1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మహారాష్టల్రో చూడదగ్గ ప్రదేశాలు, క్షేత్రాలు ఏమేమి ఉన్నాయి?

మహారాష్టల్రో చూడదగ్గ క్షేత్రాలు, ప్రదక్షిణ మార్గంలో చెబుతాను. ఆ రాష్ట్ర పడమటి అంచున పొడవుగా ఉన్న కొండల వరుసలో పూర్తిగా దక్షిణపు చివరన కొల్హాపూర్ ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాలక్ష్మి ఆలయం అక్కడ ఉంది. అక్కడ నుంచి ముందుకు ఉత్తరంగా సతారాకు 18 కి.మీ దూరంలో శివాజీ గురువు సమర్థ రామదాసు నివసించిన సజ్జనగర్ ఉంది. అక్కడ నుంచి ఉత్తరంగా పుణె వెళ్ళే మార్గంలో కృష్ణానది జన్మస్థలం మహాబల్వేర్ ఉంది. అక్కడి నుంచి ఉత్తరంగా ఉన్న పుణె (పూనా)లో చెప్పుకోదగ్గ ఆలయాలు ఏమీ లేవు గాని, పుణె చుట్టూ ఎనిమిది ఊళ్ళలో అష్ట వినాయక క్షేత్రాలు ఉన్నాయి. పుణె నుంచి ఉత్తరంగా పడమటి కనుమలు భీమానది జన్మస్థలం. అక్కడే భీమశంకర్‌లో జ్యోతిర్లింగ ఆలయం ఉంది. అక్కడి నుంచి తూర్పుగా కళ్యాణ్ - మన్మాడ్ రైలు మార్గం మధ్యలో నాసిక్ ఉంది. అక్కడకు దగ్గరే గోదావరి నది జన్మించిన స్థలం, త్య్రంబకేశ్వరుని జ్యోతిర్లింగ ఆలయం ఉన్నాయి. నాసిక్ నుంచి ఆగ్నేయంగా ఉన్న ఔరంగాబాద్‌లోనూ, దానికి దగ్గరలో ఉన్న దౌలతాబాద్‌లోనూ చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి.

దౌలతాబాద్ దాటిన తరువాత ఎల్లోరాలో, అద్భుతంగా అనిపించే పురాతన గుహలు, అక్కడే ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం ఉన్నాయి. ఔరంగాబాద్ నుంచి దక్షిణంగా వికారాబాద్ వైపు వచ్చే మార్గంలో పరళీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం ఉంది. ఔరంగాబాద్ నుంచి ఆగ్నేయంగా ఉన్న ముదుఖేడ్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రైలు మార్గంలో కినావత్ అనే ఊరికి దగ్గరలో ఉన్న మాహుర్యంలో అష్టాదశ శక్తిపీఠం అయిన ఏకవీరికాదేవి ఆలయం ఉంది. ఈమెను ఏకవీరాదేవి అని కూడా పిలుస్తారు. పుణె నుంచి వాడీ వరకు ఉన్న రైలు మార్గంలో షోలాపూర్ నుంచి పడమరగా పండరీపూర్ ఉంది. షోలాపూర్ నుంచి ఈశాన్యంగా శివాజీ ఆరాధ్యదేవత తుల్జాభవాని ఆలయం ఉన్న తుల్జాపూర్ ఉంది. ఇవన్నీ పుణ్యక్షేత్రాలే కాదు, తప్పక చూడవలసిన స్థలాలు కూడా!

కామెంట్‌లు లేవు: