1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

21, జులై 2011, గురువారం

ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమేనీవు........



---------- Forwarded message ----------
From: Gurukrupa <gayathrisvr@gmail.com>
Date: 2011/7/21
Subject: Gurukrupa
To: prasadrao.sreenivas@gmail.com


Gurukrupa


ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమేనీవు........

Posted: 19 Jul 2011 08:10 PM PDT


ఆర్నెళ్ళ క్రితం నెల్లూరు వెళ్ళినప్పుడు మా పిన్నివాళ్ళింట్లో "సావిత్రి" అనే ఒక పుస్తకం చుశాను. ఎప్పటిదో (4/5 ఏళ్ళ క్రితం పుస్తకం). అందులో నాకు బాగా నచ్చినది "తిరుపతి వేంకటేశ్వర స్వామి నిజంగా ఎవరు" అన్న విషయం మీద చెలరేగుతున్నా వాదవివాదాల పై రాసిన వ్యాసం. రచయిత పేరు గుర్తులేదు. కానీ వ్యాసం మాత్రం చాలా ఆసక్తిగా ఉంది.

మనకు అందరి తెలిసిన కథ ప్రకారం వేంకటేశ్వరుడు తిరుపతి పై వెలవటానికి కారణం ఈ విధంగా ఉంది...
పూర్వం మునులందరు కలియుగంలో లోకకల్యాణం కోసం యాగం చెయ్యాలని సంకల్పించగా, నారదముని అక్కడకు వచ్చి ఆ మునులతో "ఆ యాగఫలాన్ని గ్రహీంచి కలియుగంలో లోకకల్యాణం చెయ్యగలవారెవ్వరు" అని ప్రశ్నించాడు. అప్పుడూ ఆ మునులందరూ అక్కడ ఉన్న భృగు మహర్షిని ప్రార్థించి త్రిమూర్తులలో ఆ యాగఫలం స్వీకరించగల సమర్ధుడిని పరిక్షించమని కోరుకుంటారు. మునుల కోరికను మన్నించి భృగు మహర్షి త్రిమూర్తులను పరిక్షించే నెపంతో ముందుగా సత్యలోకం చేరుకున్నాడు. అక్కడ సృష్టికర్త బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్నమై భృగుమహర్షి రాకను గమనించడు.

అందుకు కోపించన భృగుమహర్షి
"బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో ఎక్కడా పూజలుండవని" శపించి అక్కడ నుండి కైలాసం చేరుకుంటాడు. శివలోకంలో పార్వతీ శివులు ఆనందతాండవం చేస్తూ పరవశిస్తుంటారు. పార్వతీ శివులు భృగు మహర్షి రాకను గ్రహించరు. "తన రాక గ్రహించని శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని" శపిస్తాడు. సత్యలోకంలో, శివలోకంలో తనకు జరిగిన అవమానంతో మండిపడిన భృగుమహర్షి అదే కోపంతో వైకుంఠం చేరుకుంటాడు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనిస్తుంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు, లక్ష్మీ నివాసము అయిన నారాయణుని వామ వక్షస్ధలమును తన కాలితో తంతాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి "ఓ మహర్షీ! మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠినమైన వక్షస్థలమును తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో?"అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి, అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని పిసకడం మొదలుపెట్టాడు. అలా పిసుకుతూ, మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు.

కానీ, తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువుకూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.
అలకపూనిన శ్రీమహాలక్ష్మి, ఈ నాటి కోల్హాపూరి ప్రాంతాన్ని చేరుకొని తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. ఆమెను వెతుకుతూ బయలుదేరిన మహావిష్ణువు, తిరుపతి ప్రాంతం చేరుకుని అలసిపోవటం చేత ఒక పుట్టలో తలదాల్చుకుంటాడు. అతని భాదలు గమనించిన బ్రహ్మా, శివులు ఆవు, గోవు రుపంలో వచ్చి అతనికి పాలు ఇచ్చి సేద తీర్చేవారు.

ఈ కథ మనందరికి తెలిసినదే, ఇకసలు విషయానికొస్తే, తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడు అసలు విష్ణు రూపం కాదని ఒక సిద్ధాంతం ఉంది. మూలవిరాట్టుకు వెనుక భాగంలో జడ ఉందని అందువలన ఆ విరాట్టు శక్తి రూపమనీ శాక్తేయుల వాదన. అందుకు తోడు వేంకటేశ్వరుని "బాలాజీ" అని ఉత్తరాది ప్రజలు పిలవటం కూడా ఉన్నది. ఇది "బాల" రూపం అని వారి వాదన. ఇంకోవిషయం ఏమిటి అంటే, స్వామివారికి జరిగే కొన్ని పూజలు శాక్తేయులు అమ్మవారికి మాత్రమే చేస్తారనీ, అవి విష్ణు సాంప్రదాయంవి కాకపోయినా, ఇంకా ఆచారంలో ఉన్నాయని, దీనిబట్టి ఆ మూలవిరాట్టు "బాలత్రిపురసుందరి"దే అని వాదన. ఇంకో విషయం గమనించాలిందేమిటి అంటే, జగద్గురు ఆదిశంకరులు ఈ స్థలం దర్శించినప్పుడు, మూలవిరాట్టు పాదాల వద్ద శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. విష్ణు పాదాల వద్ద శ్రీ చక్రం ఎందుకు ప్రతిష్టించారు అనేది అనేక సందేహాలకు దారి తీస్తుంది. శిల్పశాస్త్రం ప్రకారం మూలవిరాట్టు విగ్రహం స్త్రీమూర్తి కొలతలకు సరిపోతాయని, వక్షస్థలంని మూసివేస్తూ శ్రీదేవి, భూదేవులను ఉంచారనేది వీరి వాదన. ఈ పుస్తకము చదవకముందు నా స్నేహితురాలు కూడ ఇలాగే చెప్పింది, మూలవిరాట్టుకు వెనుక అమ్మణ్ణి రూపం ఉందట, అందుకే అయ్యవారు శక్తిస్వరూపిణి అట అని.

ఇదే విధంగా శైవులు శ్రీ వేంకటేశ్వరుని శివరూపంగా భావిస్తారు. అందుకు తగిన ఆధారాలు వారు చూపించారు. గుడిపై ఉన్న శిల్పాలలో నంది ఉండటం ఇప్పటికి గమనించవచ్చు. వైష్ణవ ఆలయాలలో ఇది జరగదు. స్వామి పేరులో కూడా ఈశ్వరుడు అని ఉండటం గమనించండి.
(వేం= పాపములను కట = తొలగించు ఈశ్వరుడు = దేవుడు, శివుడు?). శివుని మూడవనేత్రం కప్పి ఉంచటానికే పెద్దనామం (తిరునామం) పెట్టారన్నది వీరి వాదన. ఈ వివాదాలన్నిటికీ తెరవేస్తూ, మహావైష్ణవుడైన శ్రీ రామానుజులవారు స్వామికి శంఖ చక్రాలను అమర్చి, ఈ క్షేత్రాన్ని శ్రీవైష్ణవ క్షేత్రంగా ప్రకటించారన్నది చారిత్రిక సత్యం. ఐతే, ఇప్పటికీ తేలని విషయం ఏమిటి అంటే, వేంకటేశ్వర స్వామి నిజంగా ఏ రూపం అనేది. విష్ణువా? శివుడా? శక్తిరూపమా? ఇంకెవరైనా నా? ఏమో కాని ఈ వ్యాసం చదవగానే గుర్తు వచ్చినది "అన్నమయ్య కీర్తన"
ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమేనీవు
అంతరాంతరము లెంచి చూడ బిండంతె నిప్పటి అన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులూ కురిమితో విష్ణుడని
పలుకుదురూ మిము వేదాంతులు పర బ్రహ్మంబనుచూ
తలతురు మిము శైవులు తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుడనుచూ

సరి నెన్నుదురు శాక్తేయులును శక్తిరూపు నీవనుచూ
దరిశనములు నిను నానా విధులను తలపుల కొలదుల భజింతురు
శిరుల మిము ఏ అల్ప బుద్ధి తలచిన వారికి అల్పంబగుదువు
దరిమల మిముఏ ఘనమని తలచిన ఘన బుద్దులకు ఘనుడవు

నీవలన కొలతేలేదు మరి నీరుకొలది తామరవు
ఆవల భాగీరధి బావుల ఆజలమే ఊరినయట్లు
శ్రీవేంకటాపతి నీవైతే మము చేకొను ఉన్నదైవము
ఈ వలనే నీ శరణనియెదను ఇదియే పరతత్వము నాకు
అంటే, అన్నమయ్య కాలానికే ఈ వివాదం ఉండేదని తెలుస్తోంది. నిజానిజాలు ఆ వేంకటేశ్వరునికే తెలియాలి మరి.
You are subscribed to email updates from Gurukrupa
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610



కామెంట్‌లు లేవు: