1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, అక్టోబర్ 2017, శనివారం

ఇది మరీ విడ్డూరం సుమీ....

*మనం అందరం  ఎదో ఒక దాని కోసం అనేక విధాలుగా, అనేక రకాలుగా ప్రతి రోజు, ప్రతి క్షణం ఎవరో ఒకరి మీద ఆదారపడి బ్రతుకుతూన్నాం....ఇదే సమాజం అనే పదానికి నిజమైన అర్ధం కూడాను....*

మనలో చాలా మందికి (నాతో కలిపి) తీసుకోవడం బాగా తెలుసు అప్పుడు మన ఇబ్బందులే తప్ప, సహాయం పొందడానికి  ఇంకేమి అడ్డురావు. కానీ మనం ఏదైనా సాయం చెయ్యవలసి వచ్చినప్పుడు, ఇవ్వవలసి వచ్చినప్పుడు వ్యక్తిగత జీవితం, ఉద్యోగం ఇలా ఎన్నో గుర్తొస్తాయి, అడ్డుపడతాయి. మన పరిధిలో మనం చేయగలిగినా కూడా మనల్ని మనం సమర్ధించుకొంటూ చెయ్యకుండా దాటేస్తాం.

*మనం ఉద్యోగం చెయ్యడం లేదా సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం, వారి బాగోగులు చూసుకోవడం ఎలా బాధ్యతగా భావిస్తామో.....సాటి వారికి / సమాజానికి వీలైనంత సాయం చెయ్యడం మన బాధ్యతే....అదేదో మనం ప్రపంచానికి, సమాజం కోసం చేస్తున్న గొప్ప సేవ అని మరీ ఫీల్ అయిపోయి, నాకు సమయం ఉండడం లేదు, ఇది నా జీవితంలో అంత ప్రాధాన్యత కాదు అని ఆలోచించడం మానేసి.... మనం మన రోజు వారీ జీవితంలో ఖచ్చితంగా సమయం కుదుర్చుకొని చెయ్యవలసిన ఒక ముఖ్యమైన, ప్రాధాన్యత గల బాధ్యతే.*

ఇందులో ఆర్ధిక సాయం చెయ్యడమా,  నేరుగా వారిని కలిసి మానసిక స్థైర్యం నింపడమా, కాసేపు ప్రేరణ కలిగించడమా, అలా చేస్తూన్న వారికి మన సహకారం అందించడమా…... ఇది మీ ఇష్టం.....

అసలు ఏది కుదరదు అని చెప్పడానికి, నేను నా కుటుంబం అని,  అంతులేని లేని కోరికలతో, తృప్తి లేని జీవితాన్ని అడ్డం పెట్టుకొని, ఏది చెయ్యకుండా కూర్చోవడం మహా పాపం సుమీ.....మనకి మనం సర్దిచెప్పుకోడానికి మన దగ్గర ఎన్నో కుంటి సాకులు ఎప్పుడూ సిద్ధమే అనుకోండి.

*చెయ్యాలనే తపన ఉంటే వయసుతో, అంతస్తుతో, సామర్థ్యంతో, హోదాతో సంభందం లేకుండా చేసే ఎన్నో రకాల సహాయాలు సిద్ధంగా ఉన్నాయి మిత్రమా.....ఆలోచించు... అడుగెయ్యి...*

నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/10/14 19:06

కామెంట్‌లు లేవు: