ప్రే మ- సప్తవర్ణాల రంజితం... సప్తస్వరాల సంగమం. నూరు వసంతాల సౌందర్యశోభను, వేల నక్షత్రాల ఉజ్జ్వల కాంతులను, లక్ష ఉషస్సుల వెలుగును తనలోనే ఇముడ్చుకున్న ప్రేమ అనే రెండక్షరాల పదం- మనిషికి జీవనపథం. జీవితానికి అర్థం- ప్రేమ అనే రెండు అక్షరాల్ని కూడబలికి చదవడమేనన్నాడు ఆరుద్ర ఓ కవితలో. ప్రేమ అంటే- మనుషుల మధ్య నిరంతర బాంధవ్య సేతువు... మనసులను శాశ్వతంగా కలిపి ఉంచే స్నేహసూత్రం... మనుగడ ప్రస్థానంలో మనిషికి దారిచూపే మణిదీపం. ప్రేమ కలుగక బ్రతుకు చీకటి అంటూ 'మరులు ప్రేమని మది దలంచకు/మరులు మరలును వయసు తోడనె/మాయ మర్మములేని స్నేహము, బ్రతుకు సుకముకు రాజమార్గము' అని ప్రబోధించాడు మహాకవి గురజాడ. చప్పున ఆరిపోయే మోహాగ్ని కాదు, చిరస్థాయిగా నిలిచే స్నేహమే ప్రేమను జ్యోతిర్మయం చేసే ఇంధనం కావాలి. కల్లకపటాలెరుగని స్నేహతత్వం వెలిగించిన ప్రేమే ఉత్తమోత్తమమైనదనిపించుకుంటుంది. వేంకట పార్వతీశ్వర కవులు ఓ సందర్భంలో అన్నట్లు, అటువంటి 'ప్రేమంబునకు విషమమృతమగును/కాల కాకోదరము పూలమాల యగును/మండు వేసవి ఎండ రే యెండ యగును/మృత్యుదేవత పరమాప్తమగును!' జననమే తప్ప మరణంలేనిది ప్రేమ.
సఫలమైనా, విఫలమైనా- మనసైనవారిపై ఎదనిండా పరచుకున్న మమకారం ఎప్పటికీ పోదు, ఎక్కడికీ పోదు. ప్రేమ నిత్యనూతనత్వానికి, అజరామర తత్వానికి నిదర్శనమది. ఎవ్వరూ జవాబు చెప్పలేని ఏకైక ప్రశ్న- మనిషి మనసున ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎందుకు అంకురిస్తుందన్నదే! పరిమళాలను విరజిమ్మాలని పువ్వులకు, వెన్నెలలు వెదజల్లాలని చందమామకు, వీవన సాంత్వన చేకూర్చాలని గాలులకు ఎవరు నేర్పారు?! ప్రకృతిలో అవి ఎంత స్వభావసిద్ధమో, గుండెలు గుసగుసలాడేటప్పుడు, మనుషుల మధ్య ప్రేమ మోసులెత్తడమూ అంతే సహజం. ప్రేమకు పెద్ద ఒజ్జ మనసే. మందమరుత్తులు, మదనశరత్తులు అంటూ- వయసుకు వలపు పాఠాలు నేర్పేది అదే. చారెడేసి కన్నులున్న చిన్నదాని చూపు తనను కదలనీయకుండా కట్టిపడేసి కలవరపెడుతుంటే- 'వట్టి కనుబొమలంతగా నిలబెట్టి నను ప్రశ్నించునా?/ కుసుమ శరుని ధనువె అది; కాకున్న నను వేధించునా?' అని చినవాడు మన్మథబాణాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, వయసును నిలువనీయని మనసు మహిమ! వల'చిన'దాని రూపంలో అలా మనసులో చొరబడి, వయసును ఉక్కిరిబిక్కిరి చేసే మదనుడి సామగ్రి ఏమంత ఘనమైనదని?! అతగాడి విల్లు తీయనైన చెరుకుగడ. దాని అల్లెతాడేమో అందాలొలికించే తుమ్మెదల బారు. వాటి సాయంతో అతడు రువ్వే అస్త్రాలు సుతిమెత్తని సుమశరాలు! 'వీడి తస్సాగొయ్యా, వీడి బాణాలు పువ్వులటోయి? ఆ మాట యవడు నమ్ముతాడు, వెర్రికుట్టె యెవడైనా నమ్మాలిగాని? అనుభవ వేద్యమైన దీని నిజం యేవిఁటంటే, మంచి పదును బట్టిన లోహం మొనకి డయిమండ్ పాయింట్ వేసి, పొయిజన్‌లో ముంచి, కంటికి కనపడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే, పైకి గాయం కనపడదుగాని పోలీసువాళ్ల దెబ్బల్లాగ లోపల తహతహ పుట్టిస్తాయి' అన్న థియరీని తెరపైకి తెచ్చాడు 'కన్యాశుల్కం'లో గిరీశం. కుసుమ శరుడు అసమ శరుడు కూడా! పదునైన బాణాలిస్తే మదనుడు ఈ లోకంలోని మనుషుల్ని ఇంకెంతగా వేధిస్తాడోనన్న వెరపుతోనే అతగాడికి అస్త్రాలుగా పూలబాణాల్ని- అదీ బేసి సంఖ్యలో అయిదింటినే- బ్రహ్మ మంజూరు చేశాడట. ఆ మాటే చెబుతూ- 'కామ, పరమేష్ఠి నీ మనఃక్రౌర్యమెరిగి పుష్పమ్ములు నీకు నాయుధమ్ములుగ జేసె/అవియు బహుళంబుగా జేయకైదు చేసె/ నింతకైనను బ్రతుకునె యిజ్జగంబు? అంటూ, మన్మథస్వామిని నిష్ఠురమాడుతుంది దమయంతి తనకు దూరంగా ఉన్న నలుడి తలపోతలో! పూలబాణం తాకిడికి లోపల తహతహ పుడితే మాత్రమేం, మదనుడు తనకు జతగా కూర్చిన చినదానితో- 'కోర్కె వెలయంగ నిను దెచ్చి కూర్చినట్టి/ తియ్య విలుకాని రుణమెందు దీర్చుకొందు'నని మురిసిపోయే కథానాయకులూ ఉంటారు.
ఎదఎదలో చినుకులా రాలుతుంది. నదులుగా సాగుతుంది. కడలిలా పొంగుతుంది. రుతువులై నవ్వుతుంది. మౌనమై మెరుస్తుంది. గానమై పిలుస్తుంది అంటూ- ప్రేమలోని 'సుందర రామ'ణీయకతను వేటూరివారు ఓ పాటలో మన కళ్లకుకట్టేలా దృశ్యబద్ధం చేశారు. 'భువనమైనా, గగనమైనా ప్రేమమయమే సుమా- ప్రేమ మనమే సుమా' అన్న ఆ అక్షర సరస్వతి పలుకుల్ని ఆశీరక్షతలుగా శిరస్సులపై జల్లుకుంటూ, ప్రేమజంటలు చెట్టపట్టాలుగా సాగిపోయే వేడుక- ప్రేమికుల దినోత్సవం- రేపే! ఏటా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన విశ్వవ్యాప్తంగా ప్రేమికులు జరుపుకొనే పండుగ అది. తమకే సొంతమైన ఆ ఉత్సవాన తమదైన స్వప్నలోకంలోకి- 'గోర్వంకల రెక్కలతో ఎగిరిపోదామన్నీ మరచి/ సరుగుడు చెట్ల నీడలలో సరదాగా తిరుగుదాం/ ఒకరి నడుం ఒకరు చుట్టి ఉల్లాసంగా తిరుగుదాం' అని ప్రేమజంటలు ఉబలాటపడటం ముచ్చటగొలిపేదే. ప్రేమికుల దినోత్సవాన అలా సాగిపోతున్న జంటలను చూస్తుంటే... 'యువతులెల్లరు రతీరామలు- యువకులో మన్మథస్వాములు/ ఏ మొగమ్మున చూపు నిల్పినా ఇగురువోసెడు కాంతివల్లులు/ ఏ సిగను పరికించి చూచినా ఏటవాలుగ నవ్వు మల్లెలు' అన్న ఆచార్య సినారె కవిత గుండె తలుపులు తడుతుంది. ప్రేమ- ఎవరి హుంకరింపులకు లొంగదు, అదిలింపులకు బెదరదు. రాజశాసనాల్నే లెక్కచేయని ప్రేమ- ఏ దండధరుల ఎదుటా మోకరిల్లదు. మనసులు ఇచ్చిపుచ్చుకొన్నవారు 'మలయానిల రథాయ మన్మథాయ/ మహనీయ విబుధాయ మన్మథాయ' అని చెరకువింటి వేలుపు దీవెనలకోసం చెట్టపట్టాలుగా కదిలిపోయే సుమనోహర దృశ్యాలు రేపటిరోజునా ఆవిష్కృతమవుతాయి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి