1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

29, జనవరి 2011, శనివారం

I am Selfish…. Do you know Why ?????


I may be failed in sparing time to my FAMILY

I may be failed to satisfy my boss in the OFFICE

I may be failed in regularly calling my RELATIVES

I may be failed in spending time with my beloved FRIENDS

I may be failed in look after my WELL-WISHERS

I may be failed in wishing EVERYONE, who is the reasons for my present status

I may be failed in satisfying my own NEEDS/WANTS

I may be failed as a complete MAN





AND I ONLY MAY BE PASSED IN


Spending time with UNLOVED, UNCARED, UNWANTED ones


Planning things for SERVING OTHERS 


 Dedicating my self for my Life Goal/Ambition….


At least, am I passed as a HUMAN ??????

May be not

That’s why I called my self as a SELFISH

28, జనవరి 2011, శుక్రవారం

ఇంత సుఖం ఎంత కష్టం?

ఇంత సుఖం ఎంత కష్టం?

-గాలి ఉదయ్‌కుమార్

ఒక ఇంట్లోనే నాలుగు మొబైల్ ఫోన్‌లు!


ఒక్కో ఫోన్‌లో డబుల్ సిమ్‌లు.

ఒక ఇంట్లోనే రెండు టెలివిజన్ సెట్లు.

ఒక ఇంట్లోనే డెస్క్ టాప్ కంప్యూటర్, లాప్‌టాప్‌లు. వాటికి రెండు మూడు ఇంటర్నెట్ కనెక్షన్లు.

రోడ్లు పట్టనంతగా పెరిగిపోతున్న వాహనాలు.

ఐపాడ్‌లు, ఐఫోన్‌లు, ఎంపీ4 ప్లేయర్లూ, కెమేరాలు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు- ఇళ్ల 

నిండా అత్యాధునిక పరికరాలు. ఒక్కో వస్తువు వందల రకాల బ్రాండ్ పేర్లతో దొరుకుతోంది. లక్షలాది వస్తువులు కోట్లాది బ్రాండ్‌లు. రోజురోజుకూ మార్కెట్లను ముంచెత్తుతున్న వందలాది కొత్త వస్తువులు. మన దేశంలో పెరిగిపోతోన్న వినిమయత్వానికి ఇవి నిదర్శనాలు...


ఆ కాలంలో ఏదైనా వస్తువుని కొంటే, అది పని చేయలేనిక మహాప్రభో అంటూ పదహారుసార్లు మూలనపడే వరకు వాడుతూనే ఉండేవాళ్లు. అది డబ్బులేనితనం కాదు. ఖర్చుపెట్టే డబ్బుకు తగిన విలువను రాబట్టాలనే ప్రయత్నం. పొదుపరితనం. కాని వస్తువుని దాని జీవితకాలంపాటు ఉపయోగించటమన్నది అతి పురాతనమైన అనాగరిక విషయమై పోయింది. వాడి పారేసే సంస్కృతి (యూజ్ అండ్ త్రో) మంచిదికాదని గోల పెడుతుండగానే, వాడుతూనే పారేసే సంస్కృతి ఊడలు వేసుకొంటోంది. వస్తువినిమయ వ్యామోహం వెర్రితలలేస్తోంది.

చేతిలో సెల్‌ఫోన్ చెవి పక్కన జోరీగ లాగ రొద పెడుతుండగానే, మరొక కొత్త మొబైల్ ఇన్‌స్ట్రుమెంట్ కోసం యువత పరుగుపెడుతోంది. మరేదో కొత్త ఫీచర్ వచ్చేసింది... పాతది అవతల పారేయటమే ఇక చేయదగిన పని. క్షణక్షణాలకీ మారిపోయే ఫ్యాషన్ ప్రపంచంలో దుస్తులనూ పూర్తికాలంపాటు ఎవరూ వాడటం లేదు. వెలిసిపోనవసరం లేదు. చిరుగు పడనవసరం లేదు. పొట్టిది కానవసరం లేదు. ప్రతి ఇంట్లోనూ రెండుమూడు ఉతుకులకే మూలనపడుతున్న దుస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఎంతవేగంగా వస్తువులను మార్చివేస్తే అంత గొప్ప. ఎన్ని ఎక్కువ వస్తువులను వాడితే అంత గొప్ప. ఎంత ఖరీదయినవి వాడుతున్నామనే దానినిబట్టి మనకు గౌరవం. ఎన్ని వస్తువులను ఎంత వేగంగా చెత్తగా అవతల పారేస్తున్నామనే దానినిబట్టి మనకు మర్యాద... విలువలు మారిపోతున్నాయి. వస్తువినిమయ వ్యామోహ సంస్కృతి ప్రబలుతోంది.

మార్కెట్‌ను వెల్లువలా ముంచెత్తుతున్న వస్తువులను స్వంతం చేసుకొనేందుకు చేతిలో డబ్బే ఉండనవసరం లేదు. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, 'ఇప్పుడే స్వంతం చేసుకో- తర్వాత చెల్లించు' వంటి పథకాలు వినియోగదారుల్ని ఆశపెడుతూనే ఉన్నాయి. కొనుగోలు శక్తితో సంబంధం లేకుండానే అపరిమితంగా వస్తువులను ఇంటికి తెచ్చేలా చేస్తున్నాయి. మార్కెట్ శక్తులు వినిమయ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి.

ఈ సుఖం ఎంత కష్టం?
మనిషికి అణుమాత్రం శారీరక శ్రమ లేకుండా ఎంత పనినయినా చిటికెలో చేసే ఉపకరణాలు. ఎంతో సుఖం. మరెంతో హాయి ఇస్తాయనే ఒక నమ్మకం. అయితే ఈ సుఖం ఎంత కష్టం? ఈ హాయినిచ్చే వస్తువుని స్వంతం చేసుకొనేందుకు జీవితంలో ఎంత కష్టపడాలి? పదివేల రూపాయలను సంపాదించే ఉద్యోగి ఒక ఫ్రిజ్ కొనాలనుకొందాం. నెలనెలా వేయి రూపాయలను పొదుపుచేయాలి. లేదూ ముందే వస్తువును తెచ్చి పెట్టుకొని ఆపై ఒక సంవత్సరంపాటు వాయిదాలను కట్టుకొంటూ పోవాలి. అలా అది ఒక సంవత్సరపు కష్టం. ఈ కష్టానికి తగిన విలువను ఫ్రిజ్ ద్వారా అతడు తిరిగి పొందగలుగుతాడా? అందరిలానే తానూ కొనగలిగాననే ఒక తృప్తిని మాత్రమే మిగుల్చుకొంటాడా?

చిన్నపాటి దూరాలకు సైతం వాహనాలను ఉపయోగించటం అలవాటుగా మారింది. నడక అవసరం తప్పిపోయింది. ఇడ్లీ పిండి, గారెల పిండి రుబ్బాలంటే రుబ్బురోలు అవసరం లేదు. మిక్సీలు, గ్రైండర్లు వచ్చేశాయి. శరీరం ఏమాత్రం అలసిపోదు. బట్టలు ఉతికేందుకు నీళ్లు తోడక్కరలేదు. వళ్లు హూనమయ్యేలా బండకేసి బాదనవసరం లేదు. వాషింగ్ మెషిన్‌లో వేస్తే చాలు. కేవలం స్విచ్ వేస్తే చాలు. అన్ని పనులూ వాటంతట అవే అయిపోతాయి. ఈ వస్తువులతో సుఖమూ, ఆనందమూ స్వంతం అవుతుందనే ఒక నమ్మకం.

కానీ జరుగుతోందేమిటి? శారీరక శ్రమ తగ్గి మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధులు క్యాన్సర్‌లా పెరిగిపోతున్నాయి. ఊబకాయం సమస్య కూడా మన దేశంలో పెరుగుతోంది. తినకూడనివే ఎక్కువగా తినటం, తగిన వ్యాయామం లేకపోవటం- ఈ రెండూ కలిసి ఊబకాయం పెరుగుతోంది. ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్యకు సరిసమానంగా ఊబకాయస్తుల సంఖ్య కూడా పోటీపడుతోంది. అభివృద్ధిచెందిన దేశాలు, ప్రపంచవ్యాప్తంగా సంపన్న వర్గాలకు చెందినవారే ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. ఏ ఆహారం తీసుకోవాలో ఎంపిక చేసుకొనే అవకాశం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, ఆ ఎంపికలను ఆహార పరిశ్రమ ప్రకటనల ద్వారా ప్రభావితం చేస్తూనే ఉంది. రోడ్డు సదుపాయం లేని మారుమూల గ్రామాల్లో సైతం ఉప్పు, పంచదార, కొవ్వు పదార్థాలతో కూడిన జంక్‌ఫుడ్ లేదా ఫాస్ట్ఫుడ్ చవుకగా దొరకటం, మారే జీవనశైలి- కారణాలేమైతేనేం అనారోగ్యాన్నీ మనం కొనేయగలుగుతున్నాం. ఇది వినిమయత్వపు మరోపార్శ్వం.


కొబ్బరి బోండాం- కూల్‌డ్రింకులు
మన కొనుగోలు విధానాల్లో వచ్చిన మార్పును అర్థంచేసుకొనేందుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అర్థంచేసుకోవలసిన అవసరం ఏమీ లేదు. చిన్న చిన్న విషయాలు చాలు.

మీరు కూల్‌డ్రింక్ తాగి ఎన్ని రోజులైంది? కొబ్బరి బోండాం తాగి ఎన్ని నెలలైంది? ఏ అనారోగ్యమో చేస్తే తప్ప తాగకూడని వస్తువుగా కొబ్బరి బోండాం ఎందుకు మిగిలిపోయింది?

ఏ పోషక విలువలూ లేని కూల్‌డ్రింకులు ఎందుకు ఎక్కువగా వాడేస్తున్నాం. అంతో ఇంతో మంచిచేసే కొబ్బరి బోండాలకు ఎందుకు దూరవౌతున్నాం?
కొబ్బరి బోండాన్ని వేరే దూరప్రాంతాల నుంచి రవాణా చేసుకోనవసరం లేదు. మన చుట్టుపక్కలే పండుతుంది. కొబ్బరి బోండాన్ని ఉత్పత్తి చేయటంలో ఏ విధమైన కాలుష్యాలు వెలువడవు. కొబ్బరి తోటలను పెంచటం వలన చుట్టుపక్కల వారికి ఇబ్బందులూ కలగవు. ఒక కొబ్బరి బోండాన్ని కొనటంవలన బడుగు రైతులకు కాస్తంత మేలు జరుగుతుంది. తాగితే శరీరానికి అంతో ఇంతో మేలే జరుగుతుంది.


కొబ్బరి బోండామూ కూల్‌డ్రింక్‌లకు కొనే సమయంలో మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి. తయారుచేయటానికి పైసలు మాత్రమే ఖర్చయే కూల్‌డ్రింక్‌ను కొనే సమయంలో 'అంతెందుకు? తగ్గించి ఇవ్వండి' అని ఏనాడూ బేరం చేయం. సినిమా హాళ్లు, బస్‌స్టాండ్‌ల వంటి చోట్ల అదనంగా మరో రెండుమూడు రూపాయలు తీసుకున్నా కిక్కురుమనం. ఇదే కొబ్బరి బోండాం విషయంలో మాత్రం 'అంతెందుకు, అయిదు రూపాయలకే ఇస్తే ఇవ్వు లేదంటే లేదు' అని ఖరాఖండిగా బేరంచేసి భయపెట్టి మరీ కొనే ప్రయత్నం చేస్తాం.

కూల్‌డ్రింక్‌లు బాట్లాంగ్ ప్లాంట్‌లను పెట్టిన ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకే ప్రాంతంనుంచి లక్షలాది లీటర్ల నీటిని ప్రతిరోజూ భూమినుంచి తోడేయటంవలన చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటిమట్టం నానాటికీ పడిపోతోంది. వ్యాపారమే లక్ష్యంగా ఏర్పాటయిన ప్లాంట్లు నీటికోసం ఎన్ని లక్షలనైనా ఖర్చుపెట్టి ఎంత లోతుకయినా బోర్లు తవ్వుకొంటూ పోగలవు. వాటికది ఒక సమస్య కానే కాదు. కానీ ఈ ప్లాంట్ల చుట్టుపక్కల ఉన్న రైతులు, గ్రామస్థులు మంచినీరు అందక సతమతమవుతారు. నీరు అత్యంత ఖరీదయిన అంశంగా మారుతుంది. ఇటువంటి సమస్యలతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఆందోళనలు చెలరేగటం కూడా మనం చూశాం. అనాలోచితంగా మనం తాగి పడేసే ఒక చిన్న బాటిల్ కొన్ని జీవితాలను అతలాకుతలం చేసేయగలదనేది నిజం. కనుకే వస్తు జీవిత చక్రపు విశే్లషణను దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం మనముందు ఉంది.

జీవిత చక్రపు విశే్లషణ
ఒక వస్తువు తయారీకి ఏ పదార్థాలను ముడి సరుకుగా వాడుతున్నారు? తయారీలో పాటిస్తున్న విధానాలేమిటి? ఆ వస్తువు మనవద్దకు ఎంత దూరంనుంచి వస్తోంది? వస్తువును వాడేటపుడు అవసరమయ్యే వనరులు ఏమిటి? వాడిన తర్వాత వస్తువును పారేస్తే, అది పర్యావరణంమీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? వస్తువు జీవిత చక్రంలోని పలు అంశాల గురించి మనం ఆలోచించాలి.

ఇందుకు ఉదాహరణలుగా ఎన్నింటినో చెప్పవచ్చు. మన సంస్కృతీ సాంప్రదాయాల్లో వాడి పారేసే వస్తువినిమయ విధానాలకు ప్రాధాన్యత చాలా తక్కువ. చుట్టుపక్కల ప్రతృతిలో సహజంగా దొరికే వాటితోనే అవసరాలను తీర్చుకోవటం ఆనాటి అలవాటు. తలంటు పోసుకోవాలంటే కుంకుళ్లు, షీకాకాయ; స్నానం చేయాలంటే పప్పు ధాన్యాలతో చేసిన సున్నిపిండి, ఇల్లు శుభ్రం చేయాలంటే ఇంట్లోనే పెరిగిన కొబ్బరిచెట్టు ఈనెలతో చేసిన చీపుర్లు, దంతాలు శుభ్రం చేయాలంటే వేప పుల్ల, పంట పొలాలకు ఎరువుకావాలంటే పశువుల వ్యర్థాలు- ఇలా వేటినీ కొనుగోలు చేయనవసరం లేదు. ఎక్కడినుంచో తెచ్చుకోనవసరం లేదు. మన ఇంట్లోనే, మన చుట్టుపక్కలే సహజంగా దొరికే వాటితోనే అవసరాలు తీరిపోయేవి. వాడిన తర్వాత వాటిని ఎక్కడ పారేయాలనే సమస్య కూడా ఉండేదికాదు. అవి సహజంగానే మట్టిలో కలిసిపోయి ఏ ఇబ్బందీ కలిగించేవి కాదు. ఇపుడు వాడే టూత్‌పేస్టులు, సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్‌ల వాడకంతో ఎన్నో సమస్యలు ముడిపడి ఉంటున్నాయి. వీటి ఉత్పత్తికి పెద్దపెద్ద ఫ్యాక్టరీలు - వాటినుంచి వచ్చే కాలుష్యాలు; తయారయిన వాటిని ఊరూరూ చేర్చేందుకు రవాణా వాహనాలు, వాటినుంచి వచ్చే కాలుష్యాలు, ఆ వాహనాలు వాడే ఇంధనాలు- తిరిగి పర్యావరణంపై దుప్ప్రభావం; మనం వాటిని వాడుతున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్, వాడిన తర్వాత రసాయనాలు నీళ్లతోకలిసి నీళ్లు కలుషితమవుతున్నాయి. ఎరువులు, క్రిమిసంహారిణులూ ఆహార ధాన్యాలతో చేరి మన శరీరంలో భాగమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పురావాలంటే, తిరిగి మనం మన పాత పద్ధతుల గురించి ఆలోచించాలి. ప్రకృతిని జయించటం గురించికాక ప్రకృతితో కలిసి జీవించే విధానాల గురించి ఆలోచించాలి. ఆచరణలో వాటిని పాటించాలి.

బాటిల్డ్ వాటర్
ప్రయాణంలో మరచెంబులో నీళ్లు పట్టుకుపోవటం మన సంస్కృతిలో ఒక భాగంగా ఉండేది. రైతులు పొలాలకు నీళ్లతో నింపిన తాబేటి కాయలను తీసుకుపోయేవారు. ఆరోజులు ఇక రావు. ఇపుడంతా బాటిల్డ్ వాటరే. లీటరు పాలు 26రూపాయలకు దొరికే దేశంలో నీళ్లను 13, 14 రూపాయలకు కొంటున్నారు. నీళ్ల బాటిళ్లను ఇంత ఖరీదుపెట్టి కొనటానికి కారణం ఏమిటి? నేరుగా దొరికే నీటి నాణ్యతమీద నమ్మకం లేకపోవటమా? ఆరోగ్యం గురించిన శ్రద్ధ ఎక్కువ కావటమా? లేని అవసరాన్ని సృష్టించగలగటం మార్కెట్ మాయాజాలంలో ముఖ్యమైన అంశం. లీటర్ల లెక్కన సీసాల్లో కోట్లాది లీటర్ల నీళ్లను కొనుగోలు చేయటం జరుగుతుందని ఒకనాడు మనమెవరమూ ఊహించలేదు. అటువంటిది ఇపుడు తిరుగులేని వాస్తవమై కూర్చుంది. కొందరికే పరిమితమైన 'విలాసం' అందరి అవసరంగా మారింది. 2004నాటికి 'బాటిల్డ్ వాటర్' వినియోగం ప్రపంచవ్యాప్తంగా 154 బిలియన్ లీటర్లకు చేరింది. అంతకు అయిదు సంవత్సరాలకు ముందు ఇది 98 బిలియన్ లీటర్లు ఉండేది. సురక్షితమైన కుళాయి నీరు లభిస్తున్న ప్రాంతాల్లోకూడా 'బాటిల్డ్ వాటర్' వినియోగం పెరగటం ఆశ్చర్యకరం.


బాటిళ్లలో అమ్మే నీటిని సంయుక్త రాష్ట్రాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. 2004లో అమెరికన్లు 26 బిలియన్ లీటర్ల నీటిని కొనుగోలు చేశారు. ఇక ఆ తర్వాత స్థానంలో 18 బిలియన్ల లీటర్లతో మెక్సికో ఉంది. చైనా, బ్రెజిల్‌లలో 12 బిలియన్ల లీటర్లను విక్రయిస్తున్నారు. 10 బిలియన్ల లీటర్ల వినియోగంతో అయిదు, ఆరు స్థానాల్లో ఇటలీ, జర్మనీ ఉన్నాయి. మామూలు నీటికంటే 10000 రెట్లు ఎక్కువ ధరతో బాటిళ్లలో నీటిని కొంటున్నాం. కొన్ని దేశాల్లో లీటరు బాటిల్ నీటిని 2.5 డాలర్లకు విక్రయిస్తున్నారు. అంటే, పెట్రోలు కంటే ఎక్కువ ధరకు!

బాటిళ్లలో అమ్ముతున్న నీరు మామూలు కుళాయి నీటికంటే సురక్షితం కాదని పారిశ్రామిక దేశాల్లో చేపట్టిన అధ్యయనాలు వెల్లడించాయి. నీళ్ల బాటిళ్లకోసం సాధారణంగా పాలిఇథిలేన్ టెరెప్థలేట్ (పెట్)ను వాడుతున్నారు. అమెరికన్ల డిమాండ్‌కు అనుగుణంగా నీళ్లసీసాలను ఉత్పత్తిచేసి పంపిణీ చేసేందుకు సంవత్సరానికి 1.5 మిలియన్ల బ్యారెళ్ల ఆయిల్ అవసరం అవుతుంది. ఇది లక్ష యుఎస్ కార్లకు సంవత్సరానికి సరిపడా ఇంధనం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2.7 మిలియన్ల టన్నుల ప్లాస్టిక్‌ను నీళ్లసీసాల తయారీకి వాడుతున్నారు.

జనాభా పెరుగుదలా? లేక వనరుల అసమ పంపకమా?

ప్రపంచంలోని ప్రతి సమస్యకూ మూలాలు జనాభా పెరుగుదలతో ముడిపడి ఉన్నాయని మనమంతా నమ్ముతున్నాం. కాని జనాభా పెరుగుదల మాత్రమే సమస్యకాదనే వాదం కూడా ఇటీవల బలంగా వినవస్తోంది.

గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్ లెక్కల ప్రకారం ఒక్కొక్క ప్రపంచ పౌరుడి అవసరాలను తీర్చేందుకు సగటున 2.2 హెక్టార్ల భూమి అవసరం. దీని ప్రకారం జనాభా ఎక్కువ ఉన్న దేశాలదే తప్పంతా అవుతుందనుకొంటే పొరపాటే. వినియోగం విషయంలో దేశాలమధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఉత్తర అమెరికాలో పౌరుడికి సగటున 9.4 హెక్టార్లు అవసరమైతే, యూరప్‌లో సగటున 4.8 హెక్టార్లు అవసరం అవుతోంది. అదే ఆఫ్రికాలో 1.1 హెక్టార్లు, భారతదేశంలో కేవలం 0.8 హెక్టార్లు మాత్రమే అవసరం అవుతోంది. అంటే, మొత్తం జనాభాలో ఇరవై శాతం ఉన్న సంపన్న దేశాల ప్రజలు మొత్తం వనరుల్లో ఎనభై శాతాన్ని ఉపయోగించుకొంటుంటే, మిగిలిన ఎనభై శాతం అభివృద్ధిచెందుతున్న దేశాల ప్రజలు ఇరవై శాతం వనరులను ఉపయోగించుకొంటున్నారనేది ఒక అంచనా. ఈ పోలిక దేశాలకేకాక, ఒకే దేశంలోని సంపన్నులు, పేదలకు కూడా వర్తిసుంది. సహజ వనరులపై వత్తిడి పెరగటానికి కారణం జనాభా పెరుగుదలా లేక వనరుల అసమ పంపకమూ, వినియోగమూనా అనేది మనం ఆలోచించవలసిన విషయం. మొత్తం ప్రజానీకంలోకెల్లా అత్యంత ధనికులయిన ఈ 20శాతం మంది మొత్తం మాంసం, చేపలలో 45 శాతాన్ని వినియోగిస్తున్నారు. ఆదాయం స్కేలు చివరి అంచున ఉన్న 20 శాతం మంది కేవలం 5శాతం భాగాన్ని మాత్రమే తింటున్నారు. మిగిలిన 60శాతం మంది 50 శాతాన్ని వినియోగిస్తున్నారు. శక్తి వినియోగంలో ధనికుల వాటా 58 శాతం కాగా అతి పేదవారి వాటా 4 శాతం మాత్రమే ఉంటోంది. ధనికులు కలిగి ఉన్న టెలిఫోన్ లైన్‌ల శాతం 74కాగా పేదల వాటా 1.5 శాతం ధనికులు ప్రపంచ వాహనాలలో 87 శాతానికి స్వంతదారులుగా ఉన్నారు. వాహనాలను కలిగి ఉన్న పేదల సంఖ్య కేవలం 1 శాతం. ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అవుతున్న కాగితంలో ధనికులు 84 శాతాన్ని వాడుతుండగా పేదలు కేవలం 1.1 శాతం కాగితాన్ని మాత్రమే వాడుతున్నారు.

ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 225 మంది వ్యక్తుల సంపద ప్రపంచ జనాభాలో తక్కువ ఆదాయం ఉన్న మొత్తం 47 శాతం మంది. అంటే, 250కోట్ల మంది వార్షిక ఆదాయంకంటే ఎక్కువ. ప్రపంచంలోని రెండు బిలియన్ల జనానికి ఇంకా ఎక్కువ కావాలి... కేవలం బతికేందుకు...! కేవలం బతికేందుకు... ప్రాణాన్ని నిలుపుకొనేందుకు.


2000-2002 నాటికి ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య 852 మిలియన్లు. దీనిలో 815 మిలియన్లు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటే పారిశ్రామిక దేశాల్లో 9 మిలియన్లు ఉన్నారు. ఇక మిగిలిన 28 మిలియన్ల మంది మార్పుచెందుతున్న (ట్రాన్సిషన్) దేశాలలో ఉన్నారు.
వనరుల అసమ పంపకం విషయం ఇలా ఉంటే, మొత్తంమీద చూసినపుడు గత 50 సంవత్సరాల కాలంలో తీవ్రంగా పెరిగిన వస్తువినిమయం పర్యావరణంపై అత్యంత తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతోంది.

* * *
ప్రపంచ ప్రజలంతా అమెరికన్లలానే వనరులను వాడితే మరో 4 భూగ్రహాలు కూడా సరిపోవు.
* * *
పరిశ్రమలు, వాహనాలు, వ్యవసాయం, గృహ వినియోగం- రంగం ఏదయినా, వాటి పెరుగుదల ప్రజల వ్యక్తిగత వినియోగ విధానాలతో ముడిపడి ఉంటుంది. వీటిలో అభివృద్ధికి సరిసమానంగానే వెలువడే కాలుష్యాలు కూడా ఉంటాయి. శిలాజ ఇంధనాలువలన కార్బన్ డై ఆక్సయిడ్ వాతావరణంలోకి విడుదలకావటం గత 40 సంవత్సరాల్లో రెట్టింపు అయింది. ఈ కాలుష్యంలో ముఖ్య భాగం అభివృద్ధిచెందిన దేశాలదే. ప్రపంచంలో అత్యధికంగా శక్తిని వినియోగించుకొనే అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచి మొత్తం కార్బన్ డై ఆక్సైడ్‌లో 22.5 శాతం వస్తోంది. ఇది ఇండియా, చైనా వంటి దేశాలతో సహా 78 పేద దేశాలు విడుదలచేసే కార్బన్ డై ఆక్సయిడ్‌కు సమానం.

తింటానికి దొరకదు కొందరికి- తిన్నది అరగదు మరికొందరికి!!

ప్రపంచంలో 800 మిలియన్ల జనం పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వాళ్లకు కడుపునిండా అన్నమే దొరకటం లేదు. పెరుగుతున్న ప్రపంచ జనాభా అవసరాలకు తగినంత ఈ భూమి పండించలేకపోతోందని ఎక్కువమంది అంటున్నారు.

సంపన్న సమాజాలలో ఆహారాన్ని అనవసరంగా పారేయటం మామూలుగా జరిగిపోతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 30నుంచి 40 శాతం ఆహారం చెత్తకుప్పలకు చేరుతుంది. పండిన ఆహారంలో 40 శాతం 50 శాతాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తినకుండానే పారేస్తున్నారు. ఇది కేవలం వాళ్లు తమ డబ్బును వృధాచేసుకోవటమే అయితే, దానిని కేవలం ఒక వ్యక్తిగత విషయంగా తీసెయవచ్చు. కానీ దీని పరిణామాలు పర్యావరణం మీద ఉంటున్నాయి.

పర్యావరణం మీద ప్రభావాలు
- ఆహార ధాన్యాలను పండించేందుకు ఎరువులు, క్రిమి సంహారకాల వంటి రసాయనాలను ఉపయోగించటం.
- పండిన పంటను రవాణాచేసేందుకు ఇంధనం వాడటం.
- వృధాగా పారేసిన ఆహారం కుళ్లి, దానినుంచి వాతావరణం మార్పులకు కారణంగా నిలిచే మిథేన్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులు ఎక్కువ మొత్తాల్లో విడుదల కావటం. ఆహార వ్యర్థాలను తగ్గించి, పేదరికాన్ని తగ్గించటం సాధ్యమేనా? సాధ్యమే. కానీ ఇది వ్యక్తిగతంగా మనం మారటం ద్వారానే సాధ్యం.
ఫాక్టర్ 4 ..... ఫాక్టర్ 10

ఇపుడు మనం బతుకుతున్నదానికి రెండు రెట్లు ఎక్కువ సుఖంగా బ్రతకగలగాలి. కానీ ఇపుడు వాడుతున్న వనరులలో సగంకంటే తక్కువ వనరులను మాత్రమే వాడాలి. 2050నాటికి పారిశ్రామిక దేశాలలో వనరులు ఉత్పాదకతను పది రెట్లకు పెంచేందుకు కృషిచేయాలి. ప్రతి ఒక్కరికీ వనరులు సమంగా అందుబాటులో ఉండాలంటే, ఉత్పత్తి వినియోగ విధానాలు సమర్థవంతమైనవి కావాలి.

పరిష్కార మార్గాలేమిటి?
- కొనే ముందు ఆలోచిద్దాం. కొత్త వస్తువు ఇంటికి వచ్చిందంటే అందరికీ ఆనందమే. కొత్త కార్లు, కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాలు- ఈ జాబితాకు అంతం ఏముంది? ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు పూర్తిగా విషాదమే నిండి ఉంది. ప్రాణాంతక కలుషిత వాయువులు, విషపూరిత వ్యర్థాల కుప్పలు, రసాయనాలతో నిండిన భూగర్భ జలాలు- ఇవన్నీ కూడా అనాలోచితంగా మనం ఉపయోగించే అనేకానేక వస్తువులవలన కలిగే అనర్థాలే. కనుక కొనే వస్తువుల గురించి, వాడే వస్తువుల గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం.


- తగ్గించి వాడదాం, తిరిగి వాడదాం, పనికిరాని పాత వాటితో కొత్త వస్తువులు చేద్దాం. అవసరం లేని వస్తువులను కొనటం మానేద్దాం. పాత వస్తువులను తిరిగి వాడదాం. ఇంట్లో ఉపయోగంలేకుండా పడివున్న వస్తువులతో కొత్త వస్తువులను తయారుచేద్దాం లేదా అలా చేసేవారికి ఇద్దాం. మనకు అవసరం లేని వస్తువులను ఇతరులకు ఉచితంగా ఇచ్చేద్దాం. షాపింగ్ చేసే ముందు ఏయే వస్తువులు అవసరమో, జాబితా తయారుచేసుకొని దానికే పరిమితం అవుదాం.

- ఆకర్షణీయమైన ప్రకటనల వెనుక దాగిన నిజాలేమిటో విశే్లషించుదాం.
- పనిచేసే కార్యాలయానికి దగ్గరలో నివాసం ఉందాం. ప్రయాణ దూరాలను తగ్గిద్దాం.
- స్థానికంగా పండిన వాటినే తిందాం. నిల్వ ఉంచిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉందాం.

ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావటం ద్వారా దీర్ఘకాలంలో ఒక మంచి మార్పు సాధ్యమనే నమ్మకంతో కొన్ని సంస్థలు చిన్నపాటి చర్యలకు శ్రీకారం చుట్టాయి. పర్యావరణంపై దుష్ప్రభావం చూపే కొన్ని రకాల వస్తువులను పూర్తిగా బహిష్కరించటం, వాటిలో ఒకటి ఒక వారంపాటు కొనుగోళ్లకు దూరంగా ఉండటం (నో షాపింగ్ వీక్) వంటి వాటి ద్వారా అవసరాలేవో, విలాసాలేవో గుర్తించే ప్రయత్నం చేయటం జరుగుతోంది.'సే నో టు టెలివిజన్'వంటివి కూడా వస్తు వినిమయ వ్యామోసాన్ని దూరంచేసే ప్రయత్నాలుగానే భావించవచ్చు. ఒక రోజుపాటు అసలు టెలివిజన్‌ను ఆన్ చేయకుండా కూర్చోండి. ఇంట్లో వాళ్లతో పిచ్చాపాటీ మాట్లాడండి. పక్క ఇంటి వారితో మాట్లాడండి. ఇంటికి వచ్చే కూరగాయలు, పాల వాళ్లతో మాట్లాడండి. ఎంత సమయం మిగిలిపోతుందో గమనించండి.
ఒక రెండు తరాలముందు మీ తాతయ్యలు, అమ్మమ్మలు ఏ విధంగా జీవించారో అదే విధంగా కనీసం ఒక రెండురోజులపాటు గడిపేందుకు ప్రయత్నం చేయండి.
ఒకరోజు పూర్తిగా విద్యుత్తును ఉపయోగించకండి. నీళ్లు మోటార్ నుంచి కాక పంపునుంచో, బావినుంచో తోడి తెచ్చుకొనే ప్రయత్నం చేయండి. ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఐరన్ బాక్స్‌లు వాడకండి. కంప్యూటర్‌ను ఆన్ చేయకండి. సెల్ ఫోన్‌ను దూరంగా ఉంచండి. కార్డు ముక్క తీసుకొని మీ బంధువులకో, స్నేహితులకో ఉత్తరం వ్రాసి పోస్ట్ చేయండి.

మన వినియోగం ఇలానే కొనసాగితే, రేపు ఏదో ఒకనాడు వనరులన్నీ కనుమరుగు కాక తప్పదు. అప్పుడూ ఎలా జీవించాలనే దానికి ఇది ఒక దారి చూపుతుంది.


ఇక చివరిగా మనం అందరం చేయవలసింది- ఉన్న వాటితో సంతృప్తి చెందటం! పొగ గొట్టాల ఫ్యాక్టరీలలో తయారయ్యే వస్తువుల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకొందాం. మనం ఉత్పత్తి చేయలేని, మన స్వంతం చేసుకోలేని గాలీ, నీరూ, పిట్టలూ, చెట్ల పట్ల ప్రేమను పెంచుకొందాం. అవే మన ఉనికికీ, ఆనందానికీ ఆధారం. వాటిని కాపాడుకొందాం.

ప్రాధాన్యతలు మారాలి...!
మన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? వ్యక్తులు కానీ, దేశం కానీ ఎందుకోసం ఎంత మొత్తాన్ని ఖర్చుచేస్తున్నదనే దానినిబట్టి, దీర్ఘకాలంలో సాధ్యమయ్యే అభివృద్ధిని అంచనావేయవచ్చు.

మనం తాగే కూల్ డ్రింక్‌లు, తినే ఐస్‌క్రీమ్‌లు, తాగే వాటర్ బాటిళ్లూ, వాడే కాస్మోటిక్‌లు- ఇలా వ్యక్తిగత జీవితంలో మనం ఉపయోగించే చిన్న చిన్న వస్తువులు, వాటిమీద ఖర్చుచేసే చిన్న మొత్తాలను పొదుపుచేయగలిగితే మనం ప్రపంచానే్న మార్చివేయవచ్చు. ఉదాహరణకు సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాలనే తీసుకొందాం. వీటి సాధనకు ఎంతో పెద్ద మొత్తంలో నిధులు కావాలి. అన్ని నిధులను మనం సమీకరించటం సాధ్యమేనా? అని ముందుగా అనిపిస్తుంది. కానీ మన ప్రాధాన్యతలు, ముఖ్యంగా మన దృక్పథం మారితే అన్నీ సాధ్యమే! వస్తువినిమయ సంస్కృతిని దూరం చేసుకోగలిగితే, ఏ సమస్యలూ లేని ఒక నవ సమాజం మన ముందు సాక్షాత్కరిస్తుంది

27, జనవరి 2011, గురువారం

కూర్చోవడమూ కళే!

-కూర్చుంటే రెస్ట్ తీసుకున్నట్లే కదా అనుకోకండి. నిలబడినప్పటి కంటే కూర్చున్నప్పుడే మీ వెన్నెముక మీద ఎక్కువ భారం పడుతుంది.
- కూర్చొనే భంగిమ సరిగా లేకపోతే మీ వెన్నెముకకు ష్టాలు తప్పవు. అందుకే కూర్చొనే కుర్చీ సక్రమంగా ఉందో లేదో చూసుకోండి.
- వెన్నెముక దిగువ భాగానికి సపోర్ట్ ఉండేలా, నిటారుగా కూర్చొనేందు అనువైన కుర్చీని ఎంచుకోండి.
- గంటల తరబడి అలాగే కూర్చొని పోకుండా అప్పుడప్పుడూ లేచి నాలుగు అడుగులు వేయండి. మీ వెన్నెముక రిలాక్స్ అవుతుంది.
- ఊగే కుర్చీలో కూర్చున్నా, కూర్చొని సరదాగా ఊగుతున్నా మీరు మీ వెన్నెముకతో ఆటలాడుతున్నారన్నమాటే.

 

నెలవంక నడవలేడు...నడిపిస్తున్నాడు


డాన్ బాస్కో రిహాబిలిటేషన్ సెంటర్, రామంతాపూర్, హైదరాబాద్ వికలాంగుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.
ఒక వికలాంగుడు కన్నీరు పెడుతూ పాట పాడుతున్నాడు...
వింటున్న వారిలోంచి ఒకాయన లేచి.. "ఆపండి... ఏడిపించే ఇలాంటి పాటలొద్దు. చిన్నప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి ఉన్నాం. ఇక చాలు. వికలాంగుల్లో ధైర్యం పెంచే పాటలు పాడండి. ఆశ నింపే మాటలు చె ప్పండి. జై వికలాంగ్'' అని కష్టంగా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. ఆయన పేరు శ్రీనివాస్.
వికలాంగులకు నాయకుడు.

నెల రోజుల తర్వాత.. ఎన్పిడిఓ కార్యాలయం, మలక్పేట...
ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్ని కలిసేందుకు వచ్చారు. తాము తీయబోతున్న డాక్యుమెంటరీ కోసం ఒక వికలాంగ బాలుడు కావాలని అడిగారు. కథేంటని అడిగారు శ్రీనివాస్. వచ్చిన వారు క్లుప్తంగా చెప్పారు. "బావుంది. నథింగ్ ఎబౌట్ అజ్ వితౌట్ అజ్.. మేం లేనిదే మా గురించి వద్దు.. మమ్మల్ని పనికిరాని వాళ్లుగా కాదు.. మేమూ సాధించగలమని చూపించండి'' అన్నారు శ్రీనివాస్. రెండు సంఘటనలు చాలు ఆయనేంటో చెప్పడానికి. ఏనుగమ్మ ఏనుగు అని భుజాల మీద ఆడించిన తండ్రి తన కొడుకు నడవలేడని తెలిసి రోజు బాధపడి ఉంటాడు. కానీ ఈరోజు 'నా కొడుకు వికలాంగుడు అయితేనేం...' అని గర్వంగా చెబుతున్నాడు.

ఇంటిల్లిపాదీ బాధితులే

విషం తాగి శివుడు గరళకంఠుడు మాత్రమే అయ్యాడు. కాని విషంలాంటి ఫ్లోరైడ్ నీళ్లకు నల్గొండలో చాలామంది వికలాంగులయ్యారు. అలాంటి వారిలో శ్రీనివాస్ ఒకడు. ఆయన తల్లి చక్రమ్మ కూడా ఫ్లోరోసిస్ బాధితురాలే. ముగ్గురు తమ్ముళ్లలో ఇద్దరు, ఇద్దరు చెల్లెళ్లలో ఒకరు కూడా అలాంటివారే. అందరిలో పెద్దవాడు శ్రీనివాస్. వైకల్యంలో కూడా. నాన్న పెంటోజిరావు స్వాతంత్య్ర సమరయోధుడు. కాని ఆర్థిక స్వాతంత్య్రం మాత్రం సాధించలేకపోయాడు. పేదరికంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో భార్యాపిల్లల వైకల్యం చూసి కృంగిపోయాడు. చదివిస్తేనన్నా వారి 'కాళ్ల' మీద వారే నిలబడతారనుకున్నాడు.

పిల్లలందర్నీ సర్కారు బళ్లో వేశాడు. అసలు నడవలేని శ్రీనివాస్ని మాత్రం దగ్గరలోని చిన్న ప్రైవేటు బళ్లో చేర్పించాడు. రోజూ భుజానెత్తుకుని బళ్లో వదిలి, సాయంత్రం తీసుకొచ్చేవాడు. తను ఆలస్యంగా వెళ్లిన రోజు ఒంటరిగా కూర్చుని ఏడ్చే శ్రీనివాస్ని చూసి తల్లడిల్లిపోయేవాడు. అతనికి నడక నేర్పాలని నడుం కట్టాడు. వానకు రాళ్లు తేలిన మట్టిగోడ మీద రోజూ నడిపించేవాడు. రకరకాల వ్యాయామాలు చేయించేవాడు. శ్రీనివాస్లో చలనం మొదలైంది. హైస్కూల్ చదువుకోసం శ్రీనివాస్ని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో నేర్పించారు తల్లిదండ్రులు. అది ఇంటికి చాలాదూరం. తోడు ఉంటేనేగానీ అంత దూరం నడవలేని శ్రీనివాస్ తమ్ముళ్లు, స్నేహితుల సహాయంతో పదో తరగతి వరకు చదివాడు.

ఇల్ల్లొదిలి హాస్టల్కు..

తుఫాను వచ్చేముందు వాతావరణం ఒక్క క్షణం ప్రశాంతంగా మారిపోతుంది. జీవితం గొప్ప మలుపు తిరిగే ముందు కూడా కాలం ఒక్కనిమిషం అలా ఆగిపోతుందేమో. శ్రీనివాస్ అలాంటి పరిస్థితుల్లో పడ్డాడు. పదో తరగతి అయిపోయాక ఇంటర్ చదవాలనుకున్నాడు. కానీ పేదరికం గుర్తొచ్చి ఆగిపోయాడు. హైదరాబాద్ వెళ్లి హాస్టల్లో చేరతానన్నాడు. 'తోడులేనిదే కదల్లేని శ్రీనివాస్ హైదరాబాద్లో ఎలా ఉంటాడు? పంపాలా.. వద్దా?' ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. 'ఇంకెన్నాళ్లు మా చేయి పట్టుకుని తిరుగుతాడు. వాడి కాళ్ల మీద వాడ్ని నడవనీ..'- వాళ్లో నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాస్ మలక్పేటలోని వికలాంగుల హాస్టల్లో చేరాడు. రోజు అతనికి తెలియదు హాస్టల్ తన జీవితాన్ని మార్చబోతోందని. తాను అనుభవించిన పేదరికంకన్నా దరిద్రంగా కనిపించింది హాస్టల్. అక్కడ సరైన వసతులు ఉండేవి కావు. మంచి ఆహారం పెట్టేవాళ్లు కాదు. సబ్బులు, సరుకులు సరిగ్గా ఇచ్చేవారు కాదు. పుస్తకాలు సగం చదువులయ్యాక వచ్చేవి. ఇవన్నీ చూశాక శ్రీనివాస్లో ఆలోచన మొదలైంది. మేమంటే ఎందుకింత నిర్లక్ష్యం అందరికీ అని.

ఎత్తుపల్లాలు...

శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి బాగా కలుపుగోలు మనిషి. చలాకీగా ఉండేవాడు. సీనియర్లను, జూనియర్లను పోగేసి వార్డెన్తో గొడవకు దిగేవాడు. ఇతర హాస్టళ్లకు వెళ్లి కాలేజి విద్యార్థులను కూడగట్టేవాడు. అందరూ కలిసి కళాశాల విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ కావాలని ధర్నాలు చేశారు. ఇంటర్ రెండో సంవత్సరంలో వారి కోరిక నెరవేరింది. సలీమ్నగర్లో వారికోసం ప్రత్యేక హాస్టల్ ప్రారంభమైంది. శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ, టైప్ నేర్చుకుంటూ , వికలాంగుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ బిజీ అయిపోయాడు. అతనికి ఎల్ఎల్బి చదవాలని ఉంది. కానీ పరిస్థితులు అతన్ని జర్నలిజం వైపు నడిపించాయి.

'ఉదయం' పత్రికలో కంట్రిబ్యూటర్గా చేరాడు. 1992లో ఉదయం పత్రిక మూత పడింది. తోటి విలేకరులంతా ఇతర పత్రికల్లో చేరిపోయారు. శ్రీనివాస్కు మాత్రం ఇంకో పత్రికలో చేరాలని లేదు. వికలాంగుల కోసం పనిచేయాలనుకున్నాడు. స్థానిక ఎమ్మెల్యే సహాయంతో యూత్ కాంగ్రెస్లో వికలాంగుల కాంగ్రెస్ సమాఖ్య పేరుతో ఒక విభాగాన్ని, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వికలాంగుల ఫోరమ్ని స్థాపించాడు. వికలాంగుల ఇళ్ల పట్టాల కోసం పోరాడాడు. 1994లో సెక్రటేరియట్ ముందు నిరాహాదీక్ష కూడా చేశాడు. పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది కానీ అసలైన లబ్దిదారులకు అందకుండా స్వార్థపరుల చేతులకు చిక్కాయి పట్టాలు. రాజకీయాలు అతనికి నచ్చలేదు.

పత్రిక నడిపాడు

అతని జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. 1995లో వికలాంగుల చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దాని గురించి గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నాడు. చిన్నప్పట్నించి పరిచయం ఉన్న స్నేహితులందరినీ కలిశాడు. డబ్బు పోగేశాడు. 96లో 'వికలాంగుల వార్తా తేజ' పేరుతో మాస పత్రికని ప్రారంభించాడు. కష్టంగా రెండేళ్లు నడిపించాడు. డబ్బంతా ఖర్చయిపోయింది. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు. అదీ నడవలేదు. యాక్షన్ ఎయిడ్తో కలిసి కొంత కాలం పనిచేశాడు.

వారి నుంచి ఒక పనిని ప్రొఫెషనల్గా ఎలాచేయాలో నేర్చుకున్నాడు. వికలాంగుల కోసం తాను నడుపుతున్న పత్రికకు సహకరించాలని యాక్షన్ ఎయిడ్ని కోరాడు. అతని ఆలోచనలు నచ్చి 1999లో లక్షా 36 వేల రూపాయలిచ్చింది సంస్థ. సొమ్ముతో వికలాంగుల చట్టాలు, హక్కు లు, ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి పథకాలు, న్యాయసలహాలు తదితర అంశాలను పొందుపరుస్తూ ఒక మ్యాగజైన్ని రూపొందించి లక్ష మందికి పంచిపెట్టాడు. అతని కల నెరవేరింది. గ్రామీ స్థాయిలో వికలాంగులకు కూడా పత్రిక చేరింది. సంవత్సరం శ్రీనివాస్కు వికలాంగుల స్వయం ఉపాధిలో బెస్ట్ ఎంప్లాయీగా జాతీయ అవార్డు లభించింది.

జాతీయ సంస్థలతో కలిసి...

యాక్షన్ ఎయిడ్లో ఉండగానే శ్రీనివాస్ జాతీయ వికలాంగుల సంస్థలతో కూడా కలిసి పనిచేశాడు. తమ జాతీయ నాయకుడు జావేద్ లాంటి వారి సహకారంతో తాను రూపొందించిన పత్రికను అన్ని భాషల్లోనూ ముద్రించాడు. అది 2001 జనాభా లెక్కల్లో వికలాంగుల సక్రమ గుర్తింపుకు ఉపయోగపడింది. ఆరు జిల్లాల్లో వికలాంగుల స్వాధికార ప్రాజెక్టును రూపొందించి 2002లో ప్రభుత్వం నుంచి 110 కోట్ల రూపాయల సహాయాన్ని పొందాడు. ప్రాజెక్టు చేస్తున్నప్పుడు పరిచయమైన భాగ్యశ్రీ(వికలాంగురాలు)ని 2003లో ఆసియా సోషల్ ఫోరమ్ వేదికపై పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఒక అబ్బాయి. అతను కూడా వికలాంగుడే.

నెట్వర్క్

పత్రిక నడిపిస్తూనే 2003లో వికలాంగుల కోసం ఒక నెట్వర్క్ని ప్రారంభించాడు శ్రీనివాస్. అన్ని జిల్లాలు తిరుగుతూ వికలాంగుల సం ఘాలను ఏకం చేస్తూ ఎన్పిడిఓ(నెట్వర్క్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ ఆర్గనైజేషన్)ని ఏర్పాటుచేశాడు. ఒక రూపాయి సభ్యత్వంతో 75 వేల మందిని సభ్యులుగా చేర్చాడు. 3 వేల మందికి శిక్షణ ఇచ్చి గ్రామ స్థాయిలో వికలాంగులకు స్వయం ఉపాధి, పెన్షన్లు, హక్కులు, చట్టాల గురించి అవగాహన కలిగిస్తున్నాడు. వికలాంగులకు రాజకీయ గుర్తింపు రావాలని 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిపై ఒక అంధుణ్ణి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఒక వికలాంగురాలిని పోటీ చేయించాడు. ప్రస్తుతం ఎన్పిడిఓ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 52 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అందుకే 2010 డిసెంబర్ 3 వికలాంగులకు ఉపాధి కల్పించిన బెస్ట్ ఎంప్లాయర్గా మరోసారి జాతీయ అవార్డు తీసుకున్నారు శ్రీనివాస్. ప్రస్తుతం 100 పాఠశాలను అధ్యయనం చేసి వికలాంగ బాలలకు 1995 చట్ట ప్రకారం హక్కులు కల్పించాలని కోరుతూ హైకోర్టులో రిట్ వేశాడు. ఆయన వైకల్యం ఆయన్ని ఒకనాడు ఎంత కృంగదీసిందో గాని ఇవ్వాళ మాత్రం చాలామందికి సహాయపడుతోంది.

- బీరెడ్డి నగేష్రెడ్డి
beereddy12@gmail.com