1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

21, మే 2019, మంగళవారం

మనం వెతికేది షార్ట్ కట్ కోసమే

*ఏమిటో నా అనంతరంగంలో ప్రతి క్షణం ఇవే ఆలోచనలు. ఏమి చెయ్యాలి చెప్మా.. అందుకే రాసి నాకు హితులు, స్నేహితులు అయిన మీ మీద వదులుతూ వుంటా, పాపం మీకు తప్పదుగా, చదువుకోండి...మీ అమ్మ శ్రీనివాస్*


సినిమాలలో హీరోలలాగానో (లేదా) నిజ జీవితంలో వ్యాపారవేత్తల లాగానో ఒక్క గంట లో సమాజాన్ని మార్చెయ్యడం, (లేదా) బాగా సంపాదించేసి భారీ ఎత్తున (ప్రపంచం అంతా గుర్తించేట్టు, అవాక్కయేట్టు) సాటి వారికి సాయం చెయ్యాలి *అనే ఆలోచన సమాజంలో చాలా బలంగా నాటుకుపోయిన మాన్యత.*

*చెయ్యాల్సిన, చెయ్యగలిగిన పనులు మానేసి ఎప్పుడో ప్రపంచాన్ని ఉద్దరించాలి అనే వాయిదా వేసుకొనే ఆలోచనలు ఎందుకు మాష్టారు.* ఈ ఆలోచన విధానమే తప్పు మహాప్రభో. *తెలిసిన, తెలియకపోయినా, నచ్చిన, నచ్చకపోయినా ప్రతి క్షణం మనకు అవసరమైన సాయం, సాటి వారిని నుంచి అప్పనంగా తీసుకోవడం / పొందడం ఎలా అయితే మన నరనరాల్లో జీర్ణించుకుపోయిందో, అలాగే.... మనకున్న దాంట్లో ప్రతి క్షణం సాయం చెయ్యడం (ఎందుకంటే తీసుకున్నది తిరిగి ఇవ్వడం) మన కనీస భాద్యతగా అలవాటుచేసుకోవాలి.* ఇది మన కల్చర్ లో నుంచి, మన DNA లో నుంచి క్రమేపి కనుమరుగైపోతోంది. రాబోయే  రోజుల్లో సాటి వారికి సాయం చేసే భాద్యత గల వారిని ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి పుట్టించాల్సిన రోజులు దగ్గరపడ్డాయి. *ఇదెలా ఉంటుందంటే నిర్లక్ష్యం వలన తీర్చడం మానేసి పెరిగి పెద్దదైన (రోజు రోజు కి పెరిగిపోతున్న వడ్డీతో) అప్పుని తీర్చడం చేతకాక అప్పుడు, ఇప్పుడు అని వాయిదా వెయ్యడంలాగా. దీవాల తీయడం తప్ప, తిరిగి ఇవ్వడం వుండదు.* అసంతృప్తితో చనిపోతూ, ఈ మొత్తం అప్పుని కట్ట కట్టుకొని తీసుకుపోతావు. అప్పుని మాత్రమే కాదు సుమీ, దానిని సకాలంలో తీర్చకపోవడం వలన వచ్చే పరిణామాలను, ఫలితాలను కూడా.

*"ఎన్ని జరిగిన, జరుగుతున్నా, ఇప్పటికీ మనం వెతికేది షార్ట్ కట్ కోసమే. అది సంపాదన అయినా, సంతోషం అయినా".* మనం ఏమి చెయ్యనక్కరలేదు, చెయ్యగలిగిన చిన్న చిన్న పనులను (ఎదో సమాజాన్ని మనం ఉద్దరిస్తున్నామనే భావనతో కాకుండా) *నా ఋణాన్ని నేను ఖచ్చితంగా తీర్చుకోవాలి, తీర్చుకుంటున్నాను అనే కృతజ్ఞతా భావానికి ప్రాధాన్యత ఇస్తూ... నిబద్దతతో,  భాద్యతతో,8 ప్రేమతో, సంతృప్తితో చెయ్యాలి, అది చాలు.*

*చేయగలిగిన చిన్న చిన్న పనులను, తిరిగి ఇవ్వగలిగిన చిన్న చిన్న అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోకుండా..చూసి చూడనట్టు, పట్టీ పట్టనట్టు, నిర్లక్ష్యంగా,(కొన్ని సంవత్సరాల తరువాత/ జీవితంలో బాగా స్థిరపడిన తరువాత/పెళ్ళైన తరువాత/వుద్యోగం రాగానే/చదువు అవగానే/ రిటైర్మెంట్ అవగానే/బాగా సంపాదించగానే ఎదో ఉద్దరిస్తాను లాంటి) వాయిదా వేసే ధోరణితో వ్యవహరించే (మన)అందరిలోనూ ఈ మార్పు రానంత కాలం..మారవ్.. మారవ్..రోజులు ఎప్పటికి మారవ్...* మీ తిట్లు, కామెంట్లు ఏమైనా ఉంటే కింద లింక్ లొనే రాసుకోండి...

మీకు ఇంకా తనివి తీరకపోతే, నా మరిన్ని రాతల కోసం సందర్శించండి http://ammasrinivas4u.blogspot.com/ *(కాకపోతే నా ఆశ, శ్వాస ఒకటే. కాబట్టి ఆలోచనలు, రాతలు కూడా వాటి మీదే)*


కామెంట్‌లు లేవు: