1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

అసలైన సమస్య



సమస్యలు లేని మనిషి ఉండడు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది . కానీ కొంచం లోతుగా ఆలోచిస్తే అన్ని
సమస్యలూ ఒక్క చోటికే చేరుతాయి. అదే అనుభవాల స్థిరీకరణ.

ఎ అనుభవమూ శాశ్వతం కాదు. అన్ని అనుభవాలూ క్షణికములే. ఆకలి తీరటం వంటి అతి ప్రాధమిక అవసరం నుంచి
హృదయాన్ని స్పృశించి అంతరించే సున్నితమైన అనుభవం వరకూ ప్రతిదీ అలా కాల గర్భంలో కలిసిపోక తప్పదు. అదీ ప్రకృతి సహజం. ఏ అనుభవమూ స్థిరం గా నిలవదు. నిలిస్తే మనిషి భరించలేడు. అది అంతరించినా మనిషి తట్టుకోలేడు. ప్రకృతిలో మనిషి భాగం. కాని మనిషి ప్రకృతిని ఒప్పుకునే స్థితిలో లేడు. అతనికి అనుభవాలు స్థిరం గా కావాలి. మళ్ళీ మళ్ళీ అవే అనుభవాలు మనిషి కోరుకుంటాడు.

ప్రకృతిలో స్థిరత్వం లేదు. ప్రకృతిలో భాగాలైన ఇంద్రియాలు స్థిరమైన అనుభవాలను ఇవ్వలేవు. కాని మనిషి
శాశ్వతమైన అనుభవాలను కోరుకుంటాడు. అదే మనిషి చేస్తున్న తప్పు. లేని స్థిరత్వాన్ని లేని చోట కోరటమే మనిషికి గల అసలైన సమస్య.

స్థిరమైన శాశ్వతమైన స్థితి ఆత్మ లోనే ఉంది. స్థిరమైన అనుభవం ఆత్మానుభావమే. కాని ఆ అనుభవాన్ని అశాశ్వతమైన
ఇంద్రియాల పరిధిలో మానవుడు వెతుకుతున్నాడు. ఆశిస్తున్నాడు. ఇది ప్రాధమికంగా అసంభవం అయిన విషయం. కాని ఈ అసంభవమైన శాశ్వత ఆనందాన్ని మానవుడు అది లేని చోట వెతుకుతూ బ్రతుకుతున్నాడు. ఈ వెతుకులాటలో జన్మలు గడుస్తున్నాయి. ప్రాధమికంగా అతని ఆశ తప్పు కాదు, కాని దాన్ని వెదికే ప్రదేశం, విధానములే తప్పు.

బుద్ధుడు ఇంకొక అడుగు ముందుకు వేశి, అసలు ఆశించటమే పెద్ద పొరపాటు అన్నాడు. ఈ ఆశించ టాన్నే ఆయన తృష్ణ
అని పిలిచాడు. అంటే దాహం అని అర్థం చేసుకోవచ్చు. అనుభవాల వెంట పరుగెత్త టమే తృష్ణ. దానికి ముగింపు పలకటమే నిర్వాణం. మనిషి యొక్క అర్థం లేని వెదుకు లాటకు అంతమే నిర్వాణం.

ఈ నిర్వాణాన్ని మనిషి చేరుకుంటే మానవుణ్ణి పీడిస్తున్న అసలైన సమస్యకు అతడు పరిష్కారం కనుగొన గలుగుతాడు. తృష్ణా క్షయం అయిన వాడు దేని వెంటా పరుగేత్తడు. అతని ప్రయాణం ముగుస్తుంది. అంగుళి మాలుడు బుద్ధుని
చంపాలని కత్తి తీసుకొని ఆయన వెంట పరిగెత్తాడు. కాని మెల్లిగా నడుస్తున్న బుద్దున్ని అతడు చేరుకోలేకపోయాడు. నీ పరుగు ఆపు అని అతడు అరుస్తాడు. దానికి బుద్ధుడు నవ్వుతూ " నా పరుగు ఎప్పుడో ఆగి పోయింది. నువ్వే ఇంకా పరిగెడు తున్నావు. ఆప వలసినది నీ పరుగు." అంటాడు. అంగులిమాలుడు భౌతిక మైన పరుగును దృష్టిలో పెట్టుకొని అడిగాడు. బుద్ధుడు జన్మ జన్మల నుంచి జీవుడు పెడుతున్న పరుగు గురించి చెప్పాడు.

తృష్ణ అనే పరుగును ఆపగలిగితే మనిషి తనను పీడిస్తున్న అసలైన సమస్యకు పరిష్కారం కనుగొన గలుగుతాడు. అతడి జన్మ ధన్యత్వాన్ని పొంద గలుగు తుంది.

కామెంట్‌లు లేవు: