1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

17, జూన్ 2011, శుక్రవారం

చివరికి మిగిలేది?


లలితా స్రవంతి, lalithasravanthi@gmail.com

జోరుగా మొధలైంది వాన. అది నా మనసును కూడా కడిగేస్తే బాగుండు. అందరూ తలా ఒక్క దిక్కుకు వెళ్ళిపోతున్నారు. నేనొక్కడినే మిగిలిపోయాను.
నాకు మాత్రం దూరంగా వెళ్ళాలని లేదు. నా కాళ్ళల్లో చలనం లేదు. అసలు నా ఉనికికే చలనం లేదు. నేలరాలుతున్న ప్రతీ వర్షపు చినుకు నన్ను లోతుగా గుచ్చుతూ ప్రశ్నిస్తోంది.
వేగంగా వీచేగాలికి వెన్నులో చలి మొదలైంది. శివా! శివా! అంటే చలిపోతుందట. నాకు అలా అనాలని లేదు. మనసు నా ఆధీనంలో లేదు. ఏవేవో ఆలోచనలు నన్ను చుట్టుముడుతున్నాయి. ఒక్క క్షణం ముందు వరకు నా చుట్టూ జన సందోహం. ఈ క్షణం అంతా శూన్యం. ఒంటరిగా నేను. నిజమే నేను ఎప్పటికీ ఒంటరినే. నిన్నటి నేను ఈ రోజుటి నేను కాదు. మనిషినీ మనిషినీ కలిపేది అవసరమనే తాడేనా? నా విషయంలో కూడా ఇదే నిజమా? మరి ఇన్నాళ్ళూ అందరూ నన్ను దేవుడు, రాముడు అన్నారే? నాకు తోడుగా ఎవరూ లేరే. కనీసం ఉండాలి అనుకోవడం లేదే? ఈ ప్రవర్తన అసహజమూ కాదు. అవాంఛనీయమూ అంతకంటే కాదు. ఇది అనివార్యం. నా వరకు వచ్చేసరికి నాకు చాలా కష్టంగా ఉంది.

వెన్నులోని వణుకు మెల్లిగా గుండెకు చేరింది. తొలిసారి భయంగా వణుకుతోంది. మొదటిసారి తప్పు చేసినప్పుడు భయపడ్డాను. తరువాత భయం నాకు వశం అయ్యింది. వశం కాని భయం ఇదేనేమో! నా ఇన్నాళ్ళ ప్రబోధ లేవీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. చిన్నప్పుడెప్పుడో అమ్మమ్మ చెప్పిన గజేంద్ర మోక్షం తప్ప. అంత్యకాలంలో చెప్పుకుంటే భవబంధాలు తేలికగా తెగుతాయట. ‘‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు’’ పెదవులమీద మొదలైంది. కానీ ముందుకు సాగడం లేదు.

దూరంగా నా కోసం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆ మంత్రాలేవీ వినిపించడం లేదు. అధికమైన వాయిద్యాల హోరు నా గుండె వేగాన్ని ఇంకా పెంచుతోంది. ఈ లయబద్ధమైన చప్పుళ్ళు వింటుంటే మా పెళ్ళి గుర్తుకొస్తోంది నాకు. కమల పెద్ద కళ్ళు, సన్నగా కదిలే తన చేతి గాజులకు తోడుగా గమ్మత్తుగా మ్రోగే కాలి పట్టీలు కళ్ళముందు కదులుతున్నాయి. బీరువాలో తన పేర రాసిపెట్టిన ఉత్తరం, నేను కలిసి తన కోసం ఎదురుచూస్తున్నాను. కాని తను రాలేదు. అవును మరి నిచ్చెనను వదిలిపెట్టి ఆకాశానికి గాలం వేసిన నా కోసం తను ఎలా వస్తుంది. రాదు కూడా...
* * *

కోట్లు ఖరీదు చేసే సామ్రాజ్యం నాది. భక్తి నుంచీ ధనసామ్రాజ్యంగా రూపాంతరం చెందిన భుక్తి సామ్రాజ్యం నాది. నీరైన నియమాల మడుగులో జారిపడి పదిరోజుల నుంచీ మంచంమీదనే ఉన్నాను.
నాకు ఆకలేస్తోంది. మా అమ్మ గుర్తుకొస్తోంది. పాతికేళ్ళ క్రితం చూసా. కొడుకు స్థానం నుంచీ మాత్రం కాదు. అందరితోపాటూ తనకూ విభూతి ఇచ్చా. అందరూ కళ్ళకద్దుకున్నారు. అమ్మ మాత్రం నవ్వింది. ఎందుకో అర్థం కాలేదు.

రోజులే గడిచాయో, యుగాలే అంతరించాయో నాకు తెలియదు. నా ప్రపంచం, నా ఆర్జితం ఇప్పుడు కేవలం ఒక చిన్నగది. ఇనే్నళ్ళు నాది అనుకున్న నా శరీరంలోని ఏ భాగం మీద హక్కులేదు నాకిప్పుడు. దీన్ని ఎవరో శాసిస్తున్నారు. నా ప్రమేయం లేకుండానే.

శ్యాం వచ్చాడు. నా చెయ్యి పట్టుకుని విసురుగా కిందకు వదిలేసి నవ్వుతున్నాడు. నా కనురెప్పలను పైకెత్తి చూస్తున్నాడు. నాకు భయంగా ఉంది తనను చూడాలంటే. నాకెవ్వరినీ చూడాలని లేదు. ఎదురుగా నిలువెత్తు అద్దం. నా రూపం భయంకరంగా కనిపిస్తోంది. కాదు కాదు నా మనసే వికృతంగా ఉంది. ఒంటరితనం అడుగుల్లో కాలం భారంగా నడుస్తోంది. నా చెయ్యి కూడా కదపలేని స్థితి. గుక్కెడు మంచినీళ్ళు కూడా అందివ్వని కోట్ల ఆస్తి.
వచ్చేపోయే జనం. అద్దంలో నుంచీ తొంగిచూసే జనం. కన్నీళ్ళు పెట్టుకునే జనం.

సూదులతో గుచ్చే జనం. మాటలతో పొడిచే జనం. వీళ్ళెవ్వరూ కనిపించడం లేదు. రెండు రోజుల నుంచీ నాకు శ్వాస అందిస్తున్న ఈ సాధనం తప్ప ‘‘లావొక్కింత యు లేదు’’ అప్రయత్నంగా పలికేస్తున్నా.

హరిప్రసాద్, శ్యాం మాట్లాడుకుంటున్నారు. ఈ కృత్రిమ శ్వాస ఎప్పుడు తీసెయ్యాలి అని. విదేశాల్లో చదువుకుని వచ్చిన డాక్టర్లు కదా, తొందరగా పని పూర్తి చేస్తారు. ఈ రోజు మంచిరోజుట అందుకే రమణ వాటాలేస్తున్నాడు. శ్యాం సాయంత్రపు కార్యక్రమానికి నెయ్యి తెప్పించే పనిలో ఉన్నాడు. నాకు ఊపిరిపోసిన ఈ సాధనాన్ని దూరంగా తోసుకెళ్తున్నాడు హరి. ఆఖరి బంధం కూడా తెంచేస్తూ, శరీరం తేలికగా ఉంది.

మంచం నుంచి నేల మీదకు మారింది నా స్థానం. ఇంకొన్ని గంటల్లో ఇంకా క్రిందకు వెళతాను. వంటిమీద తెల్లటి పట్టు వస్త్రం. కమలకు తెలుపంటే ఇష్టం. జీవితపు రంగు తెలుపట. ఎన్నో వర్ణాలను తనలో ఇముడ్చుకుంటుందని. నాకు మాత్రం తెలుపంటే భయం. చిన్న మరక కూడా రెట్టింపు తేజంతో కనిపిస్తుందని, కడిగేసుకోవడం కష్టమని.
జనం తాకిడి పెరిగింది. మంచి, చెడు సమయానుకూలంగా బయట పెట్టే నేనిప్పుడు ఎందరికో దేవుడిని. అందరు మళ్ళీ రమ్మంటున్నారు నన్ను. ఒక్కసారి పలకమంటున్నారు. నాకూ మాట్లాడాలనే ఉంది. నా తల పక్కన దీపం కొండెక్కుతోంది.
* * *
మనుషులు మూడు రకాలట. ఇతరుల కోసం బ్రతికేవారు కొందరు. తమకోసం బ్రతికేవారు ఇంకొందరు. ఎవరికోసం బ్రతికాలో తెలియని వారు మరికొందరు. బాహ్య ప్రపంచానికి నేను మొదటి రకం. నా అంతః ప్రపంచానికి రెండో రకం.
వాన వెలిసింది. ఇప్పుడే అర్థమైంది నేనూ మూడోరకం అని.

నేను ఇంకా ముందుకు వెళుతున్నా. అందరూ మళ్లీ ఏడుస్తున్నారు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఏడుస్తున్నారు.
పూలు నామీద పడి వాలిపోతున్నాయి. గంధం చెక్కలు కాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ స్థానం పదిలం. పరిపూర్ణం. చరిత్రలో నా ప్రతిపుటా ఇక నుంచీ తెలుపే. నలుపంతా మింగేసిన తెలుపే.

మంటలు ఊపందుకున్నాయి. ‘‘స్ర్తి, పురుష, నపుంసక మూర్తియు గాక... వెనుక నన్నియు తానగు విభు’’ అని గట్టిగా చెబుతున్నా ఏంటో ఇప్పుడు ఎవరూ వినిపించుకోవడం లేదు. ‘‘శ్రీశ్రీశ్రీ గజానంద్ స్వామీజీకి జై’’ అంటూ పోటెత్తుతున్న నా భక్తజనం. ఈ నినాదంలో కలిసిపోతున్నా, కరిగిపోతున్నా, ఈ అగ్నిలో నా కాషాయం కాలిపోతోంది. నిజమైన సన్యాసానికి సూచికగా ఈ బూడిద మాత్రం మిగిలింది. అమ్మ నవ్వుకి అర్థం ఇప్పుడు తెలిసింది.

కామెంట్‌లు లేవు: