప్రస్తుతం ఎన్పిడిఓ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 52 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అందుకే 2010 డిసెంబర్ 3 వికలాంగులకు ఉపాధి కల్పించిన బెస్ట్ ఎంప్లాయర్గా మరోసారి జాతీయ అవార్డు తీసుకున్నారు శ్రీనివాస్. ప్రస్తుతం 100 పాఠశాలను అధ్యయనం చేసి వికలాంగ బాలలకు 1995 చట్ట ప్రకారం హక్కులు కల్పించాలని కోరుతూ హైకోర్టులో రిట్ వేశాడు. ఆయన వైకల్యం ఆయన్ని ఒకనాడు ఎంత కృంగదీసిందో గాని ఇవ్వాళ మాత్రం చాలామందికి సహాయపడుతోంది.

- బీరెడ్డి నగేష్రెడ్డి
beereddy12@gmail.com

 

కామెంట్‌లు లేవు: