ఏంది నాయనా... దేశంలో లేదా ప్రపంచంలో ఎటు చూసినా, ఎవ్వరిని కదిలించినా దుఃఖం, అశాంతి, అసంతృప్తి, ఆరాటం, వ్యతిరేక భావం, యుద్ధం..... మనిషి జీవిత పరమార్థమైన లేదా లక్ష్యమైన *"ఆనందంగా/సంతోషంగా ఉండడం, ప్రేమను పంచడం"* అనే విషయాన్ని తాకట్టు పెట్టైనా సరే, ప్రపంచాన్ని జయించాలని లేదా తరతరాలకు తరిగిపోని సంపదను కూడగట్టుకోవాలనే ఆశతో, వ్యామోహంతో... తనలోనే దాగి ఉన్న సంపదను మర్చిపోయి... న్యాయం, ధర్మం, సత్యం మొదలగునవి గాలికి వదిలి... తన ప్రియం, లాభం కోసం ఏవేవో చేస్తూ... బంధాలను, అనుబంధాలను గుర్తించక, ఏవో ఉన్న కొన్నింటిని తెంచుకుంటూ... డబ్బు సంపాదన, ఇతరులతో పోలిక మొదలగు వాటి మోజులో పడి, నిరాశ నిస్పృహలతో, తీవ్రమైన ఒత్తిడితో, వంటరిగా జీవితాన్ని బలవంతంగా సాగదీస్తున్నారు (భూమిపై జరిగే అన్ని అనర్ధాలకు, అమానుషాలకు ఇదే కారణం). ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం ఆనందానికి దూరంగా బతుకుజీవుడా అంటూ లైఫ్ ని సాగదీస్తున్నాడు.
*పోనీ.. మనిషి ఆనందంగా, సంతోషంగా బ్రతకడానికి కావలసిన అవసరాలను తీర్చుకోవడానికి లేదా సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడులే అనుకొందామా అంటే, అదీ లేదు.* ఎందుకంటే మన చూపు, గురి ఎప్పుడో మన లక్ష్యం (*"ఆనందంగా/సంతోషంగా ఉండడం, ప్రేమను పంచడం"*) నుంచి విడి వడి, వడివడిగా ప్రాసెస్ మీద ఫోకస్ తో, ప్రోసెస్ లొనే ఇరుక్కుపోయి గజిబిజిగా, గందరగోళంలో నా పేరు బికారి, నా దారి ఎడారి అన్నట్టుగా భ్రమలో... ఎటో...కొట్టుకొని...పో...తా....వున్నాము.
జగమెరిగిన జంగమోడికి శంఖమెందుకు అన్నట్టు, ఇదంతా తెలిసిందేగా మళ్ళీ చెప్పడం ఎందుకు చెప్మా అంటే.....అక్కడికే వస్తున్నా....
పోనీ...మానవ లక్ష్యమైన *"నిరంతర సంతోషం"* దిశగా మనల్ని నడిపించే జ్ఞానం భారత దేశంలో అందుబాటులో లేదా అనుకుంటే అదీ పొరపాటే. అద్భుతమైన ప్యాకేజీ రూపంలో ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య, అదేమిటంటే సగం తెలిసిన వారు దానిని వారికి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉండడం, జనాలు ఏది నిజమో, ఏది అబద్దమో, దేనిని నమ్మలో, దేనిని నమ్మకూడదో తేల్చుకోలేని గందరగోళ స్థాయికి వచ్చేశారు. కాబట్టి ఎవరు ఏది నేర్చుకునే ప్రయత్నం చెయ్యరు.
*"సినిమాలు, షికార్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, టూర్లు, ఆటలు, పనికొచ్చేవి, పనికిరానివి ఇలా ఎన్నింటికో సమయం వెచ్చిస్తాం, ఫలితం వచ్చినా, రాకపోయినా ట్రైల్స్ వేస్తాం."* కానీ మనిషి నిరంతరం ఆనందంగా జీవించడానికి కావలసిన అతి ముఖ్యమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రం సమయం మన దగ్గర ఉండదు. మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటాం.
*ఏమప్ప సిద్ధప్ప, ఎప్పుడూ హ్యాపీగా లేనప్పుడు, హ్యాపీగా ఎలా ఉండాలో తెలియనప్పుడు మనం ఎన్ని చేసినా ఏమి ఉపయోగం. సమయం లేక కాదు. ఖాళీగా, వృధాగా ఎంతో సమయం మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. దీని తీక్షణత గుర్తించిన వారు ఎలాగైనా సమయం తీస్తారు. ఎందుకంటే జీవితంలో సర్వప్రధమం మనం ప్రాధాన్యత ఇచ్చి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఇదే కాబట్టి.*
దుఃఖాన్ని చంకలో ఎట్టుకొని ధునియా మొత్తం తిరుగుతాను అంటావ్ గానీ, సంతోషం పొందే మార్గం మటుకు వద్దంటావ్. అవునులే మనం అభివృద్ధి ముసుగులో, కెరీరే (డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదనే) జీవితంగా బ్రతుకుతున్న మనుషులం కదా....
ఏమిటో నా అనంతరంగం ఒకటే లొల్లి ఏదైనా రాయమని దీనిగురించి. మీ అమ్మ శ్రీనివాస్
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
19, ఏప్రిల్ 2019, శుక్రవారం
మానవ లక్ష్యం సంతోషమేనా.... సందేహమే మరి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి