సంధ్యోపాసన అనేది ఉపనయనం అయిన ప్రతి వ్యక్తీ చేయవలసిన నిత్యోపాసన. శూద్రుడు గా జన్మించిన ప్రతి మనిషీ, సంస్కార కర్మ వల్ల ద్విజుడు అవుతున్నాడు. ఉత్త జంధ్యాన్ని ధరించి నంతమాత్రాన ఎవడూ ద్విజుడు కాలేడు. సంద్యోపాసనా రహస్యాలనుతెలుసుకొని ఆచరించి దాని లోతులు అందుకున్న వాడే ద్విజుడు. ఇతరులు ఒట్టి వేష గాళ్ళు మాత్రమె.
ప్రపంచం యొక్క, తన జీవితం యొక్క అనిత్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవటమే రెండవ జన్మ.అంతే గాని ఉత్త యజ్ఞోపవీతాన్ని ధరించటం కాదు. ఈ విధం గా ద్విజుడైన వాడు ఈ లోక యాత్రను సాగిస్తూనే ఆత్మ సాధనను కూడా అభ్యాసం చేస్తాడు. ఈ విధమైనటువంటి అవగాహనను ఇచ్చే సంస్కార కర్మయే ఉప నయనం.
ఈ ఉప నయనం అనే మాటకు సామాన్య అర్థం ఏదైనప్పటికీ నేను మాత్రం ఒకే అర్థాన్ని విశ్వసిస్తాను. మానవునికి గల మూడో కన్ను అనబడే నేత్రాన్ని వికశింప చేసేదే ఉపనయనం. ఈ మూడో కన్ను అనేది దేవీ మూర్తులకు, పరమేశ్వరునికి ఉన్నట్లుగా మనం చిత్రాలలో చూస్తాము. ఇది వెన్నెముకలో ఉన్న షట్ చక్రాలలో చివరిదైన ఆజ్ఞా చక్రానికి సరాసరి సూటిగా నుదుటిలో ఉండే నాడీ కేంద్రం.
ఇది వికశించిన మనిషి దేవతలతో సమాన మైన స్థితిని అందుకుంటాడు. దీనికి సూచికగానే హిందువులలో నుదుటిలో బొట్టును ధరించటం అనే సాంప్రదాయం వచ్చింది.బొట్టు అనేది జాగృతి చెందిన మూడవ నేత్రానికి సూచిక. కాని మన ఖర్మ కొద్దీ నేటి ఆడపిల్లల్లో బొట్టు పెట్టుకోవటమే మోటు అనే స్తితి వచ్చింది. దీనికి తల్లి దండ్రు లదే పూర్తి బాధ్యత. వాళ్ళకే తెలియని విషయాలు వారి పిల్లలకు ఏమి నేర్పించగలరు?
ఇది ప్రతి మనిషికీ ఉంటుంది. కాని నిద్రావస్థ లో ఉంటుంది. దీనిని వికసింప చేయ గలిగితే మానవుడు అతీంద్రియ జ్ఞానం కలిగిన వాడౌతాడు. అంటే ఇతరులు చూడలేనివి అతడు చూడ గలుగుతాడు. ఇతరులు వినలేని శబ్దాలు అతడు వినగలుగుతాడు. సూక్ష్మ భూమికలతో అనుసంధానం కాగలుగు తాడు. అతీంద్రియ సిద్ధులు పొందగలుగుతాడు. అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని వెలుగును దర్శించ గలుగుతాడు.
ఇటువంటి ఉప నయనాన్ని (additional eye ) ఇచ్చే సంస్కార కర్మనే ప్రాచీనులు ఉప నయనం లేక వడుగు అని పిలిచారు. కాని ఈ అర్థం ఇప్పుడు పూర్తిగా విస్మరింప బడింది. ఆంతరిక మైన యౌగిక అర్థం మరుగున పడి, ప్రస్తుతం వడుగు అంటే బంధు వర్గం అంతా కలిసి చేసుకునే ఒక పండుగ గా మారిపోయింది. తూ తూ మంత్రంగా ముగించే ఒక తంతు గా మారింది. వివాహానికి ముందుగా చెయ్యాలి కాబట్టి, విసుక్కుంటూ చేసుకునే ఒక తంతు గా మారిపోయింది. ఇది పూర్తిగా తప్పుడు పధ్ధతి. ఇటువంటి స్థితి ఎందుకు కలిగింది? ముఖ్యంగా కలి ప్రభావం వల్ల మనిషి ఇంద్రియ వ్యామోహాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక సాధనను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యటమే దీనికి కారణం.
గురుతెరుగగ జెప్పు గురుడెవ్వ డునులేడు
గురుతు నెరుగు శిష్య వరుడు లేడు
గురుడు సిష్యుడ నుట గుడ్డెద్దు చేనురా
విశ్వ దాభి రామ వినుర వేమ
అని వేమన యోగి చెప్పినట్లు, అంతరార్థాలు వివరించే గురువులూ ప్రస్తుతం కరువయ్యారు. చెప్పినా విని ఆచరించే శిష్యులూ కరువయ్యారు. కనుకనే జీవం లేని కట్టెలా, ఆంతరిక అర్థాలు లేని ఉత్తుత్తి ఆచరణలు, పై పై తంతులు మాత్రమె మిగిలి హిందూ మతం, పండుగలు పబ్బాలు చేసుకుంటూ, సినిమాలు వీడియోలు చూసుకుంటూ బంధువులంతా కలసి లోకాభిరామాయణం చెప్పుకునే ప్రస్తుత స్తితికి చేరింది. ఈ స్థితిని ఊర్ధ్వ లోకాల నుంచి చూచి గోత్ర ఋషులు ఎంతగా బాధ పడుతుంటారో ఆలోచిస్తే బాధ కలుగుతుంది. ఇది నిజం గా శోచనీయం.
ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. సంధ్య అంటే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారే దశ (transitional state). మనకు ఇరవై నాలుగు గంటలలో ఈ స్థితి నాలుగు సార్లు వస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధ రాత్రి. ఈ నాలుగు సమయాలలో ప్రక్రుతి ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారుతుంది. కనుక అప్పుడు సాధనకు అత్యంత అనుకూల సమయం గా ఉంటుంది.
కారణం? ఏ స్థితి అయినా కోన సాగుతున్న వరకూ మనిషి అదే శాశ్వతం అనే భ్రమలో ఉంటాడు. కాని ఆ స్థితి మారినప్పుడు అతనికి ఆ స్థితి యొక్క అనిత్యత్వం బాగా అనుభవం లోకి వస్తుంది. సరిగ్గా సంధ్యా సమయంలో ఇదే జరుగుతుంది. మారిన ప్రక్రుతి స్థితి వల్ల ప్రపంచం యొక్క అనిత్యత్వం సరాసరి మానవుడు అనుభవించ గలుగుతాడు. అందుకే ఆ స్థితి ని చాలా మంది తట్టుకోలేరు.
సాయం కాలాల్లో ప్రశాంతం గా కూర్చోనలేక బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరిగటానికి తయ్యారు అయ్యేవాళ్ళు మనకు చాలా మంది దర్శనం ఇస్తారు. వారంతా బజారు లోని జన సందోహం తో మమేకం చెందుతూ మనం హాయిగా ఉన్నాం మనకు ఏమీ పరవాలేదు అనే భ్రమను కల్పించుకొని తమ అంతచ్చేతనను మోసం చేసుకుంటూ ఉంటారు. మనస్సు లోపల లోతులలో ఇంత తతంగం జరుగుతుంది అని స్పృహ కూడా వారికి ఉండదు.
గొర్రె అనే జంతువు మందలో ఉంటూ తాను సుఖంగా ఉన్నాను అన్న భ్రమలో ఉంటుంది. కాని మృత్యువు తనను మింగటానికి వస్తున్నది అన్న నిజం అది తెలుసుకోలేదు. తెలిసినా ఆ స్పృహను తప్పించుకోటానికి మందతో మమేకం చెందుతూ అదే రక్షణ అన్న భ్రమలో ఉంటుంది. మనుషులలో కూడా చాలా మంది ఈ గొర్రె స్థితిలోనే ఉంటారు.
అందుకే మామూలు మనిషికి సాధకునికి ఉన్న అతి చిన్న తేడా ఏమిటంటే, సంధ్యా సమయంలో సాధకుడు ఏకాంతాన్నిఅభిలశిస్తాడు. జనం తో కలవడానికి ఇష్టపడడు. బాహ్య మైన భ్రమలకంటే ఆంతరిక మైన సత్యాన్ని ధైర్యం గాఎదుర్కోటానికే అతడు ప్రాధాన్యత నిస్తాడు. అందుకే సాధకుడైన వాడు ఈ సంధ్యా సమయాన్ని దుర్వినియోగం చెయ్యరాదు. ఇతరత్రా వ్యాపకాలు వదలి ఆంతరిక ధ్యాన సాధనలోనే ఈ సమయాన్ని ఉపయోగించాలి.
అలాగే, మానవుని జీవితంలో సంధ్యా సమయం కూడా నాలుగు సార్లు వస్తుంది. మానవుని పూర్ణాయుర్దాయం అయిన 120 ఏళ్లలో ప్రతి 30 ఏళ్ళకూ ఒకసారి సంధ్యా సమయం వస్తుంది. కొందరికి 96 మరి కొందరికి 108 గా ఈ ఆయుర్దాయం ఉంటుంది. అటువంటి వారికి ప్రతి 24 మరియు 27 ఏళ్లకు ఒకసారి ఈ సంధ్యా సమయం వస్తుంది. ఈ వివరాలు జ్యోతిర్విజ్ఞానం లో భాగమైన కాలచక్ర దశా జ్ఞానం ఉన్నవారికి బాగా అర్థం అవుతాయి.
కాల చక్ర దశ అనేది దశా విదానములలో ఒక ముఖ్య మైన దశ. పరాశర మహర్షి దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇది రాశి దశ. ఉడు దశ కాదు. అలాగే రాశి చక్రంలో ఉన్న నాలుగు విభాగాలలో ఈ సంధి కాలం మనం జ్యోతిష్యం లో కూడా చూడవచ్చు. 1,4,7,10 భావాల మొదటిలో ఈ సంధి కాలం ఉంటుంది.
శైశవం,యవ్వనం,నడి వయస్సు,ముసలి తనం ఈ విభాగాల ద్వారా సూచింప బడతాయి. సహజ నైసర్గిక కారకాత్వ పరంగా ఈ విభాగాలకు బుధుడు,కుజుడు,గురువు,శని గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. ఈ విధమైన సమన్వయము జీవితానికి, ప్రకృతికి, గ్రహాలకు, ఆంతరిక-బాహ్య పరంగా కనిపిస్తుంది. కాని చూచే దృష్టి తో దీనిని చూడాలి.
ఆంతరిక యోగ ధ్యాన సాధన చేసేవారికి దీనిలోని ఇంకొన్ని రహస్యాలు తెలుస్తాయి. మనం మెలకువ నుంచి నిద్రలోకి పోయే సమయంలోకూడా సంధ్యా సమయం ఉంటుంది. అలాగే నిద్ర నుంచి మెలకువకు వచ్చే స్థితిలో కూడా సంధ్యా సమయమే. ఈ సంధ్యా సమయం లో ధ్యాన స్థితిలో ఉండ గలిగితే వానికి ఆధ్యాత్మిక పురోగతి అత్యంత త్వరితం గా కలుగుతుంది. దీనిని సూచిస్తూనే మన పెద్ద వాళ్ళు నిదానం గా నిద్ర లెమ్మని, మెలకువ తెచ్చుకొమ్మని చెబుతారు. అలాగే, నిద్రలో ఉన్న మనిషిని అకస్మాత్తుగా లేప కూడదని కూడా చెబుతారు.
నిద్ర పోయే ముందు జపం ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకోవడం ఒక మంచి అభ్యాసం. దీనివల్ల చెడు కలలు రాక పోవటమే కాక నిద్ర లేచే వరకూ అంతచ్చేతనలో మంత్ర జపం లేదా ధ్యాన స్థితి అలా కోన సాగుతూ ఉంటుంది. నిద్ర మెలకువ వచ్చేటపుడు కూడా మంత్ర జపం లేదా ధ్యాన స్థితి తోనే దానంతట అది మెలకువ వస్తుంది. దీనివల్ల మనస్సు అత్యంత త్వరితంగా శుద్దత్వాన్ని సంతరించు కుంటుంది. అయితే దీనిలో ఒక ప్రమాదం ఉంది. జపం మొదలు పెట్ట గానే నిద్ర ముంచుకొచ్చే అలవాటు కాకుండా సాధకుడు జాగ్రత్త పడాలి.
ఇప్పుడు నేను చెప్ప బోయే స్థితి కోటికి ఒకరికి కూడా అనుభవం లో ఉండదు. ఇది ఇంకా లోతైన సంధ్యా సమయం. కలలు కనే స్థితి నుంచి గాఢ నిద్రలోకి జారుకునే సమయంలో కూడా ఒక సంధ్యా స్థితి ఉంటుంది. తిరిగి గాఢ నిద్ర నుంచి కలలు కనే భూమిక లోకి వచ్చే స్థితిలో కూడా కొంత సేపు సంధ్యా సమయం ఉంటుంది. అయితే ఈ రెండూ స్తితులు యోగ సాధనలో లోతులు అందుకున్న వారికే అనుభవం లోకి వస్తాయి.
జన సామాన్యానికి ఇవి అందుబాటులో ఉండవు. గాఢ నిద్ర అనేది పూర్తిగా అరుదై పోయిన నేటి అస్త వ్యస్త సమాజంలో ఇవి ఊరకే బుద్ది పరం గా అర్థం చేసుకోవటానికి పనికొస్తాయి గాని అనుభవం లో అందవు. అందుకే ఈ స్తితి కోటి మందిలో ఒకరు మాత్రమె అందుకో గలరు అని ముందే చెప్పాను. అర్థ రాత్రి వరకూ చెత్త టీవీ సీరియల్లు చూసి, నిద్ర రాక,ఉత్త మామూలు నిద్ర కోసం తన్నుకులాడి, నిద్ర మాత్రల సాయం తో ఎప్పుడో అర్థ రాత్రి దాటిన తరువాత కలత నిద్ర లోకి జారుకునే నేటి మనుషులకి ఇవి చెప్పినా అర్థం కావు.
దీనిలో ఇంకొంత లోతులు చూద్దాం. ఒక ఆలోచన ఆగి మరొక ఆలోచన మొదలయ్యే మధ్యలో కూడా సంధ్యా సమయం ఉంటుంది. ఈ విరామం తెలియాలంటే ఆలోచనలు గమనించే సామర్ధ్యం ఉండాలి. ఇది సామాన్యంగా అందరికీ ఉండదు. ఏ ఆలోచన వస్తే దానిలో పడి కొట్టుకు పోవడమే గాని వాటిని సాక్షి గా గమనించే సామర్ధ్యం సామాన్యంగా ఉండదు. ఇట్టి సామర్ధ్యం ఏళ్ళ తరబడి చేసిన ధ్యాన సాధన ద్వారానే వస్తుంది.
ఇట్టి ప్రజ్ఞా కలిగిన వాడు ఆలోచనకూ ఆలోచనకూ మధ్యన ఉన్న శూన్యమైన స్థితిని పట్టుకో గలుగుతాడు. ఆ శూన్య స్థితిలో ఎల్లప్పుడూ ఉండటం అలవాటు అయితే ఆలోచనా రహిత స్థితి అందుకుంటాడు. ఈ ఆలోచనా రహిత స్థితి సమాధి స్థితికి అతి దగ్గరగా ఉంటుంది. ఇంకొక్క అడుగు ముందుకు వెయ్య గలిగితే సమాధి స్థితిని అందుకో వచ్చు. కాని ఆ ఒక్క అడుగు వెయ్యడానికి బ్రహ్మ ప్రళయం అవుతుంది. అనేక సార్లు ఈ ఒక్క అడుగు వెయ్యటానికి అనేక జన్మల సమయం పడుతుంది. ఇది అత్యంత రహస్య విజ్ఞానం మరియు వ్యక్తిగతంగా అత్యంత సమర్థుడైన శిష్యునికి వివరించ వలసిన విషయం కనుక ఇంతకూ మించి వ్రాయలేను.
ఆలోచనా రహిత స్తితి అందుకుంటే ప్రక్రుతి లోని రహస్య ద్వారాలు తెరుచు కుంటాయి. అంతకు ముందు కనిపించని అనేక వింతలు కనిపిస్తాయి. ఈ లోకానికి చెందని సూక్ష్మ ధ్వనులు వినపడ తాయి. అప్పుడు వినపడే కొన్ని ధ్వనులను ఈ లోకం లోని ఏ సంగీత వాయిద్యమూ సృష్టించ లేదు. అవి అంతటి విభిన్నంగా మధురం గా ఉంటాయి. అనేక రంగుల వలయాకారాలు, కాంతి ఒక ఫౌంటెన్ వలె విరజిమ్మ బడటం వంటి అనేక దృశ్యాలు కనిపిస్తాయి.
ఇట్టి స్తితిని అందుకో గలిగితే ప్రక్రుతి లో ప్రతిదీ జీవం తో తోనికిస లాడుతూ దర్శనం ఇస్తుంది. చెట్లతో మాట్లాడ వచ్చు. రాళ్ళను పలుకరించ వచ్చు. గాలి ఆత్మీయ స్పర్శను అందుకోవచ్చు. నీటి గలగలలలో సూక్ష్మ లోక వాసుల మాటలను ఆలకించ వచ్చు. ఇంతెందుకు. సాక్షాతూ దైవ స్పర్శను ప్రతి దానిలోనూ అడుగడుగునా తిలకించ వచ్చు. అప్పుడు మామూలు మనుషులకు అగమ్య మైన ఒక కొత్త లోకం ఈ లోకంలోనే మనకు దర్శనం ఇస్తుంది. కాని లోకానికి ఒక పిచ్చివాని వలె కనిపిస్తాము. మహనీయులైన సిద్దులందరూ ఇట్టి స్థితిలో ఉన్నపుడు లోకం దృష్టిలో పిచ్చివారుగా చూడ బడిన వారే.
సంధ్యో పాసన అనేది సరిగ్గా చేస్తే ఇంతటి ఔన్నత్యాన్ని మానవునికి ఇవ్వగలదు. కాని దీన్ని బోధించేవారు, దారి చూపించేవారు కరువు అయ్యారు. ఒకవేళ అటువంటి వారు ఉన్నా కూడా ఆచరించే వారు అరుదయ్యారు. సంపదను ఉంచుకొని కూడా అది మరిచిపోయి బికారి గా బతుకుతున్న అభాగ్యుని వలె మన పరిస్తితి నేడు ఉన్నది ఆంటే అతిశయోక్తి కానేరదు. కొన్నాళ్ళు పోయాక ఏ అమెరికా వాడో వచ్చి నాయనలారా మీ ప్రాచీన వేద-తంత్ర విజ్ఞానం లో ఇంత మహత్తరమైన విషయాలు ఉన్నాయి. తెలుసుకొని ఆచరించండిరా అని చెబితే వాళ్ళను కూడా పిచ్చివాళ్ళ కింద జమ కట్టి నవ్వుతామేమో. అలా ఉంది మన హీన స్తితి.
మనం నిర్లక్ష్యం చేస్తున్న సంధ్యా వందనం అనే ప్రక్రియలో ఇంతటి గూఢమైన అర్థాలు ఉన్నాయి.సంధ్యా రహస్యం ఇంకా చాలా ఉన్నది. వ్రాస్తూ పొతే ఇదే కొన్ని అధ్యాయాలు గల ఒక పుస్తకం అవుతుంది. ప్రస్తుతానికి చాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి