*మేము మారం-మేము మనీశులం- మాదంతా వినాశ కులం (మాలో చాలా మందిది మూర్ కులం కూడా)*
ఏంది భయ్యా ఇంత నెగటివ్ గా ఉంది... మనం ఎక్కువ మంది ఇలానే ఉన్నాం, ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం... మన నిజ స్వరూపం మనకు తెలియంది కాదుగా... పైపైనే కవరింగ్ లు చేసేసుకుంటూ... గడిపేస్తున్నాం... కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో జంతు, పక్షి జాతులు నాశనమైనా, మనం మటుకు శిలేసుకొని, మృత్యుంజయులమనే భావనతో పోతా...ఉన్నాం...
వరదలకి మారామా...!
వడగండ్లకి మారామా...!
భూమి కంపిస్తే మారామా...!
ఉపద్రవాలకి మారామా...!
ప్రకృతి వైపరీత్యాలకి మారామా....!
సునామీకి మారామా...!
గ్లోబల్ వార్నింగ్ కి మారామా...!
సహజ వనరులు తగ్గితే మారామా...!
కాన్సర్, అల్సర్లకు మారామా...!
అప్పుడేప్పుడో కలరా కదిలించినా -
ఇప్పుడు కరోనా వచ్చినా !
అబ్బే మేము మారుతామా...??? "మేము మారం"
కర్ఫ్యూ అన్నా, కరోనా అన్నా, ఎవరు ఏమన్నా మేము మటన్ షాప్ ల ముందు బారులు తీరుతాం... తిరిగి మేమే మార్చురీలలో మాంసం ముద్దలవుతాం... అయినా "మేము మారం"
మట్టిని, చెట్టుని, పిట్టని, చివరికి మనిషిని... నానావస్థలు పడి, ఎలాగైనా సరే ఆ... నాలుగు అవస్థలను అస్తవ్యస్థం చేస్తాం, సామరస్యాన్ని సమాధి చేస్తాం, అస్థిరమైన మన అస్థిత్వాన్ని చాటుకొంటాం, చివరికి మా నోట్లో మేమే మన్ను కొట్టుకుంటాం.... ఎందుకంటే సృష్టి మొత్తం మేమే, మా కోసమే అన్న అహం... అందుకే "మేము మారం"
పాత పద్ధతులు చేదంటాం, విజ్ఞానం లేదంటాం, అన్నిటినీ ప్రశ్నిస్తాము, దేనిని ఆచరించం, మంచి ఎక్కడో గ్రహించం, అన్నిటికి పెటెంట్ అంటాం, లేకపోతే గుడ్డిగా నమ్మమంటాం... జ్ఞానానికి, మతానికి, మనిషికి, మానవత్వానికి ఏవేవో లింకులెడతాం, మా వాదమే నిజమంటాం... చివరకి అటు ఇటు కానీ మనుషులం అవుతాం... తెలుసుగా "మేము మారం"
మనం మారకుండా, మనల్ని నియంత్రించు కోకుండా ఏదో విధంగా సమస్యకు ఒక (తాత్కాలిక) సమాధానం కనిపెడతాం, ప్రకృతితో పరాచకాలు ఆడుతాం, ఏవేవో అరాచకాలు చేస్తాం, బాధ్యత మరుస్తాం, తరచు ఇలా భయంతో వణికి చస్తాం......అయినా "మేము మారం"
మనల్ని, మన తోటి మనుషులను అర్ధం చేసుకొనే జ్ఞానమే మనకు లేదు... ఇక ప్రకృతిని, దాని నియమాలను, సృష్టి రహస్యాలను ఏమి అర్ధం చేసుకోగలం... కానీ... అన్నీ తెలుసనో, తెలుసుకోగలమనో అహంభావంతో ప్రపంచాన్ని పాలించాలంటామ్, తెలిసీ తెలియక తనువు చాలిస్తాం... ప్రకృతిని ప్రేమిస్తే, గౌరవిస్తే అన్నీ తెలుసుకోవచ్చు అనే చిన్న విషయాన్ని మరుస్తాం...ఎన్ని జరిగినా "మేము మారం"
మనుషుల మధ్య బంధాలను విస్మరిస్తాం, ఏదేదో గ్రహాల మధ్య దూరాలను విశ్లేషిస్తాం...ఇంటిలో మనుషుల మధ్య మొదలలై, దేశాల సరిహద్దుల దాకా జరిగే ఆధిపత్య పోరులో అశువులు భాస్తాం... ఇంతకీ ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చాం, ఎందుకు ఆరాటం, దేని కోసం పోరాటం...ఏమో ఎవరికి తెలుసు ? పాడే ఎక్కినా తెలీదు, ఎక్కిన వారిని చూసైనా అర్ధం చేసుకోము. పోనీ కాసేపటి స్మశాన వైరాగ్యమైనా కానరాదాయే.... తెలిసిన జ్ఞానులము కాదు, తెలుసుకోలేని గొర్రెలము కాము...తెలుసుకొనే సమయము, సహనము రెండు లేవాయే... వీటికితోడు ఎవరికి వారు తామే గురువు అనే భావన...
ప్రకృతితో ప్రేమగా జీవించే మార్పు మా DNA లో లేదంటామ్, రాదంటాం.... మా అలవాట్లను, పద్దతులను మార్చుకొకుండా పని జరగాలంటాం. కానీ ఇలా ప్రకృతి కన్నెర్ర చేస్తే... ఇంకేం చేస్తాం.... చెయ్యకపోతే కలిసి కట్టుగా చస్తాం... ఇంకెంతకాలం మారకుండా ఉంటాం....
*మనిషి నేనొక్కడినే అనే భావనలో కాకుండా... ప్రకృతితోను, అందులోని అన్ని జీవరాసులతోనూ కలిసి, మమేకమై సామరస్యంతో ఆనందంగా మనుగడ సాగించడమే మానవ జీవిత లక్ష్యం. దానిని తెలియచెప్పి, అర్ధంచేయించి (చదువు), ఆచరించేట్టు (సంస్కారం) చెయ్యడమే మన విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి పరిశ్రమలకు ఉద్యోగస్తులనే కాకుండా, మనిషిగా సామరస్యంతో జీవించే మనుష్య జాతిని తీర్చిదిద్దడం ఈ విద్యకే సాధ్యం, ఈ మార్పుకు విద్యా రంగమే తొలి మెట్టు...* ఇదే నా ఆనంతరంగం... మీ అమ్మ శ్రీనివాస్... 2020/03/22 01:32
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి