ఏమో...
ఒకోసారి...

ఒకోసారి...
...గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది
...ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది
...వెలుగు కన్నా చీకటే బాగుందనిపిస్తుంది
ఒకోసారి...
...పరిచయంలేని అపరిచితుల వద్దే మనసు విప్పాలనిపిస్తుంది
...సమాధానం కన్నా చిరునవ్వే చాలనిపిస్తుంది
...కళ్ళు మూసుకుని గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది
ఒకోసారి...
...కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది
...నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది
...మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది
ఒకోసారి...
...నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది
...వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది
...మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది...!!
మౌనం...

భావాలకు,భావ వ్యక్తీకరణకు అర్ధం మాటలే అని నమ్మాను కొన్నాళ్ళు...
కానీ మౌనంలో అన్నిటినీ మించిన అర్ధం ఉందని,
మౌనాన్ని మించిన ఆయుధం లేదన్నది అనుభవం నేర్పిన పాఠం!!
"silence ia a great art of conversation..."అన్నారు కూడా!
మౌనం గురించి నా అలోచనలు ఇవి...
అక్షరాలకు అంతం
ఆలొచనల సొంతం
అంతులేని ఆశల శబ్దం
పెదవి దాటని మాటలకర్ధం
అలసిన మనసుకు సాంతం...మౌనం!!
కన్నీట తడిసిన చెక్కిలి రూపం
అలుపెరుగని అలజడులకు అంతం
రౌద్రంలో మిగిలిన ఆఖరి అస్త్రం
యుధ్ధాల మిగిలిన శకలాల భాష్యం
నిశ్శబ్దంలో నిలిచే ఒంటరి నేస్తం....మౌనం!!
సుతిమెత్తని కౌగిలికి
ఆరాటం నిండిన పెదవులకి
మాటలు మిగలని అలకలకి
మాటలు కరువైన మనసులకి
అన్నింటి చివరా మిగిలేది....మౌనం!!
నేను-తాను...

నిన్నలొ ఉన్నది నేను
నేడులొ ఉన్నది తాను
తానెవరో తెలియదు నాకు
నేనెవరో తెలియదు తనకు
గడిచిపోయిన నిన్నలలో నిలిచిపోయిన నన్ను
పరిచయమే లేదంటూ పరిశీలిస్తుందా కన్ను
నువ్వెవరని ప్రశ్నిస్తూ నిలేస్తుంది నన్ను
ఆ శోధనలో నిరంతరం ముఖాముఖి మాకు
కలలలో నిదురలో కలతలో తానే నా తోడు
నేను లేని తానెవరని అచ్చెరువే నాకు
సంసార మధనమే నిరంతర ధ్యానం తనకు
తనతొ చెలిమికై ప్రయత్నమే ప్రతినిత్యం నాకు
నేనే నువ్వంటూ కవ్విస్తుంది నన్ను
నీ నేడే నేనంటూ తడుతుంది వెన్ను
ఒక్క క్షణం కళ్లలోకి సూటిగా చుసి
కనుపాపలో దాగిన రూపు తనదంటుంది
ఆ కొత్త రూపాన్ని నేనేనని నమ్మాలి
నాకై నా వెతుకులాటనికనైనా ఆపాలి
ఈ నిరంతర అన్వేషణకిక స్వస్తి పలకాలి
ఇదే నా అస్థిత్వమని మళ్ళి మళ్ళి నమ్మాలి !!
(నిరంతరం వివాహానంతరం ప్రతి స్త్రీలో జరిగే మధనమే ఇదని నా అభిప్రాయం...)
అంతర్మధనం...

మధనం...అంతర్మధనం....
వైరాగ్యం యదార్ధమైనప్పుడు జీవితాన్ని ఆస్వాదించేదెలా?
కర్తవ్యం నిర్దేశింపబడిఉన్నప్పుడు కోరికల్ని నశింపజేసేదెలా?
చేయూత ఉన్నా చుట్టూరా ఒంటరితనమే ప్రజ్వలిస్తూంటే
మౌనమే ఆధారమని మనసుకి నచ్చచేప్పేదెలా?
తడిఆరని కన్నులు చీకట్లని చూస్తూంటే వెలుగునకై వెతికేదెలా?
బాధ్యతల నడుమ ప్రాణం గిలగిలలాడుతూంటే స్వేచ్చగా అది ఎగిరేదెలా?
మనసంతా నువ్వైనా వేళ

ప్రణయమో
విరహమో
తాపమో
ఇది ఏమో నాకు తెలియదులే
మది నిండా పులకింతేలే
ఎదురు చూపులో
కలవరింతలో
మైమరపులో
తనువంతా కనులాయనులే
ఇది వింతైన అనుభూతేలే
రాగంలో
అనురాగంలో
హృదయనాదంలో
అన్నింటా ఉన్నది నీవేలే
నేనన్నది ఇక నీవేలే
మాటలో
పాటలో
ప్రతి పిలుపులో
వినిపించే నీ పిలుపేలే
నీ మాయే ఇదియని తెలిసెనులే
నీ గమనంలో
ఆ మవునంలో
ప్రతి కదలికలో
ఉన్నదంతా అనురాగమని
తెలుపకనే తెలిపినవి నీ కనులేలే !!
మనసులో మెదిలాయి ...

మనసులో మెదిలాయి ...
మనసులో మెదిలాయి ఆనాటి ఆశలు...
కలలు కన్నఆ కళ్లు
రాగం పలికిన ఆ స్వరం
రంగులు పరిచిన కుంచలు
రంగవల్లులు వేసిన వాకిళ్ళు
ఆట పాటల కేరింతలు
ఘుమఘుమల రుచులు
ఆత్మీయుల మన్ననలు
స్నేహితుల అభిమానాలు
పుస్తకాలకే పరిమితమైన పరిధులు ...
మనసులో మెదిలాయి ఏవో మధురానుభూతులు !!
ఆదర్శాలు ఆలోచనలు
నిర్ణయాలు వాటి నిమజ్జనాలు
ఆవేశాలు ఉద్వేగాలు
నిరాశలు వాటి నిట్టూర్పులు ...
మనసులో మెదిలాయి ఆ నిస్సహాయతలు !!
కలల నుంచి కాగితం పొరల్లోకి జారి
అక్షరం నుంచి ఆవిరైన ఆశలవైపు
జాలిగ చూసాయి కనుమరగైన సంకల్పాలు
నిలకడ లేని నిశ్చయాలను వెక్కిరించాయి
వివేచన చేయగల అంతరంగాలు
చేవలేని ఆక్రోశాలని చీత్కరించాయి
ఆలోచనల హ-హ కారాలు..
మనసులో మెదిలాయి నా పిరికితనపు కసరత్తులు...!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి