నాయకత్వ లక్షణాలున్నవారు చాలామందే ఉండవచ్చు. ఏ ఒక్కరికో మాత్రమే ఆ అవకాశం వస్తుంది. అందువల్ల నాయకుడి స్థానంలో ఉన్నవాడు తన శిరస్సుపై గురుతర బాధ్యత, తనను నమ్ముకున్నవారి భవిత ఆధారపడి ఉందని ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. తాను అందరికీ జవాబుదారుననే స్పృహ కలిగి ఉండాలి. తనలో ఏదో గొప్పతనం ఉంది కాబట్టి తనను ఎన్నుకున్నారనో, తాను వారందరి కంటే భిన్నమైనవాడిననో భావించకూడదు. అలా ప్రవర్తిస్తే తాను తాత్కాలికంగా లాభపడవచ్చునేమో కాని ముందుగా తనను నమ్ముకున్నవాళ్లు, క్రమేపీ అతడూ శాశ్వతంగా నష్టపోతారు. అప్పుడు తనకు నాయకత్వం కట్టబెట్టిన చేతులే మరేం చేయడానికైనా వెనకాడవు.
తిరువీధి తిప్పడానికి దేవతా విగ్రహాన్ని తలకెత్తుకున్న వ్యక్తి ఆ విగ్రహవాహకుడిగానే ప్రవర్తించి అందరికీ దైవదర్శనం కావడానికి సహకరించాలి. తన తలమీద ఉన్న దేవతా విగ్రహానికి పెట్టే నమస్కారాలు- దేవుడిగా భావించి తనకే పెడుతున్నారని అహంకారంతో ప్రవర్తిస్తే తగిన శాస్తి జరగకమానదు.
అహంభావం వల్ల ఆలోచనాసరళి గతి తప్పుతుంది. అందువల్ల నాయకుడికి అది ఉండకూడదు. ఇంద్ర పదవి కోరి తపస్సు చేస్తున్నాడు విశ్వరూపుడు. అందుకు కోపించి అతడి శిరస్సు ఖండించి సంహరించాడు దేవేంద్రుడు. ఆవేశం చల్లారాక ఆ పాపానికి భయపడి ఎటో పారిపోయాడు. నాయకుడు లేనివారైపోయారు దేవతలు. నాయకత్వ లేమి సంఘానికి శ్రేయస్కరం కాదని తెలిసినవారు సరైన నాయకుడికోసం వెదుకులాడుతున్నారు. అలాంటి సమయంలో అనేక క్రతువులు చేసిన పుణ్యఫలితంగా నహుషుడు దైవత్వాన్ని పొందాడు. అతడు మానవుడైనప్పటికీ అన్ని క్రతువులు చేసి తమలో కలిసినందువల్ల అతణ్ని ప్రత్యేకంగా గుర్తించి ఇంద్ర పదవికి ఎన్నుకున్నారు. ఆ నేపథ్యంలో వారివారి అంశలనీ, శక్తులనీ సైతం అతడికి ఇచ్చారు. అంతవరకూ మాములుగా ఉన్న నహుషుడికి ఆ పదవి రాగానే అహంకారం, గర్వం పెచ్చరిల్లాయి. అది ఎంతవరకూ వెళ్లిందంటే శచీదేవి (దేవేంద్రుడి భార్య) తనదిగా కావాలన్నంతవరకు. ఆ దురాలోచన గ్రహించిన శచీదేవి మునివాహనుడై(మునులు బోయీలై పల్లకీ మోయగా) తన దగ్గరకు వస్తే అతణ్ని భర్తగా అంగీకరిస్తానని తెలిపిందట. అయాచితంగా, అనాయాసంగా వచ్చిన నాయకత్వపు గర్వంతో కన్నూమిన్నూ కానకుండా సప్తరుషులనే తన బోయీలుగా ఉండమన్నాడు. దేవతలకు నాయకుడన్న కారణంగా, సప్తరుషులు అతడి పల్లకీ బోయీలయ్యారు. వారిలో కాస్త పొట్టివాడైన అగస్త్యుణ్ని అవమానపరచి అతడి తలమీద తన్నాడు నహుషుడు. అందుకు కోపించిన అగస్త్యుడు నహుషుణ్ని సర్పమై అరణ్యంలో పడి ఉండమని శపించాడు. ఆ శాపానికి విమోచన చెబుతూ తన గురించి కాకుండా, తనను ఆశ్రయించుకుని ఉన్నవారి శ్రేయం కోరుకునే వాడివల్లనే శాపవిమోచనం జరుగుతుందన్నాడని భారతంలోని కథ. కాబట్టి నాయకుడనేవాడు ఒక్కడు కాదు, అందరి సమాహారం అని గుర్తెరిగి అప్రమత్తుడై ప్రవర్తించాలి.
నాయకుడైనవాడికి కొన్ని అవకాశాలు, అధికారాలు ఉంటాయి. వాటిని పదిమందికీ ఉపయోగపడేలా ప్రయోజనం కలిగించేవిగా ఉపయోగించుకోవాలి. అంతేగాని, తన ప్రయోజనానికి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే నాయకుడనేవాడు 'ఇల్లాలు/ అమ్మ' లక్షణాలు కలిగి ఉండాలి. ఆమే తన ఇంటికి సర్వాధికారిణి. అటు భర్త, ఇటు పిల్లలు తన అధీనంలో ఉంటారు. వారి విషయాలన్నీ ఆమెకు క్షుణ్నంగా తెలుసు. ఇన్ని ఉన్నా ఏనాడూ తన సొంతం కోసం ఏమీ చేసుకోదు. తనకున్న అధికారంతో భర్తకు, బిడ్డలకు మధ్య వారధిగా ఉంటుంది. అవసర సమయాల్లో ఇద్దరినీ ఎదిరిస్తుంది, ఓదారుస్తుంది. బుజ్జగిస్తుంది. సమన్వయపరుస్తుంది. అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. నాయకుడనేవాడు అలా ఉండాలని అందరూ కోరుకుంటారు. అవకాశం వస్తే అలాంటివారినే ఎన్నుకుంటారు!
(అంతర్యామి ~ ఈనాడు ఈ-పత్రిక సౌజన్యంతో...)